Art Director Ananda sai about Yadadri Temple | యాదాద్రి సన్నిధానం అత్యద్భుతంగా రూపుదిద్దుకున్నది. కాలంతో పరుగులు తీస్తూ.. కళలన్నీ పోతపోస్తూ.. రాయల కాలంలో నిర్మించిన గుళ్లకు దీటుగా నిలబడింది. ఈ మహత్కార్యంలో భాగస్వామి అయిన కళా దర్శకుడు ఆనందసాయి ‘బతుకమ్మ’తో పంచుకున్న అనుభవాలు..
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా. ఒడిశాకు చెందిన స్థపతి పద్మభూషణ్ పురస్కార గ్రహీత రఘునాథ పాత్రోతో పని చేసేవాణ్ని. పునర్నిర్మాణం బాధ్యతలు అప్పగించిన తర్వాత.. ముందుగా ఒక బృందంగా వెళ్లి కొండనంతా పరిశీలించాం. చుట్టూ ప్రాకారాలు, అష్టభుజ మంటపాలు, సప్తతల రాజగోపురం, పంచతల, త్రితల, విమాన గోపురాలు పేపర్‌పై చిత్రీకరించి ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి చూపించాం. ఆయన ఆమోదించడంతో మా ఉత్సాహం రెట్టింపయింది. ‘గతంలో రైలులో వెళ్తుంటే ఆలయం కనిపించేది. చుట్టూ నిర్మాణాలతో ప్రస్తుతం గుడి కనిపించడం లేదు. ఆలయం చుట్టుపక్కల ఏ భవనమూ ఉండొద్దు. ఎటునుంచి చూసినా గుడి కనిపించే విధంగా పునర్నిర్మాణం చేపట్టాల’ని ముఖ్యమంత్రి ఆదేశించారు. గుడి పూర్తి నమూనా సిద్ధం కావడానికి కేసీఆర్‌గారితో 40 సార్లు సమావేశం అయ్యాం. ప్రతి భేటీలో ఆయన పలు సూచనలు చేసేవారు. వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని ప్రణాళికా బద్ధంగా పనులు చేపట్టాం.
కొండపై అందుబాటులో ఉన్న 11.5 ఎకరాల స్థలాన్ని 17 ఎకరాలకు పెంచాం. గుట్టపైన ప్రధాన ఆలయం, రథశాల, క్యూలైన్లు మాత్రమే ఉండే విధంగా రూపొందించాం. సుమారు నాలుగు వేల సార్లు నమూనా చిత్రాలు గీసి ఉంటాం. వైటీడీఏ అనుమతి తర్వాత వాటిని కార్యరూపంలోకి తీసుకొచ్చాం. ప్రధాన స్థపతి సుందరరాజన్ నేతృత్వంలో పనులు జరిగాయి. ఆలయం అంతా కృష్ణశిలతో నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు. పూర్తిగా కృష్ణశిలతో నిర్మితమైన ఆలయం దేశంలో ఎక్కడా లేదు. దేశంలో ప్రముఖ దేవాలయాలను పరిశీలించి, అన్ని దేవాలయాల్లో ఉన్న ప్రత్యేకమైన అంశాలను యాదాద్రి గుడిలో పొందుపరిచాం. మేం ఇచ్చిన నమూనాలను వైటీడీఏ స్థపతులు విజయవంతంగా అమలు చేశారు. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ప్రత్యక్షంగా పరిశీలించాం. ఏ విగ్రహం ఎంత పరిమాణంలో ఉండాలి, ఎక్కడ ఉండాలి.. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకునేవాళ్లం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆలయం చుట్టూ బ్రహ్మోత్సవ మంటపం రూపొందించాం. ఆలయ వాస్తు శాస్త్రానికి అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాం. ఆలయంలో అధునాతన విద్యుద్దీపాలను అమర్చాం. దేవాలయ కుడ్యాలపై నెలకొల్పిన శిల్పాలు నయన మనోహరంగా కనిపించే విధంగా లైటింగ్ ఏర్పాటుచేశాం. ఒక్కమాటలో చెప్పాలంటే యాదాద్రి కోవెల ఆలయ నిర్మాణ నిఘంటువు.