మన తెలంగాణలో ఈత చెట్టు కనిపించని ఊరు ఉండదు. ఆ మాటకొస్తే మన దేవంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ చెట్టు కనిపిస్తుంది. వర్షాభావ పరిస్థితుల్లోనూ ఇది పెరుగుతుంది. ఎడారి ప్రాంతంలోనూ ఈత ఉనికిని చాటుతున్నది. రాజస్థాన్లోని మౌంట్ అబూకి దిగువన ఉన్న ఈత తోపులు ప్రకృతి అందాలు తోడై కనువిందు చేస్తాయి. ఈత… ఖర్జూర చెట్టులానే ఉంటుంది. కానీ, ఈ రెండిటి కాండాలు ఒకేలా ఉండవు. ఈత ఆకుల చివర్లు ముల్లులా మొనదేలి ఉంటాయి. ఈ చెట్టు ఆకులు వివిధ రకాలుగా ఉపయోగపడతాయి. చాపలు, బుట్టలు వంటి గృహోపకరణాలు, అలంకార సామగ్రిని ఈత ఆకులతో అల్లుతుంటారు. ఈత చెట్టును ఆధారంగా చేసుకొని ఎందరో జీవనోపాధి పొందుతున్నారు.
ఈత ఆకుల అమరిక కొబ్బరి మట్టలను పోలి ఉంటుంది. తాటి, కొబ్బరి, ఈత చెట్లకు కొంత సామీప్యత కనిపిస్తుంది. ఈత పండ్లు.. గెలకు గుత్తులుగా కాస్తాయి. ముందుగా పసుపు రంగు నుంచి నారింజ రంగులోకి మారుతాయి. రుచి కాస్త తియ్యగా, వగరుగా ఉంటాయి. క్యాల్షియం ఎక్కువగా లభించే ఈత పండ్లను తినడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. పండ్ల గుజ్జులోని గ్లూకోజ్ తక్షణ శక్తినిస్తుంది. ఈత పండ్లు రోగ నిరోధక శక్తితోపాటు జ్ఞాపకశక్తినీ పెంచుతాయి.
తాటి చెట్ల నుంచి తీసినట్లే ఈత చెట్టు నుంచీ కల్లు తీస్తారు. ఇది ప్రకృతి సిద్ధంగా లభించే పానీయం. వేసవిలో చల్లదనానికి ఈత చెట్టు నుంచి తీసిన ‘నీరా’ తాగుతుంటారు. మహబూబ్నగర్ జిల్లాలో ఒక గ్రామంలో ఒకే ఎకరంలో దాదాపు 500 ఈత చెట్లు నాటి గౌడన్నలు ఆదాయాన్ని పొందుతున్నారు. పొలం చుట్టూ ఈత చెట్లను కంచెగా వేసుకొని ఉపాధి పొందుతున్న రైతులూ ఉన్నారు. జగిత్యాల జిల్లాలోని అంతర్గాం గ్రామంలో ఎనిమిది ఎకరాల్లో ఈత చెట్లను నాటి వనం పెంచుతున్నారు. కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కడం కష్టం. కానీ ఈత చెట్టు నుంచి తీయడం సులభం. నేలను బట్టి కూడా ఈత కల్లు ‘రుచి’ మారుతుంది. దీన్నుంచి తయారు చేసే బెల్లానికి మంచి డిమాండ్ ఉంది.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు