Room to Read | కరోనా కారణంగా చదువు నాలుగు గోడలకే పరిమితమైంది. రోజూ పాఠాలు బోధించే ఉపాధ్యాయులు సైతం ఫోన్లలో గంటో రెండు గంటలో కనిపిస్తున్నారు. దీంతో పిల్లల కోసం ‘రూమ్ టు రీడ్ ( Room to Read ) ‘ అనే స్వచ్ఛంద సంస్థ ఓ వెసులుబాటు కల్పించింది. తమ టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేస్తే.. బోలెడన్ని విషయాలు చెబుతుంది. కొత్త నైపుణ్యాలనూ బోధిస్తుంది.
సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అవన్నీ బాల్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆ విష వలయంలో పడకూడదంటే.. పసితనం నుంచే విద్యార్థులకు జీవన విధానం, నైతిక విలువలపై అవగాహన కల్పించాలి. దీనివల్ల చదువుల్లో ఒత్తిడిని తట్టుకుంటారు. సమాజంలోని లోటుపాట్లను గ్రహిస్తారు. చిన్నచిన్న సమస్యలకే కుంగిపోరు. పెద్దపెద్ద విజయాలకూ పొంగిపోరు. సరిగ్గా ఇలాంటి లక్ష్యంతోనే ‘రూమ్ టు రీడ్’ సంస్థ దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. తాజాగా, బాలికా విద్యను బలోపేతం చేసేందుకు టోల్ ఫ్రీ సేవలను ప్రారంభించింది. కాల్ చేసి ఉత్తేజకరమైన కథలు వినవచ్చు. విద్యార్థులు చేయాల్సిందల్లా.. 1800 120 555550 నంబర్‌కు డయల్ చేయడమే. తర్వాత.. గప్‌చుప్‌లు వినడానికి 1, ఉత్తేజకరమైన కథలు వినడానికి 2, జీవన నైపుణ్యాల కథలు వినడానికి 3 నొక్కితే సరిపోతుంది. గప్‌చుప్ కేటగిరీలో అంతరిక్షం, సహానుభూతి వంటి అంశాలపై కథలుంటాయి. ఉత్తేజకరమైన కథల విభాగంలో.. కాంతారావు కథలు, కరీమున్నీసా బేగం కథలు వినొచ్చు. జీవన నైపుణ్య విభాగంలో.. సమస్య-పరిష్కారం, పోషణ, ఆరోగ్యానికి సంబంధించిన కథలు వినొచ్చు.
పదో తరగతి పాసైన విద్యార్థినులను భవిష్యత్‌కు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ‘మోడల్ లైఫ్ స్కిల్’ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది రూమ్ టు రీడ్. కస్తూర్బా పాఠశాలల్లో ఈ లైఫ్ స్కిల్ సెంటర్స్ ప్రాణం పోసుకుంటున్నాయి. వీటివల్ల పిల్లలకు చిన్న వయసు నుంచే జీవన నైపుణ్యాలు తెలుస్తాయి. సరైన శిక్షణ దొరుకుతుంది. చదువు పూర్తయిన వెంటనే ప్రతిభకు తగిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. దీంతో ఆత్మవిశ్వాసం పెరిగి, సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకుసాగుతారు. మోడల్ లైఫ్ స్కిల్ సెంటర్స్‌లో ఆధునిక బోధన పద్ధతుల్లో టీచర్లకు శిక్షణ ఇచ్చారు. రూమ్ టు రీడ్ ద్వారా పుస్తకాలు కూడా పంపిణీ చేస్తారు. ఆయా తరగతుల వారికి కావల్సిన స్టడీ మెటీరియల్, ఈ-లెర్నింగ్ సామగ్రి కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు.
అక్షరాస్యత పెంచేందుకు, లింగ సమానత్వాన్ని సాధించేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తుంటుంది ‘రూమ్ టు రీడ్’. ఇదొక గ్లోబల్ నెట్వర్క్. భారత్‌తో పాటు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, కంబోడియా, లావోస్, వియత్నాం,దక్షిణాఫ్రికా, జాంబియా, టాంజానియా వంటి దేశాల్లో సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 2003 నుంచీ మనదేశంలోని దాదాపు
10కిపైగా రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నది. ఆరేండ్ల నుంచి 18 ఏండ్ల వయసు కలిగిన పిల్లలను లక్ష్యంగా చేసుకొని వారికి చదువుతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల పేద పిల్లల కోసం సహాయ కార్యక్రమాలు చేపడుతున్నది. స్థానిక ప్రభుత్వాలకు అక్షరాస్యత సాధనలో అండగా నిలుస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
అన్నదాతకు అండగా వరంగల్ జిల్లా మహిళలు.. ఏం చేస్తున్నారంటే..
రైతులకు అండగా తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు.. వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసా
రతన్ టాటా భుజాలపై చేయి వేసి మరీ మాట్లాడగలిగే ఈ వ్యక్తి గురించి తెలుసా
Lawyer Subbu | ఈయన పేదల పాలిట ‘జై భీమ్’