akshar band | ‘రాజా చెయ్యివేస్తే అది రాంగై పోదులేరా..’ ఈ కుర్రాళ్లు పాట ఎత్తుకుంటే.. హాలంతా కోలాహలం! ‘ఓం నమః నయన శ్రుతులకు..’ అని శ్రుతి సుభగంగా పాడితే.. ప్రేక్షకుల హృదయ లయలు వంతపాడుతుంటాయి! ‘ఆడేదే వలపు నర్తనం, పాడేదే చిలిపి కీర్తనం..’ అంటూ పాటతో ఆరుగురూ సయ్యాటకు దిగితే జగడ జగడమే! ఈ తరం యువకులు మ్యూజిక్ బ్యాండ్ పెట్టారంటే హిప్పాప్, ర్యాప్‌సాంగ్స్ గురించే ఆలోచిస్తారు! ఆరుగురు మిత్రుల ‘అక్షర్’ బ్యాండ్ మాత్రం మెలోడీ పాటలతో హైదరాబాద్ పబ్బుల్లో మత్తెక్కిస్తున్నది. యూత్ ఫెస్టివల్స్‌ను ఇళయరాజా పాటలతో రెత్తిస్తున్నది.
సినిమా పాటల పూదోటలో ఇళయరాజా గీతాలు ప్రత్యేకం. దశాబ్దాలు గడుస్తున్నా ఆయన స్వరాలు నిత్యనూతనంగానే వినిపిస్తుంటాయి. సన్నాయి స్వరాలకు ట్రంపెట్ విన్యాసాలు జతచేసి, సితార్ సిత్రాలను బేస్ గిటార్‌తో గీటి ఇళయరాజా పుట్టించిన పాటలు సంగీతజ్ఞులను కూడా ఆశ్చర్యపరిచేవి. కాబట్టే, తమ మ్యూజిక్ జర్నీకి ఇళయరాజా స్వరాలనే ఎంచుకున్నారు ‘అక్షర్’ బ్యాండ్ కుర్రకారు. ఆయన స్వరపరచిన పాటలకు తమదైన విలక్షణతను జోడించి వీనులవిందు చేస్తున్నారు. ‘ఇళయరాజా మాకు దేవుడిలాంటి వాడు. ఆయన సంగీతం చాలా సాంకేతికంగా ఉంటుంది. 90వ దశకంలో గురువుగారు అందించిన సంగీతం, పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి క్లాసిక్స్‌పై ప్రయోగాలు చేయడం కత్తిమీద సామే. కానీ పాట ఆత్మ చెడిపోకుండా, కొత్తగా ప్రజెంట్ చేస్తున్నాం’ అంటాడు అక్షర్ బృందంలోని డ్రమ్మర్ ఆరోన్ వెస్లీ.
బ్యాండ్ పెట్టిన కొత్తలో హిందీ పాటలకే అంకితమయ్యారు వీళ్లు. బాలీవుడ్లో సూపర్‌హిట్ పాటలను ఎంచుకొని వైవిధ్యంగా ప్రదర్శించేవారు. తెలుగు పాటలు పాడాలని ఉన్నా.. వాటికి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో అంచనా వేయలేక ఎనిమిదేండ్లపాటు వాటి జోలికి వెళ్లలేదు. ‘ఓ రోజు ధైర్యం చేసి తెలుగు పాటలు పాడటం మొదలుపెట్టాం. అద్భుతమైన స్పందన వచ్చింది. ఇళయరాజా గారి మీదున్న ప్రేమ, గౌరవం మమ్మల్ని తెలుగు పాటలు పాడేలా చేసింది. ఆయన పాటల్లో సంగీతం ఎవరినైనా కట్టిపడేస్తుంది. ఆయన స్వరాలకు కొత్త హంగులు జత చేస్తూ, రాక్ ఫ్యూజింగ్ ఇవ్వడం మొదలుపెట్టాం. ప్రేక్షకులు బాగా ఆదరించడంతో తెలుగు పాటలు కొనసాగిస్తున్నాం’ అని చెబుతాడు గాయకుడు మన్మోహన్ రాజ్.
2010లో ‘అక్షర్’ పేరుతో ఈ రాక్‌బ్యాండ్ మొదలైంది. డ్రమ్మర్ వెస్లీతోపాటు గాయకుడు మన్మోహన్ రాజ్, కీబోర్డ్ ప్లేయర్ గోపాల్ షాహిస్, గిటార్ వాద్యకారులు విజిత్ సింగ్, సురాబిత్, సౌండ్ ఇంజినీర్ రామన్ గచన్.. ఇలా ఆరుగురు జతకలిశారు. ‘బ్యాండ్ ఏర్పాటు చేసిన కొత్తలోనే హైదాబాద్ బిట్స్ పిలానీలో జరిగిన ఓ పోటీలో విజేతలుగా నిలిచాం. తర్వాత మంచి అవకాశాలు రావడంతో మరింత ఉత్సాహంగా పనిచేశాం. కొన్నాళ్లకు టీకేఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో హిప్పాప్ కాన్సర్ట్ చేశాం. ఆ ఈవెంట్ విజయవంతం కావడంతో మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. నాటి నుంచి మా ప్రయాణం నిరాటంకంగా కొనసాగుతున్నద’ని చెప్పుకొచ్చాడు మన్మోహన్. ‘ఆనందో బ్రహ్మ’, ‘రూప్ తేరా మస్తానా..’, ‘జానే జా..’ పాటలు వీరికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ‘క్షణక్షణం’ సినిమాలోని ‘అమ్మాయి ముద్దు ఇవ్వందే.. ఈ రేయి తెల్లవారనివ్వనంతే!’ పాటతో చేసిన వీడియో ‘అక్షర్ బ్యాండ్’కు బ్రాండ్‌గా మారింది. ఈ పాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Jobs | నిరుద్యోగులకు ఓ ఉపాధ్యాయుడి కానుక.. లైబ్రరీ, వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి మరీ..
వాచ్‌మన్ నుంచి IIM ప్రొఫెసర్ దాకా.. కేరళ యువకుడి సక్సెస్ స్టోరీ
ఒకప్పుడు స్కూల్ డ్రాప్ అవుట్.. ఇప్పుడు మల్టీ మిలియనీర్.. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా?
కన్నబిడ్డలు కాదనుకున్న అమ్మానాన్నలకు కొడుకు అయ్యాడు
Gudipadu | తెలంగాణలోని ఈ గుడిలో గిరిజనులే పూజారులు
మరో పతంజలి పంకజ కస్తూరి నాయర్
కొడుకును కోల్పోయినా.. వందలాది బిడ్డలకు ప్రాణం పోస్తున్నాడు..