నేరేడుచర్ల మార్చి 8 : సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయమని బీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి అన్నారు. రేవంత్ వ్యవహార శైలే ఇందుకు నిదర్శనం అన్నారు. శనివారం బీఆర్ఎస్ నేరేడుచర్ల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్రెడ్డి తన గురువు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి తొత్తులా వ్యవహరిస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నట్లు దుయ్యబట్టారు. ఓటుకు నోటు కేసు నుండి బయటపడేందుకు కేంద్రంతో లాలూచి విషయంలో చంద్రబాబును ముందుపెట్టి రేవంత్ రెడ్డి నడిపిస్తున్నట్లుగా తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన ప్రతి చోటా బీజేపీ గెలువడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డికి అడుగడుగునా కేంద్ర మంత్రులు అండదండగా ఉంటూ వస్తుండడం పలు అనుమాలకు తావిస్తుందన్నారు. స్వయాన కాంగ్రెస్ నాయకులే తమ ఓటమికి రేవంత్ రెడ్డి కారణం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. మంత్రులకు ప్రాజెక్టులపై అవగాహన లేకపోవడంతో చంద్రబాబు ఆంధ్రకు యధేచ్చగా నీటిని తరలించకపోతున్నారని, అంతే కాకుండా ప్రాజెక్టులను అడ్డుకునేలా కేంద్రానికి లేఖలు రాస్తున్నట్లు తెలిపారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్ర మహిళా లోకాన్ని మోసం చేసిందే కాకుండా సిగ్గులేకుండా సంబరాల పేరుతో కాంగ్రెస్ నేతలు హంగామా చేస్తున్నారన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కోట్లాది రూపాయలని పత్రికా ప్రకటనలకు ఇచ్చారే తప్పా, మహిళలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందన్నారు. కావునా గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను మహిళలు నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. స్కూటీ ఏమైందని, రూ.2,500 పథకం ఏమైందని ఇతర హామీల అమలుకు అడుగడుగునా కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు.