Bhavana Lasya | పేరుకు తెలుగు సినీ పరిశ్రమే అయినా నటీనటుల్లో మాత్రం తెలుగువారు తక్కువే. తెలుగు రాష్ట్రాలనుంచి తెరపై మెరిసే హీరోయిన్లూ తక్కువే. ఇతర భాషల నటీనటులతో పోటీపడి తెలుగుదనాన్ని పంచేందుకు స్టార్ మా ‘మల్లి ( Malli Serial )’గా మన ముందుకు వస్తున్నది మద్ది భావనా లాస్య. అనుకోకుండా వచ్చిన అవకాశమే అయినా, దేవుడిచ్చిన వరంగా భావించి పరిశ్రమలో కొనసాగుతానంటూ లాస్య ‘జిందగీ’తో పంచుకున్న ముచ్చట్లు..
మాది వైజాగ్. నాన్న రైల్వే ఉద్యోగి. అమ్మ గృహిణి. పుస్తకాలు, కాలేజీ, కుటుంబమే నా ప్రపంచం. చదువుకుంటూనే మోడలింగ్ చేయడం ప్రారంభించా. లాక్డౌన్లో సరదాగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేదాన్ని. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు, వీడియోలు చూసి నన్ను ఆడిషన్‌కి రమ్మని ఫోన్ చేశారు. నిజానికి మొదట నమ్మలేదు. అసలు నటనపై ఆసక్తిగానీ, అవగాహనగానీ లేదు. మా అమ్మ ఎంతో ప్రోత్సహించింది. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని సూచించింది. ‘దేవుడే ఈ దారిలో వెళ్లమని చూపుతున్నాడేమో’ అనడంతో ఆడిషన్స్‌కి వెళ్లా.
‘స్టార్ మా’లో ప్రారంభమవుతున్న కొత్త సీరియల్‌కి కొత్తవారి కోసం వెతుకుతూ నన్ను ఎంపిక చేశారు. మొదటి అవకాశమే స్టార్ మా చానల్లో, అన్నపూర్ణ ప్రొడక్షన్స్ వంటి పెద్ద బ్యానర్లో రావడం నిజంగా నా అదృష్టం. మొదట్లో కాస్త భయపడినా అందరూ సపోర్ట్ చేయడంతో ఏ బెరుకూ లేకుండా నటించగలుగుతున్నా. నటన గురించి అసలేమీ తెలియని నాకు, ఓపికగా అన్నీ నేర్పించారు. ఇప్పుడు తేలికగా చేయగలుగుతున్నా.
‘మల్లి’ అనే అచ్చమైన పల్లెటూరి అమ్మాయి కథ ఇది. ఒక అబ్బాయి కారణంగా ఆమె నగరానికి వచ్చి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నదీ, వాటిని ఎలా ఎదిరించి నిలిచింది అనేది సీరియల్ ఇతివృత్తం. ‘మల్లి’ వ్యక్తిగతంగా నాకు చాలా దగ్గరగా ఉండే పాత్ర.
బాగా చదివి మంచి ఉద్యోగంలో సెటిలవ్వాలనుకున్నా. కెనడాలో ఎంబీఏ చేయాలనేది నా కోరిక. ప్రస్తుతం బీబీఏ చివరి సంవత్సరం చదువుతున్నా. చిన్నప్పటినుంచీ ప్రతి విషయంలోనూ అమ్మ ముందుండి నన్ను నడిపించింది. నాన్న ఎన్నడూ అడ్డు చెప్పలేదు. అందువల్లే నాకు నచ్చిన కెరీర్ ఎంచుకునే స్వేచ్ఛ లభించింది. నాకు ఒక తమ్ముడు. ఢిల్లీలో ఆరో తరగతి చదువుకుంటున్నాడు.
అనుకోకుండా ఇటువైపు వచ్చా. నటిస్తూనే చదువు కొనసాగిస్తా. ‘మల్లి’ పాత్రకు నేనెంత చేయగలనో అంతా చేసేందుకు ప్రయత్నిస్తున్నా. ఈ పాత్ర ద్వారా మరిన్ని మంచిపాత్రలు వస్తాయని ఆశిస్తున్నా. ఇతర భాషలు, సినిమాల్లోనూ మంచి అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా. తెలుగమ్మాయి కావడం నాకు చాలా ప్లస్ అయింది. భాష తెలియడం వల్ల ప్రతి సన్నివేశాన్ని, డైలాగ్‌ని అర్థం చేసుకుని నటించే వీలుంటుంది. పదేపదే చేయాల్సిన అవసరం ఉండటం లేదు. నిజానికి ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు చాలా తక్కువ. ఇండస్ట్రీకి రావడానికి, వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాలి. అందుకే వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావించి కష్టపడి పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తా.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమానిని. ఆయనంటే చాలా ఇష్టం. హీరోయిన్లలో సమంతను ఎక్కువగా అభిమానిస్తాను. పుస్తకాలు చదవడం, పెయింటింగ్ నా హాబీలు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటాను.
– ప్రవళిక వేముల
ఆర్.నారాయణ మూర్తి వల్లే సినిమాల్లోకి వచ్చా : అభిషేకం సీరియల్ ఫేమ్ ప్రణయ్”
Yamuna | యమున కొత్త ఇంటిని చూశారా.. హోం టూర్ వీడియో వైరల్”
వ్యక్తిగత జీవితం ఆనందంగా ఉంటేనే వృత్తిపరంగా అద్భుతాలు”
ప్రేమ, పెండ్లి.. నా చేతిలో లేవు!”