Zomato | ‘జస్ట్ టెన్ మినిట్స్’.. ఈ మాట డెలివరీ స్టార్టప్స్ విజయ తంత్రం. కొనుగోలుదారులను మెప్పించే ఆకర్షణ మంత్రం. పది నిమిషాల్లో నచ్చిన ఆహారం, అత్యవసర మందులు, వంటింటి సరుకులు.. సమస్తం గడప ముందరికి తీసుకొస్తామంటూ ‘క్విక్ కామర్స్’కు తెరలేపాయి చాలా సంస్థలు.
లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా వస్తామంటే ఎవరూ ఒప్పుకోరు. ఆలస్యం విషం, వేగమే అమృతం. వందేండ్ల కంపెనీ.. రెండొందల ఏండ్ల సేవ.. అంటూ గొప్పలు చెప్పుకొనే కాలం చెల్లిపోయింది. మార్కెట్లోకి ఎప్పుడు వచ్చామన్నది ఎవరికీ అక్కర్లేదు. ఎంత తొందరగా కొనుగోలుదారును చేరామన్నదే క్విక్ కామర్స్‌లో ‘కీ’లక విషయం. అప్పట్లో 24 గంటల్లో డెలివరీ.. అంటేనే అంతా ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడు, పది నిమిషాల్లోనే మీ కాలింగ్‌బెల్ కొట్టేస్తాం.. అంటున్నాయి డెలివరీ సంస్థలు.
స్టోర్ నుంచి డోర్.. దూరం తగ్గింది. కిచెన్‌లో వంట చేస్తుంటే.. కూరలోకి ఉప్పు లేకపోతే.. గాభరా పడాల్సిన పన్లేదు. స్మార్ట్‌ఫోన్‌లో ఆర్డర్ చేస్తే కుతకుతమని ఉడికేలోగా లవణం లావణ్యంగా ఇంటికి వచ్చేస్తుంది. మార్కెట్ స్పీడ్ అంతగా పెరిగింది! ఈ మధ్య ‘జొమాటో ఇన్స్టంట్’ పేరుతో కొత్త సేవను ప్రారంభించింది జొమాటో. ‘పది నిమిషాల్లో ఏ సంస్థా ఆహారం డెలివరీ చేయడం లేదు. కానీ మేం చేసి చూపిస్తాం’ అని చాలెంజ్ చేసింది. వెనువెంటనే సమీప ప్రత్యర్థి స్విగ్గీ కూడా క్విక్ కామర్స్‌కి సై అన్నది. ‘మేము మాత్రం చూస్తూ ఉంటామా?’ అంటూ ఓలా డాష్ ద్వారా ఆహారాన్ని నిమిషాల్లోనే అందించే పని మొదలుపెట్టింది. క్విక్ కామర్స్‌లో ఇప్పటికే కిరాణా సరుకులు డెలివరీ చేస్తున్న ఓలా డాష్ కిచిడీ, పిజ్జా, రోల్స్ వంటి తాజా వంటకాలను ఎంపిక చేసిన ప్రాంతాల్లో పది నిమిషాల్లో డెలివరీ చేస్తున్నది. జెప్టో అనే గ్రాసెరీ డెలివరీ యాప్ కూడా పది నిమిషాల సవాలును స్వీకరించింది. దీని ద్వారా కిరాణా సరుకులు, కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు.. తెప్పించుకోవచ్చు. ‘మాటకు పది నిమిషాలని అంటున్నాం కానీ, మా సగటు డెలివరీ సమయం ఎనిమిది నిమిషాల పైచిలుకే’ అంటున్నారు నిర్వాహకులు. బిగ్ బాస్కెట్ మాత్రం.. మేం పది నుంచి ఇరవై నిమిషాల లోపు డెలివరీ చేస్తాం. ఆ వ్యవధి దాటితే ఐదుశాతం డిస్కౌంట్ ఇచ్చేస్తాం’ అని ఓపెన్ ఆఫర్ ప్రకటించింది.
సరుకుల వరకూ ఫర్వాలేదు. టిఫిన్లు, భోజనాల మాటేమిటి? అంత వేగంగా వండటం సాధ్యమేనా? కొంపదీసి నిల్వచేసిన ఆహార పదార్థాలను పంపుతారేమో? లేదంటే, ఉడికీ ఉడకని తిండి మొహాన కొడతారేమో?’ అన్న సందేహం కస్టమర్లను వెంటాడుతూనే ఉంది. ‘మూడు నుంచి నాలుగు నిమిషాలు వండటానికి పడుతుంది. ఆరేడు నిమిషాల్లో డెలివరీ చేస్తాం. క్విక్ డెలివరీ కోసం సమీపంలోని రెస్టారెంట్లనే ఎంచుకునేలా చూస్తాం’ అని జవాబిస్తారు స్విగ్గీ ప్రతినిధులు. రెండు, మూడు నిమిషాల్లో సిద్ధం చేయగలిగే మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్, పోహా, కాఫీ, చాయ్, బిర్యానీ, మోమోస్ వంటివాటిని మాత్రమే ఈ కేటగిరిలో అందిస్తామని చెబుతున్నారు. డెలివరీ సంస్థ బాగానే ఉంటుంది, ఆర్డర్ ఇచ్చిన పాపానికి కొనుగులుదారుడూ లొట్టలేసుకుని తింటాడు. కానీ, కెప్టెన్ కష్టాల గురించీ ఆలోచించాలి కదా? బయలుదేరిన మరుక్షణం నుంచి సరుకును చేరవేసే వరకూ.. ప్రతిక్షణం ఒత్తిడే. సాధ్యమైనంత వేగంగా వెళ్లాల్సిందే. ఆ తొందరలో ఎక్కడైనా ప్రమాదం జరిగితే, ఎవరిది బాధ్యత? అసలే ఇరుకైన రోడ్లు, ఇండికేటర్స్ లేని వీధులు, రోజుకో తీరుగా ట్రాఫిక్ మళ్లింపు, సిగ్నలింగ్‌లో మార్పులు, పండుగలు, రిపేర్లు, వన్‌వేలు, అన్నిటికీ మించి స్పీడ్ బ్రేకర్ల కన్నా స్పీడుగా బ్రేకులు వేయించే గుంతలు.. ఇన్ని కష్టాల్ని దాటుకుని పది నిమిషాల్లో డెలివరీ ఇవ్వడం అంటే ఒలింపిక్స్‌లో పతకం గెలుచుకొని రావడమే! వన్.. టూ.. త్రీ.. రన్!
ఆర్డర్ రాగానే డెలివరీ సిబ్బంది రంగంలోకి దిగుతారు. సరుకులు ప్యాక్ చేస్తారు. అప్పటికే సిద్ధంగా ఉన్న కెప్టెన్ చేతికి ప్యాకెట్ అందిస్తారు. ఆన్లైన్లోనే చెల్లింపు జరిగిపోయి ఉంటుంది కాబట్టి, లెక్క చూసుకోవాల్సిన పన్లేదు. ఈ పనంతా రెండు నిమిషాల్లో పూర్తయ్యేలా ప్రోగ్రామ్ చేశారు. మిగిలిన ఎనిమిది నిమిషాలూ డెలివరీకి. పది నిమిషాల డెలివరీ ప్రాజెక్టు కోసం.. వేగంగా బండి నడపగల సిబ్బందినే ఎంచుకుంటున్నారు. నిజానికి సబ్బులు, పప్పులు, బిర్యానీలు అత్యవసర వస్తువులేం కాదు. ఓ ఐదు నిమిషాలు ఆలస్యమైనా కొంపలేం మునిగిపోవు. కానీ, పోటీ సంస్థల కంటే తాము ముందున్నామని నిరూపించుకోవడానికే ఈ ప్రయత్నమంతా.
“ఆరోజు జొమాటోలో అందరూ సీఈవోలే.. అందరూ గుమాస్తాలే !”
“Zomato: జొమాటోకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?”
“Zomato | 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ.. జొమాటో ప్రకటనపై నెటిజన్ల షాకింగ్ రియాక్షన్స్ వైరల్”
“ఆన్లైన్లో పెళ్లి.. గూగుల్ మీట్లో గెస్టులు.. జొమాటో నుంచి ఇంటికి పెళ్లి విందు.. ఎక్కడో తెలుసా?”