హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 43 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. మరో వారంపాటు దేశంలోని పలు రాష్ర్టాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో కొన్ని రోజులుగా భిన్న వాతావరణం ఉంటున్నది. ఓ వైపు ఎండలు మండుతుండగా, మరోవైపు అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. రెండ్రోజుల క్రితం పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లోనూ వర్షం దంచికొట్టింది. భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం ఉన్నదని, గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.
నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, రామగుండం ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అదే సమయంలో పగటివేళ 36 నుంచి 42 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడి ఉంటుందని చెప్పారు. దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణలో ఎండ తీవ్రత ఎకువగా ఉంటుందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైనే ఎండల తీవ్రత నమోదయ్యే చాన్స్ ఉన్నట్టు తెలిపారు. ఇక హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయని పేర్కొన్నారు. సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ అధికారులు వెల్లడించారు.