Inspiration | బధిరులు, అంధులు, కాళ్లు లేనివారు, చేయి కదలనివారు.. ఎవరి పరిమితులు వారివి. అయితేనేం, అలవోకగా మూడు చక్రాల బండ్లను తయారు చేస్తారు. నెలనెలా నూటయాభైకి పైగా ట్రై సైకిళ్లను, చేతికర్రలను సిద్ధం చేస్తూ.. సాటి వికలాంగులు రహదారుల మీద రయ్యిన దూసుకు వెళ్లేందుకు సహకరిస్తున్నారు. తెలంగాణ దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్’ వైకల్యానికి సవాలు విసురుతున్నది. అదొక స్ఫూర్తి కేంద్రం. ఓ తపస్సులా.. ఎవరి పనివారు చేస్తున్నారు. ఓ యజ్ఞంలా.. కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. ఎవరో ఒకరు ఆసరాగా నిలిస్తే తప్ప నడవలేనివారే.. మరొకరికి ఆసరానిచ్చే చేతి కర్రలు తయారు చేస్తున్నారు. అడుగుతీసి అడుగు ముందుకేయలేని అశక్తులే.. మరొకరు రహదారుల మీద దూసుకెళ్లేలా మూడు చక్రాల సైకిళ్లు రూపొందిస్తున్నారు.
ట్రై సైకిళ్లు, చేతికర్రలు, ట్రేడ్ ట్రైకిళ్ల తయారీ కోసం .. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతోపాటు పలు చోట్ల ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్లను (టీసీపీసీ) నెలకొల్పారు. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం వల్ల సరిపడా పనిలేక అనేక సెంటర్లు నిర్వీర్యమయ్యాయి. హైదరాబాద్‌లోని మలక్‌పేట దివ్యాంగుల సంక్షేమ భవన్ ప్రాంగణం, రంగారెడ్డి జిల్లాలోని సెంటర్లు మాత్రమే మిగిలాయి. రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణ ప్రభుత్వం టీసీపీసీలపై ప్రత్యేక దృష్టిని సారించింది. ఏటా క్రమం తప్పకుండా బడ్జెట్‌ను కేటాయిస్తుండటంతో ప్రస్తుతం ఆ సెంటర్లు చక్కని పనితీరుతో దూసుకుపోతున్నాయి. గతంలో 500లకు మించి ట్రై సైకిళ్లను, వీల్చైర్లను తయారు చేయలేని స్థితిలో ఉన్న సెంటర్లే నేడు .. ఏటా వేయికిపైగా ఉత్పత్తి చేస్తున్నాయి. అన్ని జిల్లాల్లోని దివ్యాంగులకు ఈ రెండు కేంద్రాల నుంచే ట్రైసైకిళ్లు, చేతికర్రలను ప్రభుత్వం సరఫరా చేస్తున్నది.
సాధారణంగా వ్యాపారులు ట్రై సైకిళ్ల తయారీలో తక్కువ నాణ్యత కలిగిన ఐరన్ పైప్‌లను వినియోగిస్తుంటారు. ఇవి సులభంగా విరిగిపోతాయి. బరువును మోయలేవు. ఇట్టే తుప్పు పడతాయి. త్వరగా శిథిలం అవుతాయి. కానీ ప్రభుత్వ టీసీపీసీల్లో దీర్ఘకాలం మన్నే పైప్‌లను వినియోగిస్తారు. చేతికర్రల తయారీలోనూ రాజీలేని నాణ్యతను పాటిస్తారు. బహిరంగ మార్కెట్లో ట్రై సైకిల్ ధర రూ.10వేల వరకూ పలుకుతున్నది. కానీ ప్రభుత్వం ఆ ఖర్చును మొత్తంగా తానే భరిస్తున్నది. దివ్యాంగులకు పూర్తి ఉచితంగా పంపిణీచేసూ.. నేనున్నానన్న భరోసా ఇస్తున్నది. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించేలా చేశారు. ఆసరా పింఛన్‌తో బతుకు భరోసా ఇచ్చారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా.. దివ్యాంగులకు కావాల్సిన ఉపకరణాలను అందజేస్తున్నారు. అందుకోసం రూ.24కోట్లను కేటాయించారు’ అని కొనియాడతారు తెలంగాణ వికలాంగుల ఆర్థిక సంస్థ చైర్మన్ కే వాసుదేవరెడ్డి. నిజమే, వైకల్యం జీవనోపాధికి అడ్డంకి కాకూడదు. ఎదగాలన్న ఆశను బలవంతంగా చిదిమేయ కూడదు. అసలు వైకల్యం అంటేనే.. ఒక పరిమితి, అనేకానేక అపరిమితులు!
సైకిళ్లకు పుల్లలు అల్లే పుల్లమ్మ, రీములకు టైర్లు ఎక్కించే దయానంద్, విడిభాగాలను బిగించే ఖాజామియా.. ఎవరి పరిమితులు వారికి ఉండవచ్చు. కానీ అందరూ అనంత ఆశావాదులే. హైదరాబాద్, రంగారెడ్డి టీసీపీసీల్లో ట్రైసైకిళ్లను, చేతికర్రలను తయారు చేస్తున్న అరవై మూడుమందీ దివ్యాంగులే. వారంతా అక్కడే శిక్షణ పొంది, అక్కడే ఉపాధి పొందుతున్నారు. పైప్‌లను కత్తిరించడం, నిర్మాణానికి అనుగుణంగా మలుచుకోవడం, వెల్డింగ్ చేయడం, పెయింటింగ్, విడిభాగాలను అమర్చడం.. ఇలా అన్ని పనులనూ దివ్యాంగులే స్వయంగా చేస్తారు. గతంలో దివ్యాంగులు అగర్బత్తీలు, కొవ్వుత్తుల తయారీకే పరిమితం అయ్యేవారు. అందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం కంప్యూటర్ ఆధారిత ఉపాధిని అందించాలనుకున్నది. ఇప్పటికే వందల మందికి ఉపాధి శిక్షణ ఇప్పించింది. మరిన్నికార్యక్రమాలూ చేపడుతున్నది.
…? మ్యాకం రవికుమార్
Follow Us : Google News, Facebook, Twitter, Instagram, Youtube
“Bhavana Lasya | ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు, వీడియోల ద్వారా యాక్టింగ్ ఛాన్స్ వచ్చింది”
Gitanjali Rao | 15 ఏళ్ల అమ్మాయే కదా అని తక్కువ అంచనా వేయకండి”
“Sai Chinmayi | ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయం చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డ”
అప్పుడు నెత్తిమీద గంపపెట్టుకుని తిరిగాడు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు”