సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో (Suryapet) విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆత్మకూరు ఎస్‌లో కురిసన వానాలకు మోడల్ స్కూల్ చెరువును తలపిస్తున్నది. కోదాడలోని పలు కాలనీల్లో వరద నీరు నిలిచిపోయింది. దీంతో స్థానికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోదాడ పెద్ద చెరువు మత్తడి పోయడంతో ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. మోతె మండలం ఉర్లుగొండ వద్ద పాలేరు వాగు పొంగిపొర్లుతున్నది.
కూచిపూడి, తొగర్రాయి వద్ద అంతరగంగా వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. చిలుకూరు మండలంలో నారాయణపురం, బేతవోలు చెరువులు అలుగు పారుతున్నాయి. నడిగూడెం మండలం రత్నవరం వాగు ఉధృతితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోండ్రియాల-తుమ్మర మధ్య రహదారిపై వరద ప్రవాహంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. నడిగూడెంలో వరద నీరు ఇండ్లలోకి చేరింది. చౌదరి చెరువు మత్తడి దుంకడంతో పలు కాలనీలు నీటమునిగాయి. దీంతో ఇండ్లలోకి చేరిన నీటిని కాలనీవాసులు ఎత్తిపోస్తున్నారు.