VV Lakshminarayana : విద్యార్థులు జీవితంలో గొప్ప విజయాలు సాధించాలంటే నిర్దిష్టమైన సూత్రాలు పాటించాలని, తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి ఎదగాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. 2026 పదో తరగతి వార్షిక పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఆదివారం కత్రం యంగ్ ఇండియా మెరిట్ స్కాలర్షిప్పులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదవడమే కాకుండా పాఠ్యాంశాల సారాంశాన్ని గ్రహించాలన్నారు. అబ్దుల్ కలాం చెప్పినట్లు లక్ష్య సాధన కోసం నిద్రపట్టకుండా చేసే కలలు కని సాకారం చేసుకోవాలన్నారు.
తల్లిదండ్రులు గర్వపడేలా, చదివిన పాఠశాలకే రేపు ముఖ్య అతిథిగా వెళ్లేలా, మీ సంతకాన్ని ఒక ఆటోగ్రాఫ్గా మార్చుకునేలా ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. గ్రామీణ విద్యార్థుల పాలిట ఆణిముత్యాలను వెలికితీస్తూ ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు శ్రీకాంత్ రెడ్డి నాలుగు లక్షల ఇరవై వేల స్కాలర్షిప్లను అందించటం అభినందనీయమన్నారు. మార్కులు కేవలం పునాది మాత్రమేనని, ఇంటర్ తర్వాత వచ్చే ఐఐటీ, నిట్, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఈ సూపర్ 39 విద్యార్థులు సీట్లు సాధించి దేశానికి వన్నె తేవాలని ఆకాంక్షించారు. కత్రం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జన్మనిచ్చిన ప్రాంతానికి సేవ చేసే భాగ్యం కలగటం తన అదృష్టం అన్నారు. దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన తనకు నిరుపేదలు ఎదుర్కొనే ఇబ్బందులు తెలుసని, అందుకే అవకాశం ఉన్నంత మేరకు నిరుపేదలను ఆదుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.
కత్రం ఫౌండేషన్ సభ్యులు, మాజీ ప్రధానోపాధ్యాయులు ముత్తవరపు రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఈఓలు సలీం షరీఫ్, శ్రీనివాసరావు, క్లబ్ అధ్యక్షులు కత్రం సీతారాం రెడ్డి, కార్యదర్శి పోటు రంగారావు, నాని, సీనియర్ న్యాయవాది నాగార్జున, పిఆర్టియు జిల్లా అధ్యక్షులు జితేందర్ రెడ్డి, బడుగుల సైదులు, బంధం వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి, తీగల నరేష్, కత్రం కిరణ్, ముడియాల సత్యనారాయణ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.