మనదేశంలో ఎక్కడైనా సరే దుకాణాలు వాటి యజమానులు లేకుండా అసలు నడవవు. ఒకవేళ దీనికి భిన్నంగా జరిగితే అది కొనేవాళ్లపై ఎంతో నమ్మకం, గౌరవంతోనే జరగాలి. ఈశాన్య భారతదేశ రాష్ట్రం నాగాలాండ్‌లోని ద్జులెకె అనే పట్టణం ఇలాంటిదే. ఇక్కడ మాత్రమే కాదు నాగాలాండ్‌కు దగ్గర్లో ఉండే మిజోరాం రాష్ట్రంలోనూ దుకాణాలు యజమానులు లేకుండానే దర్శనమిస్తాయి. దుకాణంలో ప్రవేశించిన కొనుగోలుదారులు తమకు కావాల్సిన సరకులు తీసుకుని, వాటికి ఎంతైందో అంత చెల్లిస్తారు. అదే మనదేశంలో మిగిలిన ప్రదేశాల్లో అయితే, సరకులు కొనేటప్పుడు మనల్ని దుకాణానికి సంబంధించిన వ్యక్తి ఓ కంట కనిపెడుతూ ఉంటాడనేది తెలిసిన విషయమే. వాళ్లు మనకు కావాల్సిన వస్తువు ఎక్కడుందో చెప్పడంతోపాటు, ర్యాకుల్లోంచి ఏదైనా తీసుకుని దాచుకుంటున్నామేమో అని గమనిస్తూనే ఉంటారు.
కానీ, ఈ రాష్ర్టాల్లో మాత్రం అలాకాదు. కొనుగోలుదారుల మీద చాలా నమ్మకంతో ఉంటారు. ఈ దుకాణాల్లో మనుషులే కాదు వాటికి తాళాలు, గేట్లు కూడా ఉండవు. డబ్బులు వేయడానికి తాళం వేసిన ఓ గల్లాపెట్టె మాత్రం ఉంచుతారు. అంటే.. ఇక్కడ నమ్మకమే పెట్టుబడిగా పనిచేస్తుందన్నమాట. వస్తువులను బుట్టలు, ర్యాకుల్లో పొందికగా అమరుస్తారు. వాటికే కొనేవాళ్లు ఎంత చెల్లించాలో ధరలు రాసి ఉంటాయి. ఇప్పుడు ఏది కొనాలన్నా యూపీఐ చెల్లింపులే ప్రధానమయ్యాయి.
కానీ ఇక్కడ మాత్రం గల్లాపెట్టెలో డబ్బులు ఉంచాల్సిందే. పైగా మనల్ని నమ్మి దుకాణంలో ఎవరూ ఉండరు కాబట్టి, ప్రేమతో కొంచెం ఎక్కువగా వేస్తే సంతోషిస్తారు. కేవలం నమ్మకంతోనే ఇలా నడవడానికి స్థానిక సంస్కృతిలో సాటి మనుషుల పట్ల బలంగా నాటుకుపోయిన విశ్వాసం, సామాజిక విలువలే పునాదులుగా నిలిచాయి. జపాన్, న్యూజిలాండ్ లాంటి కొన్ని దేశాల్లో కూడా యజమానులు, పర్యవేక్షణ లేని దుకాణాలు కనిపిస్తుంటాయి. ప్రపంచంలో ఎక్కడైనా సరే మనుషులు బాధ్యతలు, నడవడిక విషయంలోనూ నమ్మకంగా ప్రవర్తించడమే పునాది. అందుకు ఇలాంటి దుకాణాలే స్ఫూర్తి!