Lawyer Subbu | పీడితుల తరఫున కోర్టులో వాదించే న్యాయవాదులను చూసినప్పుడు.. ‘మన దగ్గర కూడా ఇలాంటి లాయర్లుంటే బాగుండు’ అనుకుంటాం. జైభీమ్ సినిమా చూశాక, రూపాయి కూడా ముట్టని న్యాయవాదుల గురించి వింటున్నప్పుడు.. న్యాయం ఇంకా బతికే ఉందనిపిస్తుంది. మన తెలంగాణలోనూ చంద్రు లాంటి వకీల్‌సాబ్ ఒకరున్నారు. ఆయన పీడితుల పక్షాన న్యాయం కోసం గొంతెత్తున్నారు. పట్టుమని 30 ఏండ్లు కూడా నిండని ఈ ప్లీడర్.. ఇప్పటికే వందల కేసుల్లో విజయం సాధించారు. ఆయనే సింగపోగు సుబ్బారావు, ఉరఫ్ లాయర్ సుబ్బు.
సమయం సాయంత్రం 4 గంటలు. మలిసంధ్యలో అరుణకాంతులను చీల్చుకుంటూ గర్వంగా నిలబడి ఉన్నది.. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్.
సువిశాల మైదానంలో అక్కడక్కడా కూర్చున్న విద్యార్థులు పుస్తకాలు తిరగేస్తున్నారు. కొంతమంది స్నేహితులతో కబుర్లు చెప్పుకొంటున్నారు. ఒకరిద్దరు ఉద్యమకారులు గత స్మృతులను నెమరేసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. కుడివైపున, వాటర్ ఫౌంటెయిన్ పక్కనే తెల్లని దుస్తులతో ఓ వ్యక్తి నలుగురు మహిళలతో మాట్లాడుతున్నాడు. ఓ తల్లి తన బిడ్డను చూపుతూ.. కన్నీటి పర్యంతం అవుతున్నది. చేతుల్లో ఏవో కోర్టు కాగితాలు. అతను హైకోర్టు న్యాయవాది సుబ్బారావు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆ ఆడబిడ్డ పేరు జ్యోత్స్న. ఆమె భర్త ఆర్మీలో పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నాడు. పదేండ్లు కాపురం చేసి, ఇద్దరు బిడ్డలను కన్న తర్వాత జ్యోత్స్నను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వేరే మహిళతో సంబంధం పెట్టుకొని, భార్యను చిత్రహింసలు పెడుతున్నాడు. రిటైర్మెంట్ తర్వాత సొంతూరికి తీసుకెళ్లినా, చుట్టుపక్కల ఎవరితోనూ మాట్లాడకుండా ఆంక్షలు విధించాడు. భార్యగా కాకుండా, ఇంట్లో పనిమనిషిగా పరిచయం చేశాడు. జ్యోత్స్నను ఎంత భయపెట్టాడంటే.. ఇప్పటికీ మగవారిని చూస్తేనే భయంతో వణికిపోతుందామె. ఆమెకు పిచ్చి పట్టిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు ఆ రాకాసి మొగుడు. జ్యోత్స్న ఒక లాయరును మాట్లాడుకుంటే, ఆ న్యాయవాదినీ ప్రలోభపెట్టేవాడు. దీంతో ఆమె లాయర్ సుబ్బారావును ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించి, అన్ని ఆధారాలూ సేకరించి ఈ ఆడబిడ్డకు న్యాయం చేసేందుకు కంకణం కట్టుకున్నాడు లాయర్ సుబ్బారావు. ప్రస్తుతం పార్టిషన్ సూట్ వేసి ఆమెకు భర్త ఆస్తిపై చట్టపరమైన హక్కులు కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు.
న్యాయం ఉంటే.. నో ఫీజు న్యాయశాస్త్ర విద్యార్థిగానే ‘ఉచిత న్యాయసేవ’ (ఫ్రీ లీగల్ ఎయిడ్) క్యాంపులు నిర్వహించేవాడు సుబ్బారావు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంపై అవగాహన కల్పించేవాడు. తనలా ఎవ్వరికీ అన్యాయం జరగొద్దనే ఉద్దేశంతో భూమి గొడవలు, భార్యాభర్తల వివాదాలు, అత్యాచారాలు, వేధింపు కేసులను మాత్రమే తీసుకుంటున్నాడు. బాధితుల వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు ఉంటే ఉచితంగా వాదిస్తాడు. అంతకుమించి ఉంటే మాత్రం సాధారణ ఫీజు తీసుకుంటాడు. ఆ నిర్ణయాన్ని సీనియర్లు వ్యతిరేకించినా, పావలాకు కూడా పనికిరావని హేళన చేసినా సుబ్బారావు పట్టించుకోలేదు. ఇప్పటికి 200 పైగా కేసులను ఉచితంగా వాదించాడు. కోర్టు ద్వారా బాధితులకు న్యాయాన్ని అందించాడు. సుబ్బారావు కూచిపూడి నృత్య కళాకారుడు కూడా. అంతేకాదు, మంచి రంగస్థల నటుడూ. రాష్ట్రస్థాయి యువజన ఉత్సవాల్లో ప్రతిభ చూపాడు. నంది నాటకోత్సవాల్లో పాల్గొన్నాడు. బాల నేరస్తులకు కూచిపూడి నృత్యం నేర్పిస్తున్నాడు.
ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలం సిద్ధారం సుబ్బారావు స్వగ్రామం. లాయర్ కావాలని చిన్నప్పుడే నిర్ణయించుకున్నాడు. అందుకు కారణం చింతలపాడు గ్రామానికి చెందిన తాత డోల ముత్తయ్య. చేయని నేరానికి పోలీసులు ముత్తయ్యను చిత్రహింసలు పెట్టారు. రక్తమోడుతున్నా ఆ నేరాన్ని ఒప్పుకోలేదు ముత్తయ్య. పోలీసుల కాఠిన్యానికి బలై, లాకప్‌లోనే ఊపిరి వదిలాడు. ఆ సంఘటన గురించి తన తల్లి కుమారి ద్వారా తెలుసుకున్నాడు సుబ్బారావు. అంతలోనే మరో సంఘటన జరిగింది. సుబ్బారావు ఆరో తరగతిలో ఉండగా.. వాళ్ల కుటుంబ ఆస్తిని కబ్జా చేశారు. తర్వాత ఇంటి స్థలం విషయంలోనూ సుబ్బారావుకు ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే న్యాయవాద వృత్తే సరైన మార్గమని నమ్మి లా చదివాడు. దాతల సాయంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్య పూర్తిచేశాడు.
..✍ డప్పు రవి
ఫొటోలు: జి.భాస్కర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
gauthami jeji | బొల్లి మచ్చలు ఉన్నాయని కుంగిపోలేదు.. మోడలింగ్‌లో అదరగొడుతుంది..
Vijayalakshmi | చదివింది పదో తరగతే కానీ.. చేసేది కోట్ల బిజినెస్
Anshul Gupta | ఆ 1200 మంది మహిళల వెనుక ఒక్కడు..
మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్
Gray hair | చిన్నవయసులోనే తల నెరిసిన వారికి ఈమె ఓ ఇన్స్పిరేషన్.. ఎందుకంటే?