బస్సు కూడా రాని తండా నుంచి మొదలైంది జటావత్ మోతీలాల్ ప్రయాణం. ‘నీ సన్నిధిలో చదువుకునే భాగ్యం కల్పించు తండ్రి’ అని తిరుమల వెంకన్నకు మొక్కుకున్న ఆ చేతులు.. ఇప్పుడు రాతిని దేవుడిగా తీర్చిదిద్దుతున్నాయి. ఆలయ నిర్మాణ శాస్త్రంలో పట్టుసాధించి ఆ ఘనత వహించిన తొలి గిరిపుత్రుడు అనిపించుకున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఉప స్థపతిగా తన బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించిన డాక్టర్ జటావత్ మోతీలాల్ ( Dr. Jatavath Mothilal ) ప్రస్థానం ఆయన మాటల్లోనే..
మాది నల్గొండ జిల్లా చందంపేట మండలం నేరట్లతండా. మా తండాకు ఇప్పటికీ బస్సు రాదు. అంత మారుమూల ప్రాంతం. నాన్న రూప్‌లాల్. అమ్మ మోతీభాబాయి. నాకు ఇద్దరు అక్కలు, తమ్ముడు, చెల్లెలు. ఇద్దరు అక్కలు పుట్టిన తర్వాత కొన్నేండ్లకు ఒకరోజు రాత్రి కలలో ‘ఏడు మెట్లు ఎక్కివస్తే మగబిడ్డను ఇస్తా’ అని ఎవరో చెప్పారట. మా ఇంటిదేవుడు తిరుపతి వెంకన్న. దీంతో నాన్న తిరుపతికి కాలినడకన వెళ్లొచ్చారు. తర్వాత కొంతకాలానికి నేను పుట్టాను. మాకు పది ఎకరాలు ఉన్నప్పటికీ, సాగునీరు లేక పంటలు పండేవి కావు. తిరుపతికి వెళ్లడానికి డబ్బులు లేక నా పుట్టు వెంట్రుకలు 12వ ఏట తీశారు.
మా తండా నుంచి పదో తరగతి చదివిన మొదటివాణ్ని నేనే. హాస్టల్లో ఉంటూ దేవరకొండ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదివాను. నాగార్జునసాగర్‌లో ఇంటర్ చదివా. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో దేవరకొండలో మెడికల్‌షాప్‌లో కొన్నాళ్లు పనిచేశా. అప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర కళాశాల నుంచి టెంపుల్ ఆర్కిటెక్చర్ కోర్సు ప్రకటన చూశా. దానికి దరఖాస్తు చేశాను. తెలిసిన వాళ్ల దగ్గర అప్పుచేసి తిరుపతి చేరుకున్నా. తీరా వెళ్లాక, మరో వారం రోజుల తర్వాత రమ్మన్నారు. వెనక్కి వెళ్తే తిరిగి రావడం కష్టమవుతుందని తిరుపతిలోనే ఉండిపోయాను. రోజూ స్వామివారిని దర్శించుకునే వాణ్ని. తీర్థప్రసాదాలతో కడుపు నింపుకొనేవాణ్ని. వారం తర్వాత జరిగిన ఇంటర్వ్యూలో ఎంపికయ్యాను. తిరిగి ఇంటికి వచ్చి తిరుపతికి వెళ్లేటప్పుడు మెడికల్ షాపు యజమాని రూ.10వేలు ఇచ్చి ‘బాగా చదువుకో’ అని ప్రోత్సహించారు.
ఆలయ శిల్పకళా కోర్సు చేయాలనేది నా కోరిక. కానీ, నాకు ‘స్టోన్ ఆర్కిటెక్చర్’లో సీటు ఇచ్చారు. నా విభాగం మార్చాలని కళాశాలలో అధ్యాపకుడు భానుప్రసాద్ గారిని అడిగాను. నా ఆసక్తి గమనించి టెంపుల్ ఆర్కిటెక్చర్లో అవకాశం కల్పించారు. అయితే, మొదటి రెండు సంవత్సరాలు నేను ఫెయిల్ అయ్యాను. తర్వాత మరింత కష్టపడి చదివాను. సంస్కృత శ్లోకాలను ధారణ చేసి, అందులో పేర్కొన్న విధంగా దేవతామూర్తులను, ఆలయ నిర్మాణ శైలిని మనసులో ముద్రించుకునేవాణ్ని. దానికి తగ్గట్టుగా ముందుగా చిత్రాలు గీసి, శిల్పాలు చెక్కేవాణ్ని. ఆలయ నిర్మాణం ఎలా ఉండాలి? కాల నిర్ణయం, వాస్తు, స్థల బలం తదితర అంశాలను ‘ఆయాది గణితం’ తెలియజేస్తుంది. దానిపై పట్టు ఉంటేనే స్థపతిగా రాణించగలుగుతాం. పట్టుదలతో కోర్సు పూర్తిచేసి టెంపుల్ ఆర్కిటెక్చర్ చదివిన మొదటి గిరిజనుడు అనిపించుకున్నా. వెంకన్న మలచిన శిల్పాన్ని నేను. మరోవైపు బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎమ్ఏ ఇంగ్లిష్ లిటరేచర్ చేశాను. ప్రస్తుతం ఎమ్ఏ ఫిలాసఫీ చేస్తున్నా. పీస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నా. యాదాద్రిలో టెంపుల్ ఆర్కిటెక్చర్లో సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించాం. ఆ సిలబస్‌ను రూపొందించే అవకాశం దక్కడం నా అదృష్టం.
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో ఉప స్థపతిగా పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. నిర్మాణం జరిగినన్ని రోజులూ పాదరక్షలు వేసుకోలేదు. తలనీలాలు తీయలేదు. శాకాహారిగా ఉన్నాను. ఈ ప్రయాణంలో వైటీడీఏ వైస్‌చైర్మన్ కిషన్‌రావు, ప్రధాన స్థపతి సుందర్రాజన్, సలహాదారు కొండల్రావు సహకారం మరువలేనిది.
పునర్నిర్మాణం పూర్తయ్యాక యాదాద్రి నుంచి తిరుమలకు కాలినడకన వస్తానని మొక్కుకున్నా. త్వరలోనే ఆ మొక్కుబడి చెల్లించుకుంటా. నా ప్రస్థానంలో నా జీవిత భాగస్వామి అనసూయ ప్రోత్సాహం ఎంతో ఉంది. మాకు ఇద్దరు అబ్బాయిలు.
…✍ నూర శ్రీనివాస్, 📷 ఎం. గోపీకృష్ణ
“యాదాద్రిలో లడ్డూ ప్రసాదం తయారీకి వాడుతున్న మెషినరీ గురించి ఈ విషయాలు తెలుసా”