బండ్లగూడ, ఏప్రిల్ 23 : శ్రీరాముడిని మొక్కుదాం.. బీజేపీని ఓట్లతో తొక్కుదాం అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మంగళవారం రాజేంద్రనగర్‌లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతుగా నిర్వహించిన నామినేషన్ ర్యాలీలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ సురభి వాణీదేవితో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్వేల్ వద్ద వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 10 నుంచి 12 పార్లమెంట్ సీట్లను గెలుచుకున్నట్లు అయితే కాంగ్రెస్, బీజేపీ వారు కేసీఆర్ చెంతకు వచ్చి తమకు మద్దతు ఇవ్వాలని బతిమాలుతారని అన్నారు. పదేళ్ల పాలనలో బీజేపీ దేశానికి ఏం చేసిందని, తెలంగాణకు, చేవెళ్లకు ఏం చేశారని ప్రశ్నించారు. చేవెళ్ల నియోజకవర్గానికి నీళ్లు అందించే పాలమూరు ప్రాజెక్ట్‌కు బీజేపీ నేతలు ఎందుకు జాతీయ హోదాను కల్పించలేదని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని మంత్రి పదవులలో కొనసాగిన మహేందర్‌రెడ్డి, ఎంపీగా రంజిత్‌రెడ్డి లాంటి వారు పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు వదిలి వెళ్లారని మండిపడ్డారు. ఇలాంటి అవకాశవాదులను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 200 నుంచి 220 వరకు, కాంగ్రెస్‌కు 150 నుంచి 200 వరకు వస్తాయని అనుకుంటున్నారని, ఆ పార్టీలకు దశదిశ లేదన్నారు. తెలంగాణలో పాలన చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు.
శ్రీరాముడు అందరివాడు
శ్రీరాముడు అందరివాడని ఆయన దేవుడు అని కేటీఆర్ తెలిపారు. రాముడితో ఇబ్బంది లేదు కానీ బీజేపీతోనే ఇబ్బంది అన్నారు. బీజేపీ నేతలు శ్రీరాముడి పేరుతో మత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో బీజేపీ ఓడినా కూడా శ్రీరాముడికి నష్ట్రం ఏమీ లేదన్నారు. పదేళ్ల క్రితం బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు వంద డాలర్లు ఉండగా., ఇప్పుడు 84 డాలర్లకు వచ్చిందని తెలిపారు. పెట్రోల్ ధర రూ.70 ఉండగా 110 వరకు పెంచారని తెలిపారు. గ్యాస్ ధర 400 నుంచి 900 పెంచారని గుర్తు చేశారు. క్రూడాయిల్ ధరలు తగ్గినా.. పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గడం లేదని విమర్శించారు. అందుకే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో 12 సీట్లను గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పి మనకు అవసరమైన వాటిని పొందవచ్చని తెలిపారు. బడుగు బలహీనవర్గాలకు చెందిన జ్ఞానేశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ నాయకులను నిలదీయండి
అర చేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను ప్రజలు నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరితమైన హామీలను వివరించాలన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చి వంద రోజులైనా నేరవెర్చలేక పోయిందని అన్నారు. పరుగెత్తుకుంటూ వెళ్లి రెండు లక్షలు తెచ్చుకోవాలని పిలుపునిచ్చిన రేవంత్‌రెడ్డి ఇప్పుడేమో రూణ మాపీకి సమయం కావాలంటూ కొత్త గడువును విధిస్తున్నారని అన్నారు. 111 జీవోను తెలంగాణ ప్రభుత్వం ఎత్తి వేసిందని తద్వారా అనేక మంది రైతులకు ఎంతో మేలు జరిగిందని తెలిపారు.
చేవెళ్ల పార్లమెంట్ నుంచి మొదటిసారిగా బీసీ నాయకుడు కాసాని
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటి వరకు బీసీలకు స్థానం దక్కలేదని కేటీఆర్ అన్నారు. అందుకే కేసీఆర్ బడుగు, బలహీన వర్గాలకు చెందిన బీసీ నాయకుడైన కాసాని జ్ఞానేశ్వర్‌కు పార్లమెంట్ సీటును ఇచ్చి బరిలోకి దింపారని తెలిపారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలతో పాటు అందరూ ఏకమై ఓటు వేసి గెలిపించుకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు.