సాధారణంగా పెండ్లి పత్రికలంటే కార్డుల మీద ముద్రించడమే మనకు తెలుసు. కానీ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇందుకు భిన్నమైన సంప్రదాయం కనిపిస్తుంది. ఇంట్లో పెండ్లంటే చాలు, గడప పసుపు రాసుకున్నట్టు, దర్వాజకు తోరణాలు అలంకరించుకున్నట్టు, ఆ ఇంటి గోడలు పత్రికలుగా మారిపోతాయి. ‘పెండ్లి సందట్లో దేవరను మర్చిపోయినమన్నట్టు, మిమ్మల్నేడ యాది మరుస్తమో ఏమో… మనూరోల్లంతా రారుల్లా’ అన్న రీతిలో ఆహ్వానం పలుకుతాయి.
Wedding Card | పెండ్లి తంతు ఇంటికో రీతి. కుటుంబానికో రకం. అయితే అందరికీ సాధారణంగా ఉండేవి మాత్రం పెండ్లి పత్రికలే. అవి కొట్టించి పంచితేనే శుభకార్యానికి అతిథిని ఆహ్వానించినట్టు లెక్క. ప్రత్యేకతను కోరుకునే వారు భారీగా ఖర్చు పెట్టి వైవిధ్యంగా ఆహ్వాన లేఖలను తయారు చేయిస్తారు. దూర ప్రాంతాల్లో ఉండే బంధుమిత్రులకు ఆహ్వాన పత్రికలను పోస్టు ద్వారా పంపిస్తారు. ఇప్పుడైతే ఫేస్బుక్, వాట్సాప్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా పెండ్లి విషయాన్ని నలుగురితో పంచుకుంటున్నారు. ఇంకా అధునాతనంగా ఆహ్వానం పంపాలనుకుంటే ప్రీ వెడ్డింగ్ వీడియో ప్రొమోలతోనూ అదరగొట్టేస్తున్నారు. కానీ జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పిట్లం, పెద్దకొడప్గల్, నిజాంసాగర్ మండలాల్లో ఆ శుభలేఖను చేత్తో పట్టుకోలేం, ఎటూ మోసుకెళ్లలేం. కనులారా మాత్రమే వీక్షించగలం.. చదవగలం. ఎందుకంటే అవి గోడ మీద రాసే పెండ్లి పిలుపులు కాబట్టి.
విలువైన భవంతి అయినా, రేకుల షెడ్డు, గూనపెంకుల ఇల్లు అయినా సరే గోడలపై పెద్దపెద్ద అక్షరాలతో వివాహ ఆహ్వానాన్ని రాయించడం ఈ ప్రాంతంలో ఆచారం. వధూవరుల పేర్లు, వివాహ తేదీ తదితర వివరాలు ఇందులో ఉంటాయి. ఇంట్లో పెండ్లి పెట్టుకోగానే… వివిధ డిజైన్లు, మంగళవాయిద్యాలు, పూర్ణకుంభం, అరటికొమ్మలు, వధూవరుల బొమ్మలు, మామిడి ఆకులు, ప్రేమ గుర్తులు, స్వస్తిక్ చిహ్నాలు వంటి వాటితో గోడ మొత్తం అందంగా పెయింటింగ్ వేయిస్తారు. అంతేకాదు తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మరాఠీ భాషల్లో స్వాగతం పలుకుతారు. ఈ ప్రాంతంలో ఇలాంటి పెయింటింగ్‌లు వేసేవాళ్లు ప్రత్యేకంగా ఉంటారు. ఇక, ఊళ్లోకి ఎవరైనా కొత్తవారు వస్తే గోడ శుభలేఖలు చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇవి పెండ్లివారి ఇంటికి ప్రత్యేక గుర్తింపును తెస్తాయి. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా సరే, గోడ ద్వారా ఆహ్వానాన్ని అందించే ఆనవాయితీ మాత్రం ఈ గ్రామాల్లో ఇంకా చెక్కు చెదరలేదు. సాధారణంగా ఇది మహారాష్ట్రలో కనిపించే ఆచారం. సరిహద్దు ప్రాంతం కావడంతో ఇక్కడా ఏండ్లుగా కొనసాగుతున్నది.
గోడ శుభలేఖ సంబంధాలను బలపరిచే ఓ అద్భుతమైన సందేశమని ఈ ప్రాంత వాసులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. పెళ్లి పనుల్లో మునిగిపోయి దగ్గరివారు, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు ఇలా ఎవరికైనా పొరపాటున సమాచారం చేరవేయలేకపోతే, చక్కగా ఉన్న సంబంధాలు చిక్కుల్లో పడుతుంటాయి. ఇక్కడ మాత్రం అలాంటివాటికి తావుండదు. హడావుడిలో పెండ్లి పిలుపు అందకపోయినప్పటికీ అదే పిలుపుగా భావించి ఊరి జనం హాజరవుతారు. రాగద్వేషాలకు అతీతంగా సహనంతో నిలబడే ప్రహరీ గోడలే వారి తరఫున ఆహ్వానాన్ని పట్టుకుని అందరినీ పిలిచినట్టు భావిస్తారు. మామూలుగా అయితే ముహూర్తం నాడు పెండ్లి జరిగే ఇంటి దగ్గర, ఫంక్షన్‌హాల్ దగ్గర వధూవరుల ఫొటోలతో ఫ్లెక్సీలు కడతారు. పెండ్లి అయిపోయాక వాటిని తొలగిస్తారు. ఆ గోడ పెండ్లి పిలుపు వధూవరుల ఇండ్లకు సరికొత్త శోభను తీసుకొస్తూ ఎన్నాళ్లయినా చెరిగిపోకుండా ఉంటుంది. వధువు ఇంట కనిపించే శుభలేఖ పెయింటింగ్ అయితే, తల్లిదండ్రులకు మెట్టినింటికి వెళ్లిన తమ కూతురి జ్ఞాపకాలను పంచే భావోద్వేగపు తీపి గుర్తుగా నిలిచిపోతుంది. అబ్బాయి ఇంటి గోడ మీద శుభలేఖ వైవాహిక బంధంతో ఒక్కటైన దంపతులకు మధురానుభూతిలా మిగిలిపోతుంది!