Yadadri Temple | ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చిన కృష్ణశిలలు యాదాద్రీశుడి కోవెలను సర్వాంగ సుందరంగా నిలిపాయి. తెలంగాణకు మకుటాయమానంగా, నరసింహుడి దివ్య మందిరాన్ని ప్రపంచస్థాయిలో పునర్నిర్మించాలన్న ముఖ్యమంత్రి సంకల్పానికి నిలువెత్తు నిదర్శనంగా నూతన ఆలయం సాక్షాత్కరిస్తున్నది. ఈ మహా క్రతువులో ‘మేము సైతం’ అంటూ ఎందరో శిల్పులు, వాస్తు నిపుణులు పాలుపంచుకున్నారు. అకుంఠిత దీక్షతో అహరహం శ్రమించిన వారందరినీ దక్షతతో నడిపించిన ప్రధాన స్థపతి సుందరరాజన్ అంతరంగం..
తిరుపతి తరహాలో యాదాద్రిని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు అనుకోవడం దైవ సంకల్పమే! ఆలయ నిర్మాణంలో నన్ను భాగస్వామిని చేయడం నా అదృష్టం. తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగిగా ఉన్న నన్ను ఆలయ నిర్మాణం కోసం తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. శ్రీకాళహస్తి రాజగోపురం పునరుద్ధరించే సమయంలో కళా దర్శకుడు ఆనందసాయి పరిచయమయ్యారు. యాదాద్రి ఆలయం ఓ అపురూప కట్టడంగా నిలిచిపోవాలని మేం భావించాం. ఇద్దరం కలిసి కొన్ని నెలలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులోని అనేక దేవాలయాలు తిరిగాం. ఎన్నో అంశాలను పరిశీలించాం. పాంచరాత్ర ఆగమ శాస్ర్తానుసారం ప్రణాళికలు రూపొందించాం.
ప్రణాళికలో భాగంగా ముందుగా తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయ నిర్మాణం చేపట్టాలని భావించి, ముఖ్యమంత్రికి తెలియజేశాం. కొండపై అందుబాటులో ఉన్న స్థలాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మాణాలు చేపట్టాలని వారు సూచించారు. ఆ మేరకు నాలుగు ఎకరాల్లో ప్రధాన ఆలయం నిర్మించేలా మరో ప్రణాళిక రూపొందించగా, ముఖ్యమంత్రి ఆమోదించారు. 2015లో ప్రారంభించి 2016 ఆగస్టులో ఆలయ తుది ప్రణాళిక, నిర్మాణ వ్యయం అంచనా వేశాం. 2016లో విజయదశమి నాడు యాదాద్రీశుడి ఆలయం పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాం.
రాబోయే వెయ్యేండ్లు చెక్కుచెదరకుండా ఉండాలంటే ఆలయాన్ని పకడ్బందీగా నిర్మించాలి. అందుకోసం ప్రత్యేకమైన కృష్ణశిలను వాడాలని భావించాం. అందులో భాగంగా ఒకే క్వారీ నుంచి తీసుకువచ్చిన కృష్ణ శిలతో నిర్మాణాలు మొదలుపెట్టాం. శిలలు రంగు మారకుండా ఉండేలా 15 రోజులకు ఒకసారి క్వారీ దగ్గరికి వెళ్లి పరిశీలించేవాళ్లం. కరీంనగర్, బ్రాహ్మణపల్లి, ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా గురుజుపల్లిలో ఆలయ నిర్మాణానికి అనుకూలమై కృష్ణశిల నిపుణులు గుర్తించారు. కాంట్రాక్టర్లు అక్కడి నుంచి శిలలను తెప్పించి పాతగుట్టతోపాటు హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో షెడ్లు నిర్మించి నిర్మాణానికి కావలసిన విధంగా మలిచేవారు. ఇందుకోసం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశంలో పలుప్రాంతాల నుంచి ప్రముఖులైన 2,500 మంది శిల్పులను ఎంపిక చేశాం. వారంతా నెలలకు నెలలు కష్ట పడ్డారు. 2016 దసరాకు ప్రారంభించిన ప్రధాన ఆలయ పనులు 2019 దసరాలోపు పూర్తి చేశాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా స్వామివారి గర్భాలయ ముఖద్వారం నిర్మించాం. గర్భాలయానికి ముందుభాగంలో 38 అడుగుల ఎత్తుతో రెండంతస్తుల మంటపం కట్టాం. ఇంత ఎత్తులో నిర్మాణం మరెక్కడా కనిపించదు. కాకతీయ శిల్పకళతో ఆళ్వారుల విగ్రహాలను ఇక్కడ నెలకొల్పాం.
సాధారణంగా విమాన గోపురాన్ని మాత్రమే పూర్తిగా రాతితో నిర్మిస్తారు. రాజుల కాలంలో సైతం నిర్మించని విధంగా రాజగోపురాలను సైతం పూర్తి శిలలతో రూపొందించాం. మహాబలిపురంలో ఉన్నవిధంగా శిల్ప కళాకృతులు యాదాద్రిలో కనిపించాలన్న ముఖ్యమంత్రి సూచన మేరకు నిర్మాణంలో అడుగడుగునా కొత్తదనం తొణికిసలాడే విధంగా ప్రయత్నించాం. బయట ప్రాకారాలను, అష్టభుజ మంటపాలను నిర్మించాం. ఈ మహాదేవాలయ నిర్మాణంలో నాతోపాటు కళాదర్శకుడు ఆనందసాయి, మరో పన్నెండు మంది ఉప స్థపతులు, వేలమంది శిల్పులు నిరంతరాయంగా పనిచేశారు. రేయింబవళ్లు శ్రమించి ఆలయానికి అద్భుతమైన రూపాన్ని తీసుకువచ్చారు. ఈ మహా క్రతువులో భాగస్వామి కావడం జన్మజన్మల అదృష్టంగా భావిస్తున్నా. ఆలయానికి వచ్చిన భక్తులు యాదాద్రి వైభవాన్ని చూసి ఇలాంటి నిర్మాణ వైచిత్రి ‘న భూతో న భవిష్యతి’ అనుకుంటారు. అల వైకుంఠపురిలో అడుగుపెట్టిన అనుభూతిని పొందుతారు.
సాధారణంగా నేటి కాలంలో ఆలయ నిర్మాణాల్లో రాళ్లను కలిపేటప్పుడు సిమెంట్ వాడుతున్నారు. యాదాద్రిలో ఎక్కడా సిమెంట్‌ను వినియోగించలేదు. ప్రాచీన ఆలయాలు నిర్మించిన తరహాలోనే గానుగ సున్నం, కరక్కాయ, బెల్లం మిశ్రమాన్ని ఉపయోగించాం. ఒక మరో శిలలో అమర్చేందుకు సీసాన్ని కూడా వాడాం. దీని వల్ల శిలలు వేల సంవత్సరాలు పటిష్టంగా ఉంటాయి.
#YadadriVaibhavam – 4 | యాదాద్రి ఆలయ శిల్పకళా వైభవం
#YadadriVaibhavam || యాదాద్రి వైభవం – 3, కృష్ణశిల ప్రత్యేకత
యాదాద్రి వైభవం 2 – ఆలయ విస్తరణ ప్రత్యేకత
యాదాద్రి వైభవం – 1 | ఆలయ గోపురాల ప్రత్యేకత