Bathukamma | ఎంగిలిపూలతో బతుకమ్మ వేడుకలు సూర్యాపేటలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈవేడుకల్లో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సతీమణి గుంటకండ్ల సునీత పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చి కాసేపు క్యాంపు కార్యాలయంలో ఉయ్యాల పాటలు పాడుతూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బతుకమ్మ చౌరస్తాలో వేలాదిగా తరలివచ్చిన మహిళలతో సందడిగా వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే విద్యానగర్‌లో బీఆర్ఎస్ నాయకుడు బావ్ సింగ్ – సంధ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని.. బతుకమ్మ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసి ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత పన్నెండేళ్లుగా స్వరాష్ట్రంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ నాయకత్వంలో బతుకమ్మ సంబురాలు ఖండంతరాలకు వ్యాపించిందన్నారు. అంతేకాకుండా బతుకమ్మ పండుగ అధికారికంగా నిర్వహించుకుంటున్నామంటే ఆ ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఆడపడుచులకు తోబుట్టుగా కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలు తప్ప ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ఒక్క చీర కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. పూలను పూజించే గొప్ప సంస్కృతి ఉన్న మన ఆచార సాంప్రదాయాలను ఐక్యతతో కొనసాగించుకుందామని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, మాజీ మార్కెట్ చైర్మన్ ఉప్పల ఆనంద్, మాజీ కౌన్సిలర్లు నిమ్మల స్రవంతి శ్రీనివాస్ గౌడ్, ఆకుల కవిత లవకుశ, సుంకరి అరుణ రమేశ్, కళ్లేపల్లి మహేశ్వరీ, సంధ్య బావ్ సింగ్, ఎండీ సల్మా మస్తాన్, సారంగుల కరుణ శ్రీ, విజయ, సారగండ్ల మాణిక్యమ్మ, బొప్పని పద్మ, ఢిల్లీ పావనితోపాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.