సూర్యాపేట టౌన్, మార్చి 25 : పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చేసే కఠిన ఉపవాస దీక్షలు ఫలించాలని. అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముస్లింలతో ఉపవాస దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందడుగు వేసి అన్ని పండుగలను గౌరవించారన్నారు.
తెలంగాణలో గంగ జమునా తెహజీబ్లా ఒకరి పండుగలను ఒకరు గౌరవించే విధానం రావాలని, అది ప్రభుత్వంతోనే మొదలు కావాలని భావించారని తెలిపారు. అందులో భాగంగానే దసరాకు బతుకమ్మ చీరెలు, క్రిస్మస్కు కానుకలు, రంజాన్లకు తోఫాలు అందజేశారని, విందులు ఏర్పాటు చేశారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అద్భుతమైన సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం దీన్ని కొనసాగిస్తూ ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు.
ముస్లింలు ప్రశాంత వాతావరణంలో రంజాన్‌ను జరుపుకోవాలని కోరుతూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, ఏఐసీసీ సభ్యులు సర్వోత్తంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఎస్కే తాహేర్ పాషా, సయ్యద్ రియాజుద్దీన్, సయ్యద్ సలీమ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజద్ అలీ, ఇమామ్‌లు, మౌజన్లు తదితరులు పాల్గొన్నారు.