నవ్వుల పువ్వులు!
చిత్రలేఖనంలో ఆరితేరిన వ్యక్తి గోపాలకృష్ణ. ఆయన కార్టూన్లు ఎంత నవ్విస్తాయో వాటికి వేసే బొమ్మలూ అంత అందంగా ఉంటాయి. ఇక గోపాలకృష్ణ కార్టూన్ల సంపుటి విషయానికి వస్తే అన్నీ చక్కిలిగింతలే! ప్రతి కార్టూన్ ఆలోచింప చేస్తుంది. ఓ కార్టూన్లో.. జలుబు, దగ్గు ఉన్నాయని ఓ పెద్దమనిషి కరోనా టెస్ట్‌కు బయటికి వస్తే పోలీసులు చావ బాదుతారు. తర్వాత ‘ముందు చెప్పొచ్చు కదయ్యా టెస్ట్ కోసం వెళ్తున్నానని..’ అని బాధపడటం కాప్షన్. ఇది కరోనా కాలంలో వచ్చిన కార్టూన్ కాబట్టి గోపాలకృష్ణ సమయోచిత స్పందన అర్థం అవుతుంది. మరో కార్టూన్ లో ‘పెట్రోల్ 100 దాటినా మీరు ఫుల్ ట్యాంకు కొట్టించారట. అందుకే ఇంటి అద్దె 2000 పెంచుతున్నాను’ అంటాడు ఓనర్. ఇదీ సందర్భోచిత స్పందనే. ఇంకో కార్టూన్ లో పెళ్లి పందిరి. అందరూ మాస్కులు ధరిస్తారు. వరుడు దూరంగా నిలబడి ఒక కర్రకి తాళిని తగిలించి వధువు మెడలో వేస్తుంటాడు. ఇదో క్యాప్షన్లెస్ కార్టూన్! కారు వృద్ధాశ్రమం వైపు పరుగులు తీస్తుంటుంది. ముందు కూర్చున్న భార్యాభర్తల మొహంలో ఆనందం.. వెనక కూర్చున్న తల్లిదండ్రులు ఏడుస్తుంటారు. గోపాలకృష్ణ కేవలం బొమ్మ వేసి క్యాప్షన్ రాయడమేకాదు, దృశ్యానికి తగిన నేపథ్యం వేస్తారు. దీనివల్ల కార్టూన్ జీవం పోసుకుంటుంది. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఉదాహరణలు. నవ్వుకున్న వారికి నవ్వుకున్నంత!
గోపాలకృష్ణ కార్టూన్లు
పేజీలు: 112; ధర: రూ. 100
ప్రతులకు : 94404 90384
…? ఆద్య
ఓ సాధకుడి సమాధానాలు
‘నేనెవరు?’ తేలికైన ప్రశ్న. సమాధానం లోతైనది. ‘దేవుడున్నాడా?’ చాలామందిని వేధించే ప్రశ్న. సర్వాంతర్యామి అయిన పరమాత్మను మాంసనేత్రాలతో చూడలేం. కానీ అనుభూతించగలం. ‘గురువు అవసరమా?’ అనేవారికి ఏం చెబుతాం. చీకట్లో ప్రయాణిస్తున్నప్పుడు దీపం అవసరమా? అని అడిగినట్టే ఉంటుంది. ఆస్తికులనూ, నాస్తికులనూ, తటస్థులనూ వేధించే ప్రశ్నలు అనేకం. ఎవరు సమాధానమిస్తారు? కొన్ని జవాబుల్లో శాస్త్రీయత ఉండదు. కొన్ని జవాబుల్లో భారతీయ ఆత్మ కనిపించదు. ‘దైవ మీమాంస’ రచయిత వేంకట వినోద్ పరిమి.. ఈ రెండిటినీ రంగరించి ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ఇవన్నీ గూగుల్ నుంచి గంపగుత్తగా సేకరించినవి కాదు, అంతర్మథనంలో ఓ రూపాన్ని సంతరించుకున్నవి. మనిషి వికాసానికి తొలిమెట్టు ప్రశ్న. ప్రశ్నలోంచి జవాబు వస్తుంది. ఆ జవాబులోంచి మరికొన్ని ప్రశ్నలు పుడతాయి. ఈ మీమాంస తర్కానికి పదునుపెడుతుంది. కాబట్టే.. భగవద్గీత, గురుగీత తదితర భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యమంతా ప్రశ్నోత్తరాల రూపంలోనే ఉన్నది. ‘ప్రశ్నోపనిషత్’నూ ఇక్కడ ప్రస్తావించాల్సిందే.
దైవ మీమాంస
రచన: వేంకట వినోద్ పరిమి
పేజీలు: 128; వెల: రూ.200
ప్రతులకు: 8558899478