ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Apr 24, 2020 , 02:07:07

రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లలోనే నిర్వహించుకోవాలి

రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లలోనే నిర్వహించుకోవాలి

  • కంటైన్మెంట్‌ జోన్‌లో మొబైల్‌ వాహనాల ద్వారా నిత్యావసరాలు సరఫరా చేస్తాం
  • ముస్లిం మత పెద్దల సమావేశంలో కలెక్టర్‌ పీజే పాటిల్‌

నల్లగొండ, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ లూర్యల్లో భాగంగా రంజాన్‌ మాసంలో ముస్లింలందరూ ఇళ్లలోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆయన ముస్లిం మతపెద్దలతో మాట్లాడారు. కంటైన్మెంట్‌ జోన్‌లో ఉన్న ముస్లింలందరికీ మొబైల్‌ వాహనాల ద్వారా పండ్లు, కూరగాయలు, నిత్యావసర సరుకులు సరఫరా చేస్తామన్నారు. వలస కూలీలకు రేషన్‌ అందజేస్తామని, మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించే మౌలానాలకు, ముస్లిం ఖననవాటికను నిర్వహించే వ్యక్తులకు పాస్‌లు మంజూరు చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, రాహుల్‌శర్మ, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.

జిల్లాకేంద్ర దవాఖానలో కొవిడ్‌ వార్డు ఏర్పాటుచేయాలి: కలెక్టర్‌

జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో కోవిడ్‌ వార్డుతోపాటు ఐసీయూ సెంటర్‌ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వైద్యాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విపత్తు సమయంలో జిల్లా వైద్య సిబ్బంది హెడ్‌క్వార్టర్స్‌లో ఉండాలన్నారు. రెండు మొబైల్‌ ఎక్స్‌రే యంత్రాలు కొనుగోలు చేయాలని, నల్లగొండ, మిర్యాలగూడ దవాఖానల్లో ఎన్‌-95 మాస్కులు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు సిద్ధంగా ఉంచాలన్నారు. దేవరకొండ, మిర్యాలగూడ దవాఖానల్లో అనస్తీషియా డాక్టర్లను కేటాయించాలన్నారు. 

ఉపాధి లేనివారికి పని కల్పించాలి

లాక్‌డౌన్‌ నేపథ్యంలో గ్రామీణప్రాంతాల్లో ఉపాధి లేనివారిని గుర్తించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో  పని కల్పించాలని కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓలు, ఏపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులతో కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఉపాధి పనుల్లో భాగంగా నర్సరీల్లో మొక్కల పెంపకం, మొక్కల సంరక్షణ, ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టాలన్నారు. డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. 


logo