కనులు లేవని వాళ్లు కలత చెందరు. చూపున్న వాళ్లూ చూడలేని లోతులు మనోనేత్రంతో దర్శిస్తున్నారు. సాధారణ విద్యార్థులతో సమానంగా విద్యాబుద్ధులు నేర్చుకుంటారు. భగవంతుడు ఒక తలుపు మూసివేస్తే మరో కిటికీ తెరుస్తాడన్న మాటను నిజం చేస్తూ వెలిసిన ఆ ఆశ్రమ పాఠశాలే దివ్యాంగులకు అసలైన పుట్టినిల్లు. దృష్టిలోపం ఉన్నవాళ్లను అక్కున చేర్చుకున్న ఆ పాఠశాల నిర్వాహకులు వారిపాలిట దేవుళ్లు. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో ఉన్న ప్రత్యేక పాఠశాలకు పలకాల్సిందే జేజేలు…
‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అంటారు. ఆ నేత్రాలు చీకట్ల చెరలో చిక్కుకుంటే.. బతుకంతా చిక్కులే అనుకుంటాం! కానీ, మిగతా ఇంద్రియాలతో అంధత్వాన్ని జయించేలా ఓ ప్రత్యేకమైన పాఠశాల నెలకొల్పింది సీ ల్యాబ్స్ సంస్థ. ఆనంద్ సోనేచా నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ ఆశ్రమ పాఠశాలలో అన్నీ ప్రత్యేకమే! విశిష్ట ఆలోచనతో ఏర్పాటైన ఈ బడిలో విద్యాబోధన వినూత్న పద్ధతిలో సాగుతున్నది. ఇక్కడి విద్యార్థులు ఒక్క ‘దృష్టి’ తప్ప మిగతా నాలుగు ఇంద్రియాల శక్తి ఆధారంగా విద్యనభ్యసించేలా వసతులు కల్పించారు.
వివిధ రకాల దృష్టి లోపం ఉన్నవాళ్లందరికీ అనువుగా ఉండేలా ప్రత్యేకంగా పాఠశాల భవనాన్ని డిజైన్ చేశారు. అంధ విద్యార్థుల ప్రతి అవసరాన్నీ పరిగణనలోకి తీసుకొని వారు సునాయాసంగా గుర్తించేందుకు అనుగుణంగా పాఠశాలను నిర్మించారు. తెల్లని రంగులో ఐదు విభిన్న రకాల ప్లాస్టర్లు, అల్లికలతో పాఠశాలలోని వివిధ ప్రదేశాల్లో గోడలను ప్రత్యేకంగా అలంకరించారు. తద్వారా విద్యార్థులు స్పర్శ జ్ఞానంతో ఆయా ప్రదేశాలను గుర్తిస్తారు.
గరుకుగా లేదా మృదువుగా ఉండే ‘కోటా’ రాతిపై వివిధ రకాల అల్లికలతో ఏర్పాటు చేసిన గచ్చు (ఫ్లోర్)ను విద్యార్థులు సులభంగా గుర్తిస్తూ సునాయాసంగా తరగతి గదులకు, గ్రంథాలయానికి చేరుకుంటారు. తరగతి గదులు, వసారాల నుంచి ప్రాంగణాల దాకా ప్రతి ప్రదేశాన్నీ సులువుగా గుర్తించేందుకు బ్రెయిలీ లిపిలో లేబుళ్లు ఉంచారు. అంతేకాదు వినికిడి ద్వారా కూడా తాము పాఠశాలలో ఏ ప్రదేశంలో ఉన్నామో తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. వివిధ రకాల పదార్థాలతో.. విభిన్నమైన ఎత్తులు, పల్లాలతో పాఠశాల ప్రాంగణంలోని ప్రదేశాలను తీర్చిదిద్దారు. విద్యార్థులు వాటి గుండా నడుస్తున్నప్పుడు ఆయా ప్రదేశాల్లో వెలువడుతున్న భిన్నమైన ధ్వనుల ఆధారంగా తాము ఎక్కడున్నామో గుర్తించగలుగుతారు.
సాధారణంగా సంపూర్ణ అంధత్వం కేవలం 15 శాతం మందిలో ఉంటుంది. మిగతా 85 శాతం మంది కాంతిని గుర్తించగలిగే పాక్షిక దృష్టిని కలిగి ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాల గదులు అత్యంత ప్రకాశవంతంగా ఉండేలా తీర్చిదిద్దారు. గదులు, గ్రంథాలయాలు, ప్రయోగశాల, టాయ్లెట్ గదుల ప్రవేశ ద్వారాలు, తలుపులు, కిటికీలు ఇలా ప్రతి ప్రదేశాన్నీ విభిన్నమైన రంగులతో అలంకరించారు. విభిన్న వర్ణాలు వెదజల్లే తీరొక్క కాంతి ఆధారంగా విద్యార్థులు సులభంగా వాటిని గుర్తించగలుగుతున్నారు.
పంచేంద్రియాల్లో ఘ్రాణ శక్తీ ఒక్కటి. వాసన పసిగట్టే శక్తి సాధారణ వ్యక్తుల కన్నా అంధుల్లో అధికంగా ఉంటుంది. దీన్ని ఆధారంగా చేసుకొని ఈ పాఠశాలలో వివిధ ప్రదేశాల్లో పరిమళభరిత మొక్కలను నాటారు. ఒక్కో ప్రవేశ ద్వారం వద్ద ఒక్కో రకమైన సువాసన వెదజల్లే మొక్క నాటడం వల్ల విద్యార్థులు తాము ఎక్కడున్నామో ఇట్టే కనిపెట్టగలుగుతున్నారు. ఇలా 37 రకాల సువాసనలు వెదజల్లే మొక్కలు వెయ్యి వరకు నాటారు.
ఆనంద్ సోనేచా.. గాంధీనగర్లోని అంధుల ప్రత్యేక పాఠశాల భవన నిర్మాణ రూపశిల్పి. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న అంధ విద్యార్థులతోపాటే కొంత కాలం ఉన్నారు. అంధుల ప్రత్యేక అవసరాలను గుర్తించేందుకు, అందుకు అనుగుణంగా భవన నిర్మాణం చేపట్టేందుకు వారితో సహవాసం చేసిన అనుభవం పనికి వస్తుందన్నదే తన భావన అంటారు ఆనంద్ సోనేచా. అలా ఆయన విద్యార్థులు, ఉపాధ్యాయులతో పరస్పరం చర్చలు జరుపుతుండేవారు. దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా వివిధ అంధ పాఠశాలలనూ సందర్శించారు. ముంబయిలోని ‘విక్టోరియా మెమోరియల్ స్కూల్ ఫర్ ది బ్లైండ్’ ఆనంద్కు ప్రేరణగా నిలిచింది. అమెరికాలోని ‘పెర్కిన్స్ బ్లైండ్ స్కూల్’లో స్వచ్ఛందంగా పనిచేసిన అనుభవం గాంధీనగర్ పాఠశాల ఏర్పాటుకు దోహదపడిందని ఆయన చెబుతారు. ఇలా తన అనుభవాలన్నిటినీ రంగరించి ఈ పాఠశాలకు రూపమిచ్చారు ఆనంద్. ఆయన పరిశ్రమకు ఫలితంగా నేడు వందల మంది చూపులేని విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును ఈ బడిలో ఉన్నప్పుడే దర్శించగలుగుతున్నారు.
ఈ అంధ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలలో ప్రస్తుతం రెండు భవనాలు ఉన్నాయి. ఒకదాన్ని వసతి (హాస్టల్)గా, మరొకదాన్ని పాఠశాలగా వినియోగిస్తున్నారు. అయితే హాస్టల్లోని ప్రతి గదిలో 12 నుంచి 15 మంది విద్యార్థులు వసతి పొందేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ విద్యార్థుల కోసం బంక్ బెడ్లు (ఒకదానిపై ఒకటి) ఉంటాయి. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు.