తెలంగాణ వస్తే చిమ్మచీకటే అని చూపిన చూపుడువేలు ఏ వెలుతురులో దాక్కున్నది? నిషేధిత పదమైన తెలంగాణ నిలువెత్తు పటం ఎట్లా అయ్యింది ? ‘ఒక్క రూపాయి కూడా ఇవ్వను. నీ దిక్కున్నచోట చెప్పుకో’ అని ఈసడించిన గొంతు ఏ పాతాళంలోకి జారుకున్నట్టు? ‘తెలంగాణ వస్తే మావోయిస్టులే రాజ్యమేలుతారు’ అని సిద్ధాంతీకరించినవాళ్లు ఏ కీకారణ్యంలో తలదాచుకున్నట్టు? ‘మీరు కేవలం ఆందోళనకారులు. మీకు పాలన చేతకాదు’ అని తీర్మానించినవాళ్లు ఏలుతున్న రాజ్యంలో పాలన ఎలా ఉంది? ‘మీకు భాష రాదు.. మాట్లాడే విధానం తెలియదు’ అని వెక్కిరించిన భాషా పండితులు ఏ చెట్టుకింద పాఠాలు చెప్తున్నట్టు ?
తెలంగాణ అంటే సరిగ్గా పదేండ్ల క్రితం ఇవే సూత్రీకరణలు.. ఇవే సిద్ధాంతాలు.. కానీ, తెలంగాణ… తనకు తాను లేచి నిలబడి అడుగులు వేయటం మొదలయ్యాక తడబడనేలేదు. ఎత్తినతల దించనే లేదు.. అంతా పచ్చి మిరపకాయ కోసినట్టే.. ఫుల్లు నాటు. ఘాటు తొక్కునూరినట్టే ఊర నాటు.. అని విరామమెరుగక చిందేస్తున్నది. అద్గదీ తెలంగాణ అంటే… వందేండ్ల చరిత్ర ఉన్న తెలుగు వెండితెరకు ఆస్కార్‌ను తెచ్చిన భాష తెలంగాణ.. తెలుగుభాషకు ప్రాచీన హోదా కల్పించిన ఠీవి తెలంగాణ సొంతం…
తెలంగాణ భాషలోనే రిథమున్నది. జీవనమధువున్నది. సంబురమనిపిస్తే ధూం..ధాం..చేస్తది. కోపమొస్తే దుమ్మురేపుతది. తెలంగాణ ఏర్పడి పదేండ్లే అయినా.. వెయ్యేండ్ల చరిత్రను తిరగరాసింది. మిషన్ కాకతీయ చెరువై మెరిసింది. పల్లె పసిడిముల్లెగా మురిసింది. పట్నం ప్రగతి చక్రమై కుమ్మేసింది. గాయాల నేపథ్యంతో మొదలైన జానపదాల వీరగాథల జయపతాకను ఎగురవేసి కొదమసింహమై గర్జించింది తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం పదేండ్ల పండుగను పురస్కరించుకొని నమస్తే తెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇదీ…
Telangana | ఉద్యమాలన్నింటిలో తెలంగాణ ఉద్యమం మాత్రమే విజయం సాధించింది. 1952.. 1969 నుంచి కేసీఆర్ పార్టీ పెట్టి (దీన్నే మలిదశ లేదా తుదిదశ అంటున్నాం) తరువాత హింసకు తావులేకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాలో ఉద్యమాన్ని నడిపించటం అనే వ్యూహంతో విజయవంతంగా జరిగిన ఉద్యమం. అయితే, దేశంలో జరిగిన ఉద్యమాలన్నీ సెక్టోరియల్ మూవ్మెంట్స్ (వర్గసమూహం ఆధారంగా సాగిన ఉద్యమాలు). ఉదహరణకు ఈశాన్యభారతంలో బోడోల పోరాటం, పంజాబ్‌లో సిక్కులు… కానీ, తెలంగాణ ఉద్యమానిది మాత్రం విశాల ప్రాతిపదిక. సబ్బండ వర్గాల ఆకాంక్షలు ప్రతిఫలించిన ఉద్యమం. సమాజంలో ప్రజల అందరి భాగస్వామ్యంతో జరిగిన పోరాటం. ఉద్యమ ఆకాంక్షతోపాటు ఉద్యమాన్ని నడిపిన వ్యూహం కూడా ఆదర్శప్రాయమైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే మహాలక్ష్య సాధనలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పొలిటికల్ ఫ్రంట్‌గా ఏర్పడటం, విద్యార్థులు, వృత్తి నిపుణులు, కుల సంఘాలు, కళాకారుల భాగస్వామ్యంతో ఉద్యమం ఉప్పెనై ఎగసింది. తొలిదశ ఉద్యమ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని హింసకు తావులేకుండా వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ శాంతియుతంగా సాగిన పోరాటం ఎట్టకేలకు విజయం సాధించింది. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల కల నెరవేరింది. సరిగ్గా పదేండ్ల కింద 2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్రంగా అవతరించింది.
రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత స్వీయపాలనకు అంకురార్పణ జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ముందు తెలంగాణ అస్తిత్వ ఆకాంక్ష, ఉద్యమ నేపథ్యాలను గమనింపులో ఉంచుకోవాల్సిన అవసరం ప్రధానంగా ఉన్నాయి. ఎన్నికలు కాగానే ప్రభుత్వం ఏర్పడటం, కొన్ని మౌలికమైన అంశాల మేరకు పాలించడం సర్వసాధారణం. కానీ, తెలంగాణ విషయంలో మాత్రం ఈ మౌలిక సూత్రాలు పనిచేయవు. విశాలాంధ్ర పేరుతో 60 ఏండ్లుగా తెలంగాణలో భౌతిక, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక చివరికి రాజకీయం సహా అన్ని రంగాలు విస్మరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఆలోచిస్తే తప్ప నవ తెలంగాణ బంగారు తెలంగాణగా మారడానికి బ్లూ ప్రింట్ ఎలా ఉండాలో అర్థం కాదు. అందుకే కేసీఆర్ సర్కారు… తెలంగాణ పునరావిష్కరణ (రీఇన్వెంట్), పునర్నిర్మాణం (రీకన్స్ట్రక్షన్) అంశాలను పునాదిగా రాష్ట్ర నిర్మాణాన్ని మొదలుపెట్టింది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తించడానికి నిరాకరించాయి. తెలంగాణ అభివృద్ధిని చిన్నచూపు చూశాయి. రాష్ట్రంగా ఏర్పడేనాటికి తెలంగాణలో 10 జిల్లాల్లో హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది జిల్లాలు వెనకబడిన జిల్లాల జాబితాలో ఉండటం శోచనీయం.
ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ పునరావిష్కరణ, పునర్నిర్మాణం దిశగా ముందుకు సాగటం ప్రభుత్వానికి కత్తిమీద సాము వ్యవహారమే. దీనికోసం కేసీఆర్… లక్ష్యాలను తక్షణం, స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలికమైనవిగా విభజించుకున్నారు. వనరుల లభ్యత, వాటి సద్వినియోగం, ధ్వంసమైన వనరుల పునరుద్ధరణ ద్వారా తెలంగాణకు ఉపశమనం కలిగించడం అనే వ్యూహంతో ఆయన ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకున్నది. ఇందులో భాగంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం, భక్తరామదాసు, సీతారామ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మొదలైన బృహత్తర కార్యక్రమాలను తలకెత్తుకుంది. వ్యవసాయం, పరిశ్రమలు సాఫీగా సాగిపోవడానికి నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రాధాన్యం ఇచ్చింది. హైదరాబాద్‌కు సమాంతరంగా జిల్లాల అభివృద్ధికి నడుం బిగించింది. వీటికి సమాంతరంగా ప్రజా సంక్షేమానికి అర్హులకు పెన్షన్లు, రైతుబంధు, రైతుబీమా, డబుల్ బెడ్రూం ఇండ్లు తదితర పథకాలను అమలుచేసింది. ఇలా అభివృద్ధి, సంక్షేమం ఒకదానికొకటి పూరకాలుగా సాగుతూ తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టాయి. ఈ పదేండ్ల విజయ ప్రస్థానం రాజధాని హైదరాబాద్‌లో మాత్రమే కాదు… తెలంగాణలో ఏ మూలన నిల్చున్నా స్పష్టంగా అనుభూతి చెందవచ్చు. ‘నవ్వినోని ముందు బోర్లపడొద్దు’ అన్న కసే పదేండ్ల అభివృద్ధికి కారణంగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు.
పూర్వం ఊరికి పిల్లను ఇవ్వమని అడగటానికి వచ్చినవారితో ఆడపిల్ల తరఫువారు వేసే ప్రశ్న ‘మీ ఊళ్లో ఎన్ని చెరువులున్నాయి?’ అని! దీని అర్థం ఊళ్లు నీటితో కళకళలాడితే వ్యవసాయం, ఇతర అనుబంధ వృత్తులకు చేతినిండా పని దొరుకుతుందని. ఆ ఊళ్లో బతికే కుటుంబాలు ఎవరి ముందూ చేయి చాచకుండా సుభిక్షంగా ఉంటాయని. ఇలా వందల ఏండ్లు పల్లెలకు ఆహారాన్ని ఖాయం చేసిన వేలాది చెరువులను అభివృద్ధి మార్గంగా ఉద్యమకాలం నుంచి తెలంగాణ సమాజం భావించింది. కాబట్టే, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన మరుక్షణమే చెరువులను బాగుచేసుకోవాలని సంకల్పం చేసుకున్నాం. మిషన్ కాకతీయ పేరుతో మొత్తం 46,531 చెరువులను పూడికతీసి, మరమ్మతులు చేసి గ్రామీణ జనజీవనానికి కేసీఆర్ సర్కారు అంకితమిచ్చింది. అంతేకాదు… చెరువు ఆదరువుగా ఆధారపడిన రైతులతోపాటు ముదిరాజులు, గొల్లకుర్మలు, గీతకారులు మొదలైన కులవృత్తుల జీవనోపాధికి బలమైన బాటలు వేసింది. మత్తడి దుంకే చెరువుకట్ట మీద పుట్టినరోజు జరుపుకొని సంభ్రమాశ్చర్యాలకు లోనైన ‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజేంద్రసింగ్… ‘చిన్ననీటి వనరుల వినియోగంలో ఇప్పుడే ఏర్పడిన రాష్ట్రమే అయినా తెలంగాణ దేశానికి నీటిపాఠాలు నేర్పింది’ అని కీర్తించారు. దానికి సాక్ష్యం నెక్కొండ చెరువు కట్ట.
‘ఇంకుడుగుంతలు మాకు, నదులూ కాల్వలూ మీకా? ’ అని కరీంనగర్ ఎస్సారార్ కళాశాల వేదికగా గర్జించిన గొంతుక వెనుక (సింహగర్జన 2001) నెర్రెలుబారిన నేలనే కాదు.. పడావుపడ్డ సాగునీటి ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టుల కింద తవ్విన పిల్లకాల్వల్లో నీళ్లకు బదులు సర్కారు తుమ్మల దృశ్యాలను దిగమింగి సరికొత్త తెలంగాణను ఆవిష్కరించుకోవాలన్న తండ్లాటలో భాగంగా ప్రాజెక్టుల రీడిజైనింగ్ కేసీఆర్ ప్రభుత్వానికి ఆవశ్యకమైంది. తలాపున పారుతున్నా… తలంటుకు నీళ్లు ఇవ్వని గోదావరి, కృష్ణవేణమ్మలవి నిజానికి వట్టిపోయిన పారకాలు కావు… సజీవజలధారలు. అయితే తెలంగాణ భౌగోళిక అననుకూలతల వల్ల వాటిని వందల మీటర్ల ఎత్తుకు తోడిపోసుకోవటం తప్ప గత్యంతరం లేదు. పాకాల, రామప్ప, గణపసముద్రం, గండిపేట, హిమాయత్‌సాగర్ సహా అక్కడక్కడా ఉన్న మధ్యతరహా నీటి ప్రాజెక్టులు మాత్రమే మిగిలాయి. ఈ పరిస్థితుల్లో నవ తెలంగాణ నీటి గలగలల సవ్వడిని కలగన్నది. తెలంగాణ తనను తాను పునర్నిర్వచించు కొన్న తరువాత అప్పటిదాకా పడావుపడ్డ (పెండింగ్) ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నది.
దానికి అనుగుణంగా కేసీఆర్ అసెంబ్లీలో పవర్‌పాయింట్ సాక్షిగా విశ్వాసాన్ని కల్పించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయటం, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం అనివార్యమయ్యాయి. ఎవరు అవునన్నా… కాదన్నా… ఒప్పుకొన్నా… ఒప్పుకోకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన భాగమైన మేడిగడ్డే తెలంగాణ జీవగడ్డ. కాళేశ్వరం ప్రాజెక్టే తెలంగాణ భూములకు జీవధార. రైతులకు వీలైనంత తొందరగా సాగునీటి సౌకర్యం కల్పించే దిశగా కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమ, మిడ్‌మానేరు, దేవాదుల, భక్తరామదాసు ప్రాజెక్టులు పూర్తయ్యాయి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సింహభాగం పూర్తయ్యింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కాలువలు పునరుజ్జీవం పొందాయి. మొత్తంగా తెలంగాణ కలగన్న జలవిప్లవం చేరుకోవటానికి తుది అంకంలో నిలిచింది. ‘తుంపర్ల సేద్యం.. తుప్పిర్ల సేద్యమేనా’ అని దిగులుపడ్డ తెలంగాణలో మండువేసవిలో కూడా సముద్ర దృశ్యాలను కండ్ల ముందర సాక్షాత్కరింపజేసింది కేసీఆర్ సర్కారు. కానీ, ఇవాళ వ్యక్తి మీద పగతో వ్యవస్థకు శాపం పెట్టాలనే ఆలోచన రావడం ఏ విధంగా సరైంది? ఒకవేళ తెలంగాణ జలస్వప్నం నిజరూపం దాల్చకపోతే 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఎలా సాధ్యమైంది?
పూర్వ హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్‌తోపాటు వరంగల్‌లో ఆజంజాహీ మిల్లు, ఆదిలాబాద్‌లో సర్‌సిల్క్ ఫ్యాక్టరీ, సిర్పూర్ పేపర్‌మిల్లు మొదలుకొని చెరుకు పండించే రైతులు తమ వ్యవసాయ క్షేత్రాలకే రైలుపట్టాలు వేయించుకున్న సాహసికుల చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో ఎలా మసకబారిందో అర్థం చేసుకుంటే కానీ తెలంగాణ పునరావిష్కరణ… పునర్నిర్మాణం అర్థం కాదు. రాష్ట్రంలో నడుస్తున్న చిన్నా, పెద్ద పరిశ్రమలకు నిర్విఘ్నంగా కొనసాగే భరోసా ఇవ్వాలి.. కొత్త పరిశ్రమలను నెలకొల్పాలి. ఈ రెండూ పదేండ్ల కిందట జటిలమైన అంశాలు. అది.. పరిశ్రమలకు పవర్‌హాలిడేలు కొనసాగుతున్న కాలం, ‘మాకు కరెంట్ కావాలి’ అని పారిశ్రామికవేత్తలు, కార్మికులు కలిసి నిరసన తెలుపుతున్న కాలం. దీంతో కేసీఆర్ సర్కార్ రోజులో కనురెప్పపాటు కూడా కరెంట్ పోకూడదనే వజ్రసంకల్పం చేసుకున్నది. కొన్ని రోజుల్లోనే దాన్ని నిజం చేసింది కూడా. ఇక పరిశ్రమలు ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటై… ఇక్కడి యువశక్తికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం టీఎస్ ఐపాస్ పేరుతో కొత్త పారిశ్రామిక విధానాన్ని ముందుకుతెచ్చింది. ఇది పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం అని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు గ్రహించేలా చేసింది. అలా పదేండ్లు గడిచేసరికి హైదరాబాద్ ప్రపంచ ప్రసిద్ధిచెందిన ఐటీ కంపెనీలు, వందలాది స్టార్టప్స్‌కు వేదికగా మారిపోయింది. రాష్ట్ర రాజధాని, దానిచుట్టూనే పరిశ్రమలు కేంద్రీకృతం కావాలనే ఆలోచనకు చరమగీతం పాడటం వల్ల వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ తదితర ద్వితీయ శ్రేణి నగరాలకూ పారిశ్రామిక ప్రగతి విస్తరించింది. ఫలితంగానే 2014లో రూ.57,258 కోట్ల విలువ ఉన్న తెలంగాణ ఐటీ ఎగుమతులు 2022-23 నాటికి రూ.2,41,275 కోట్లకు చేరింది.
‘చిన్న కుటుంబం..చింతలు లేని కుటుంబం’ కుటుంబ నియంత్రణ కోసం పుట్టిన నినాదమే అయినా అది పాలనకూ వర్తిస్తుందని పదేండ్ల తెలంగాణ నిరూపించింది. వెనుకబాటుతనానికి మూలకారణమైన అనేకానేక కొలమానాల్లో జిల్లాలు భౌగోళికంగా పెద్దగా ఉండటం ఒక కారణమని ఛత్తీస్‌గఢ్ అనుభవం నేర్పిన పాఠం. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత బస్తర్‌ను ఏడు జిల్లాలుగా విభజించారు. పోతే అక్కడ జిల్లాల పునర్విభజన వల్ల ఏం జరిగిందనేది వేరే అంశం. ఇక మలిదశ ఉద్యమ సమయంలో చర్చకు వచ్చిన అనేక అంశాల్లో తక్షణం ఉమ్మడి జిల్లా భౌగోళిక విస్తీర్ణాన్ని తగ్గించటం, ప్రభుత్వ పాలన ప్రతీ ఒక్కరికీ చేరువయ్యేలా చర్యలు తీసుకోవడం అనే ఆలోచనతో జిల్లాల పునర్విభజన చేపట్టారు. దీనికి దీర్ఘకాలిక లక్ష్యం ప్రాతిపదికగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం పథకాల రూపకల్పన, నిధుల కేటాయింపులు జిల్లా యూనిట్‌గానే చేస్తుంది. జిల్లాల పునర్విభజనకు ఇది కూడా ఒక కారణం. అయితే, జిల్లాల పునర్విభజనలో దాగిన మరో ఘనత… దేశంలో మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రం పట్టణ, గ్రామీణ వ్యవస్థల మధ్య సమతూకం పాటించే అద్భుతాన్ని తెలంగాణ ఆచరించి చూపింది. కాబట్టే, పట్టణ, గ్రామీణ ప్రాంతాలు రెండూ సరిసమానంగా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో జమిలిగా ప్రయాణం సాగిస్తున్నాయి. జిల్లాల పునర్విభజన చెట్టుకు కాసిన మధురమైన ఫలాలు ఇవే. అదే కోవలో రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు కూడా జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా దశాబ్దాలుగా తీరని కోరికగా మిగిలిన తండాలు, గోండు, కోయ, చెంచుగూడేలు గ్రామపంచాయతీలుగా మారటం. ఇది దేశ పరిపాలన వికేంద్రీకరణలో విప్లవాత్మక చర్య. అయితే, ఇప్పుడు వీటి కుదింపుపై చర్చ సాగుతున్నది. ఈ చర్చ తెరమీదికి వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్ చేదు అనుభవం గుర్తుకు వస్తున్నది. జిల్లాల సంఖ్య పెంచడం, కుదించడం అన్నది పాలకుడి వ్యక్తిగత ఎజెండాగా కాకుండా ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల కేంద్రంగా మాత్రమే ఉండాలి.
శాతవాహనుల నుంచి అసఫ్‌జాహీల వరకు తెలంగాణను ఎన్నో రాజవంశాలు పాలించాయి. ఎంతో వారసత్వ సంపదను మిగిల్చి వెళ్లాయి. కానీ, ఉమ్మడి పాలనలో అప్పటిదాకా ఉన్న ప్రతీకలను, విలువలను సర్వనాశనం చేయటం ద్వారానే ఈ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించే మార్గం సుగమం అవుతుందనే భావన అప్పటి పాలకుల్లో కనిపించేది. ఆ నేపథ్యంగా తెలంగాణ అన్ని సంస్కృతుల ధ్వంసరచన సుదీర్ఘకాలం కొనసాగింది. తెలంగాణ సమాజం తన నేల మీద తనే ద్వితీయ శ్రేణిగా న్యూనతకు లోనయ్యింది. అందువల్ల తెలంగాణ భాష భాష కాకుండా పోయింది.. పండుగలు పండుగలు కాకుండా పోయాయి. సంస్కృతి సంస్కృతి కాకుండా పోయింది. ఆఖరికి మన దేవుళ్లు దేవుళ్లు కాకుండా పోయారు. పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, మల్లన్న (మల్లికార్జునస్వామి), మడేలయ్య ఇలా ఎంతోమందితో పాటు యాదగిరి నర్సన్న, వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న ఎవ్వరూ దేవుళ్లు కాకుండా పోయారు. ఇక బతుకమ్మ, బోనాలు… ఒకటేమిటీ తెలంగాణ సాంస్కృతిక వైభవ ప్రతీకలైన అనేక పండుగలు ఎగతాళికి గురయ్యాయి. అంతెందుకు అసలు తెలంగాణ తెలుగు భాషే కాదని, ఇక్కడివారికి భాషే రాదనే దాకా మీడియా, సినిమా అన్నీ ఇల్లుపీకి పందిరేశాయి. ఇలా అన్ని రంగాల్లో న్యూనతాభావం ముసురుకొన్న కాలానికి ఉద్యమ సమయం నుంచి దీటైన సమాధానంగా పదేండ్ల క్రితం పడిన సాంస్కృతిక పునాది క్రమక్రమంగా ఆకాశమంత ఎత్తున ఠీవీతో సగర్వంగా నిలబడింది. ఇవాళ తెలంగాణలో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోయింది. బతుకమ్మ, బోనాల పండుగలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించుకోవడం, మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించడం, రామప్పను ప్రపంచ వారసత్వ కట్టడంగా నిలుపుకోవడం ఇలా ఒకటేమిటి ఈ పదేండ్ల కాలంలో సాంస్కృతిక ఔన్నత్యం దిశగా పడిన అడుగులు అసామాన్యమైనవి. దశాబ్దాలపాటు జోకర్లు, విలన్లు మాట్లాడే భాషగా తెలంగాణ యాసను చిత్రీకరించిన సినిమా ఇప్పుడు తన స్వరూపాన్నే మార్చుకునేలా జరిగిన ప్రయాణం అసాధారణం. అనిర్వచనీయం. ఇవాళ తెలంగాణ యాసలో పూర్తినిడివి చిత్రాలు తెలుగు సినిమాను మెరిపిస్తున్నాయి. నాటుగా.. మోటుగా ఉంటుందని ఈసడించుకున్న భాషలోనే ‘నాటు… నాటు..నాటు’ అని పాడితే ప్రపంచమంతా చిందేసింది. ఇప్పటిదాకా ఆస్కార్ గుమ్మం తొక్కని వందేండ్ల తెలుగు వెండితెరకు ‘మిరపకాయ తొక్కే’ అవార్డు రప్పించింది.
తెలంగాణ ఇప్పటి వలె ఈసడింపుగా.. ద్వేషభావంతో ఎప్పుడూలేదు. సద్దితిన్న రేవును తలిస్తే బతుకు ఉంటది. బతుకు అని బతుకమ్మ లెక్క దీవెనిస్తది. ఆరు దశాబ్దాల కింద ‘కట్టిన ఇల్లు పెట్టినపొయ్యి సిద్ధంగా ఉంది’ అని చొరపడిన కాలం మళ్లీ ఇప్పుడు కండ్లమందు కదలాడుతున్నదా? ఉమ్మడి పాలనలో అణచివేతకు, పరాధీనతకు లోనైన తెలంగాణ రాజకీయ సమాజం తిరిగి అదే తోవతొక్కుతున్నదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నిజానికి ఒక సమాజం తనను తాను నిరూపించు కోవటానికి పదేండ్ల కాలం అతిస్వల్పమే. కానీ, పడింది పది అడుగులే అయినా.. వేలాది ప్రశ్నలకు సమాధానమై నిలిచింది. యాదాద్రి నర్సన్న గుడిని ‘నభూతో…’ అన్న రీతిగా నిర్మించినా, మూడేండ్ల రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసినా, నల్లగొండలో ఫ్లోరైడ్ పీడను బండకేసి కొట్టినా, కల్యాణలక్ష్మితో పేదింటి బిడ్డ పెండ్లికి అండగా నిలిచినా… ఏటూరునాగారం, తిర్యాణి వంటి కీకారణ్యంలోని ప్రభుత్వ దవాఖానల్లోనూ కాన్పుల కాలాన్ని సృష్టించినా, ఉమ్మడి రాష్ట్రంలో కేవలం వందకు పైచిలుకు ఉన్న గురుకులాల సంఖ్యను వెయ్యి దాటించినా.. ఇంకేదైనా సరే, అనేక రంగాల్లో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. రాష్ట్రంగా అవతరించిన పదేండ్ల తర్వాత చూస్తే… తెలంగాణ సఫల రాష్ట్రంగా ఎవరిముందూ తలవంచని స్థితికి చేరుకున్నది. అదే సమయంలో తనను మళ్లీ విఫల ప్రయోగంగా అపఖ్యాతికి గురిచేయొద్దని హెచ్చరిస్తున్నది. ఒకవేళ ఏమరుపాటుగా తప్పటడుగు పడితే ఎత్తేందుకు పిడికిలి సిద్ధంగానే ఉన్నది. దిక్కులు పిక్కటిల్లేలా ధిక్కార గొంతుకై ‘జై తెలంగాణ’ అని పలికేందుకు, ‘పోరు’ అడుగు వేసేందుకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని గతం నేర్పిన పాఠాన్ని గుర్తు చేస్తూనే ఉన్నది.
భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి చాలా శీఘ్రంగా జరుగుతుంది. నీళ్లలో మనవాటా తేలిన తర్వాత జలవనరుల విషయంలో స్వేచ్ఛ ఉంటుంది. స్వయంపాలనలో శాసిస్తాం. తెలంగాణ వస్తే మొదట చెరువులను పునరుద్ధరించాలి. గ్రామీణ వ్యవస్థ సస్యశ్యామలం అవుతుంది. తెలంగాణలో ఇవన్నీ సాధ్యమే. ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో ఆ చైతన్యం ఉన్నది కనుక.
– ఆచార్య కొత్తపల్లి జయశంకర్, తెలంగాణ సిద్ధాంతకర్త
తెలంగాణకు ఉన్నది ఒకే ఒక పరిష్కారమార్గం. అది గోదావరి ఒక్కటే. ఈ నదికి ఉపనదులుగా ఉన్న ప్రాణహిత, ఇంద్రావతిలో లభించే నీరు మాత్రమే మనల్ని బతికిస్తుంది. మేం 954 టీఎంసీల గోదావరి నీళ్లు హక్కుభుక్తంగా కలిగి ఉన్నాం. నీటి పారుదల మీద 50- 60 శాతం ఖర్చుపెట్టామని నాటి పాలకులు చెప్పారు. కనీసం ఏడు శాతం నీళ్లయినా ఇచ్చారా?
– ఆర్. విద్యాసాగర్‌రావు, కేంద్ర జల సంఘం, మాజీ చైర్మన్
తెలంగాణ రాష్ట్రం నిజరూపం దాల్చటానికి… దశాబ్దాలుగా తెలంగాణ అస్తిత్వ, ఆత్మగౌరవ ఆకాంక్షల దీపం ఆరిపోకుండా ఉండటానికి 1952 నుంచి 1969 మీదుగా తుదిదశ పోరాటం వరకు వందలాది మంది విద్యార్థులు, యువకులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. తమ ఇండ్లను చీకటి చేసుకొని మనకు వెలుగు దివిటీలుగా నిలిచిపోయారు. తొలి దశ పోరులో ఆత్మ బలిదానాలు చేసుకొన్నవారు నిత్యం మనలో స్ఫూర్తిని రగిలించటానికి అసెంబ్లీ ఎదురుగా గన్‌పార్క్‌లో నిర్మించిన అమరవీరుల స్థూపానికి ఎక్కా యాదగిరిరావు రూపకల్పన చేశారు. ఉమ్మడి పది జిల్లాల వీరులకు భవిష్యత్తులో నివాళి అర్పిస్తారో లేదో అనే అనుమానంతో నిత్య నివాళిగా పాలరాతి పుష్పాన్ని స్థూపంలో అమర్చారు. అనుమానించినట్టుగానే ఆ స్థూపం ఆవిష్కరణకు ఉమ్మడిపాలకులకు మనసు రాలేదు, సరికదా ఇటీవల కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు సైతం కనీసం నివాళి అర్పించకుండా ప్రారంభమైన మూడో అసెంబ్లీ సమావేశాల సాక్షిగా నిర్లక్ష్య వైఖరిని కొనసాగించింది. ఇలా ఉంటే, తెలంగాణ అస్తిత్వపతాక భవిష్యత్తు తరాలకు సాక్షీభూతంగా నిలవాలనే మహదాశయంతో రాష్ట్ర నూతన సచివాలయం ఎదురుగా కేసీఆర్ సర్కారు అమరవీరుల జ్యోతిని నిర్మించి ఆ త్యాగధనులకు అంకితం చేసింది. అమరవీరులకు గౌరవం మాత్రమే కాదు… చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్వాయి పాపన్న, కుమ్రంభీం వర్ధంతులను ప్రభుత్వమే నిర్వహించే సంస్కృతికి శ్రీకారం చుట్టింది. మరోవైపు తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్, ప్రజాకవి కాళోజీ, కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి, మాజీ ప్రధాని, భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ నర్సింహారావు జయంతులను ప్రభుత్వమే జరిపించటం మొదలుపెట్టింది. ఇక్కడితో ఆగకుండా విశ్వవిద్యాలయాలకు వారి పేర్లను పెట్టి తెలంగాణ పెద్దలను గౌరవించుకున్నది.
తెలంగాణ ఏర్పడినంక సాంస్కృతిక రంగంలో కవులు, కళాకారులు, రచయితలకు విశేష ఆదరణ దక్కింది. యాదగిరిగుట్ట ఉద్ధరణ, బతుకమ్మ పండుగకు దేశం మొత్తం మీద కీర్తి రావడం గొప్ప విషయాలు. ప్రజలు ‘ఇది నా తెలంగాణ’ అని గొప్పగా భావించే అస్మిత ఏర్పడింది. అంతకుముందు ‘మనం అడుగున ఉన్నం’ అనుకునేవాళ్లు. తెలంగాణ ప్రజలు స్వాభిమానాన్ని ప్రకటించుకోవటం వల్ల ఆంధ్ర ప్రాంతం వాళ్లలో ఇంతకుముందున్న సుపీరియారిటీ కాంప్లెక్స్ తగ్గింది. వాళ్లు కూడా మనల్ని కలుపుకొనే ప్రయత్నం చేస్తున్నరు. దీంతో రెండు ప్రాంతాల ప్రజల మధ్య సఖ్యత.. సమగ్రత సాధ్యపడింది. ఇక రాజకీయాలు పక్కనపెడితే సాగునీటి విషయంలో ప్రజలకు చాలా వరకు మేలు జరిగింది.
– ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, విశ్రాంత ఆచార్యులు, తెలుగు శాఖ, కాకతీయ విశ్వవిద్యాలయం
సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం తనను తాను పునరావిష్కరణ చేసుకొని పునర్నిర్మించుకునే ప్రణాళికను రూపొందించుకోవటంలోనే తొలి విజయాన్ని నమోదు చేసింది. వనరుల లభ్యత, వినియోగం, ప్రభుత్వ ప్రాధాన్యాంశాలు ఎంచుకోవటం, వాటికి సంబంధించిన ఆచరణ వల్లనే ఇవాళ తెలంగాణ దేశంలో అనేక రంగాల్లో అగ్రభాగాన నిలబడింది. వరి సహా అనేక పంటల ఉత్పాదకత రెట్టింపు అయింది. ఇక జిల్లాల పునర్విభజనను ప్రస్తుత అవసరాల కోణంలో కాకుండా దీర్ఘకాలిక దృష్టితో ఆలోచించాలి. అలాగే గురుకుల విద్యాలయాలను 1,100కు పెంచటం, రాష్ట్రంలోని 5 లక్షల మంది విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవటం మానవ వనరుల అభివృద్ధికి దోహదపడే అద్భుతమైన అంశం. ప్రభుత్వ అధీనంలోనే 33 మెడికల్ కాలేజీలు ఉండటం ఒక్క తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదు.
– ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, టీఎస్పీఎస్సీ, మాజీ చైర్మన్
అస్తిత్వ వేదన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో పరిపూర్ణమైంది. పదేండ్ల కాలంలో అనేక గొప్ప విజయాలను సాధించటం మామూలు విషయం కాదు. తెలంగాణ ఆత్మగౌరవం పెరగటంతోపాటు ఆర్థికాభివృద్ధిలో నెంబర్ వన్ స్టేట్‌గా నిలబడింది. అప్పటిదాకా గుజరాత్ మాడల్, మహారాష్ట్ర మాడల్ అని ఎవరికి వారు చెప్పుకొంటూ పోయిన చరిత్రను చూశాం. కానీ, వాటితో పోటీపడి వేటికీ అందనంత ఎత్తుకు తెలంగాణ ఎదిగింది. ఇది చిన్న విజయం కాదు. ఆ మాటకు వస్తే యావత్దేశమే అనుకరించి.. అనుసరించే దారిని తెలంగాణ వేసింది. ఇది మనకు గర్వకారణం. అమరుల జ్యోతి, కొత్త సచివాలయం, అంబేద్కర్ విగ్రహం ఇప్పుడు తెలంగాణ ఐకాన్స్. ఎన్ని విమర్శలు ఉన్నా కాళేశ్వరం అనే గొప్ప ప్రాజెక్టును కట్టుకోగలిగినం.
– అల్లం నారాయణ, తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్
పదేండ్ల కింది వరకు అంటే 2014 దాక అభివృద్ధి, అద్భుతమైన నిర్మాణాలు అంటే హైదరాబాదే చిరునామా. చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, బిర్లా మందిర్, చౌమొహల్లా ప్యాలెస్, హై కోర్టు… బయటి ప్రపంచానికి తెలిసినవి ఇవే. మరి ఇప్పుడు… హుస్సేన్ సాగర్ తటాకం సమీపంలో ఠీవిగా నిలబడిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, ఆ పక్కనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, మరోవైపు అమరవీరుల జ్యోతి తెలంగాణ మట్టికి ఉండే సహజీవన దార్శనికతను, త్యాగాల చరిత్రను కలకాలం ఆకాశమంత ఎత్తున నిలిచేలా చేస్తున్నాయి. పదేండ్ల తెలంగాణ ప్రగతి చెక్కిన శిల్పాలకు భవిష్యత్ తరానికి వారధిగా సగర్వంగా నిలుస్తున్నాయి. ఇంకోవైపు జిల్లాల పునర్విభజనతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు, పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయాలు తెలంగాణ దార్శనికతకు ప్రతిరూపాలుగా నిలిచాయి. ఇవే కాకుండా జిల్లాకో మెడికల్ కాలేజీ, అధునాతన ఆస్పత్రులు వెరసి నూతన నిర్మాణాలు తెలంగాణ కీర్తి పతాకాన్ని దశదిశలా ఎగరేస్తున్నాయి. ఇక తెలంగాణలోని సబ్బండ వర్గాల అస్తిత్వానికి గుర్తింపునిస్తూ రాజధానిలో చేపట్టిన సకల బీసీ కులాలకు సొంత భవనాల నిర్మాణం, ఆదివాసి, బంజారా గిరిజనుల ఆరాధ్యులు కుమ్రంభీం ఆదివాసీ భవన్, సంత్ సేవాలాల్ బంజారా భవన్ మొదలైన నిర్మాణాలు రాష్ట్రం ఏ ఒక్కరిదో కాదు… అందరిదీ అనే భరోసాను ఇస్తున్నాయి.
తెలంగాణ ఈ పదేండ్లలో ఉన్నంత ప్రశాంతంగా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎప్పుడూలేదు. అంతకుముందు ఒక అలజడి.. హింస ఉండేది. కానీ, అవన్నీపోయి మంచి బతుకు బతుకుతం అనే ఆశ కలిగింది. వ్యవసాయంలో ఒక జీవకళ వచ్చింది. గతంలో ఎప్పుడూ తెలంగాణ సెలెబ్రిటీ కాదు.. ఇక ఎప్పటికీ సెలెబ్రిటీయే. ఇవ్వాళ కిన్నెర మొగిలయ్య, గడ్డం రామస్వామి, సకిని రామచంద్రయ్య.. ఇట్లా అనేక మంది సెలెబ్రిటీలుగా కనిపిస్తున్నరు. బీఆర్ఎస్ రూపంలో స్థిరమైన ప్రభుత్వం ఉండటం వల్ల తెలంగాణ పదేండ్లు ప్రశాంతంగా ఉన్నది. తెలంగాణ ఎప్పుడూ ప్రగతిశీలంగానే ఉన్నది.
– దేశపతి శ్రీనివాస్, ప్రముఖ కవి, ఎమ్మెల్సీ
ఆవిర్భవించక ముందు తెలంగాణ భాషను జోకర్లకు, విలన్లకు పెట్టారు. విలన్లు కూడా టాప్ రేంజ్ వాళ్లుకారు.. ఏదో గల్లీ విలన్లు… జోకర్ టైప్ విలన్లు. కానీ, ఇవాళ తెలంగాణ భాష చిరంజీవి లాంటి అగ్రహీరోలు మాట్లాడాల్సిన భాషగా అనివార్యమైంది. తెలంగాణ నేల మీద పుట్టి, ఈ సంస్కృతి, సంప్రదాయాలతో సినిమాలు (బలగం మొదలైన) తీయటం వేరు. తెలంగాణేతర హీరోలు… డైరెక్టర్లు అందరూ తెలంగాణ యాసను అంగీకరించటం వేరు. ఇది తెలంగాణ విజయమే.
– చిమ్మని మనోహర్, సినీ దర్శకుడు
వరంగల్‌లో వందల ఎకరాలు పత్తి సాగు అయినపుడు ఆజంజాహీ మిల్లు స్థాపన జరిగింది. కానీ, పత్తి సాగు లక్షల ఎకరాలకు చేరేనాటికి అది మూతపడింది. ఫలితంగా వేలాది మంది చేనేత కార్మికులు పొట్టచేత పట్టుకొని ముంబయి, సూరత్, భీవండి తదితర ప్రాంతాలకు వలసపోవాల్సిన దుస్థితి నెలకొంది. అందుకే రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఉపాధి కోసం ప్రాంతబంధాన్ని తెంచుకొని పోయినవారిని ‘పోగు’బంధంతో తిరిగి పేగుబంధానికి దగ్గరి చేయాలనే దూరదృష్టితోనే ‘ఫాం టు ఫ్యాషన్’ ట్యాగ్‌లైన్‌తో అదే గడ్డమీద 2వేల ఎకరాల్లో ‘కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్కు’ నిర్మాణం చేపట్టింది కేసీఆర్ ప్రభుత్వం. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కేసీర్ కంకణం కట్టుకున్నారన్న విషయం ఈ ఒక్క ఉదాహరణతో బోధపడుతుంది.
– నూర శ్రీనివాస్