సనాతన ధర్మంలో ఆలయ వ్యవస్థ అత్యంత ప్రధానమైనది. మరే ఇతర మతంలో లేని ప్రత్యేకత మన ఆలయాల పద్ధతిలో ఉంది. అదేమిటో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీదా ఉంది. దేవాలయాల నిర్మాణంలో ప్రత్యంశం ఏ పద్ధతిలో రూపు దిద్దుకుంటుందో తెలియడంతో పాటు అక్కడ భక్తులు ఏ విధంగా మెలగాలో, దేవతానుగ్రహం కోసం ఏ నియమాలు పాటించాలో తెలియజేసే గొప్ప గ్రంథాన్ని రచించారు డాక్టర్ కప్పగంతు రామకృష్ణ. నేటి సమాజంలో ఆధ్యాత్మికత కూడా ప్రబలంగానే గోచరిస్తున్నది. కానీ ఆధ్యాత్మికతకు అందవలసిన ఫలాన్ని ఆ మార్గాన పయనించేవారు పొందుతున్నారా అంటే అవుననలేని స్థితి కనిపిస్తున్నది. దానికి కారణం ఆధ్యాత్మిక అంశాల పట్ల సరైన అవగాహన లేకపోవడమే. అందువల్ల తీర్ధయాత్రలు ఆ యాత్రికుల సంస్కార బలాన్ని పెంపొందించలేకపోతున్నాయి.
దేవాలయ సందర్శకులు తాము కొలుచుకుంటున్న దైవాన్ని సాక్షాత్కరింప చేసుకోవటమే వారి యాత్ర లేదా సందర్శనకు ముఖ్యమైన ఫలం. ఆ ఫలాన్ని వారు అందుకోవడానికి ‘దేవుణ్ణి చూద్దాం… రండి’ మార్గదర్శనం చేస్తుంది అనడంలో సందేహం లేదు. స్వామి వివేకానందులు రామకృష్ణ పరమహంసను- ‘మీరు దేవుడిని చూశారా? నాకు చూపిస్తారా?’ అని ప్రశ్నించినప్పుడు- ‘నిన్ను చూస్తున్నంత స్పష్టంగా చూశాను. అలాగే నీకు కూడా చూపిస్తాను’ అని సమాధానమిచ్చి, అదేవిధంగా చేసిన విషయం జగద్విదితం. అలా దృఢమైన రీతిలో ‘దేవుణ్ణి చూద్దాం… రండి’ అనే పేరుతో ఈ రచన వెలువడటం ముదావహం. ఈ పుస్తకం చదివిన తర్వాత.. గుడికి వెళ్లినా, యాత్రకేగినా.. అంతకుముందు పొందిన అనుభూతి కన్నా పదింతల అలౌకిక ఆనందాన్ని పొందుతారని చెప్పొచ్చు.