ఎరుకలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల్లో నివాసం ఉండే ఆదివాసీ తెగ. తాము మహాభారతంలో ఏకలవ్యుడి వారసులుగా భావిస్తారు. బాగా వెనకబడిన భారతీయ సమాజాల్లో ఈ తెగ ఒకటి. పందుల పెంపకం, గాడిదలపై ఉప్పు అమ్మకం, ఎర్రమన్ను, ముగ్గు అమ్మకం, వెదురు బుట్టలు, చాపల తయారీ వీరి వృత్తులు. సోది చెప్పి సాంత్వన చేకూర్చడం ఎరుకలమ్మికి అబ్బిన నైపుణ్యం. ఒకరి సొత్తుకు ఆశపడకుండా కష్టపడి బతకడం వీరి జీవన విధానం. అలాంటి తెగ తరతరాలుగా అణచివేతకు, అవమానాలకు, అన్యాయాలకు గురైంది. వీరి జీవితాల చిత్రణతో పలమనేరు బాలాజీ ‘ఏకలవ్య కాలనీ ఎరుకల జీవనగాథలు’ కథా సంకలనం తీసుకువచ్చారు.
ఎరుకల జీవిత చిత్రణతో వచ్చిన తొలి కథా సంకలనం ఇదే కావడం విశేషం. ఊరికీ, అడవికీ మధ్యలో తమ ఉనికి కోసం, నిలువ నీడ కోసం, భూమి కోసం, మెరుగైన సామాజిక జీవితం కోసం ఎరుకలు సాగిస్తున్న సంఘర్షణకు అక్షరరూపం ఈ సంకలనం. బ్రిటిష్ పాలన కాలంలో దొంగలుగా ముద్రపడిన ఎరుకలు ఆ తర్వాత కాలంలోనూ ఎదుర్కొన్న అవస్థలను ‘మా తప్పేంది సామి’లో రచయిత కండ్లకు కట్టారు. మునిదేవర, ఎర్రమన్ను ముగ్గుపిండి, వెదుర్లు కథలు ఎరుకల సాంస్కృతిక, సామాజిక జీవితాన్ని చిత్రిస్తూ వాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేస్తాయి.
‘ఏనుగుల రాజ్యంలో’ కథ అడవి అంచున వ్యవసాయం చేసే ఎరుకల పొలాలు ఏనుగుల బారినపడితే వారి పరిస్థితి ఎలా ఉంటుందో వివరిస్తుంది. ‘ఏకలవ్య కాలనీ’ కథ ఎరుకల జీవితాల్లో రావాల్సిన మార్పుల గురించి చర్చిస్తుంది. ‘ధర్నా’, ‘చప్పుడు’ కథలు వారిలో చైతన్యానికి బాటలువేస్తాయి. ఇలా ‘ఏకలవ్య కాలనీ..’లో ఎరుకల తెగ సమస్త జీవితాన్ని బాలాజీ చిత్రించారు. ఆధునిక యుగంలోనూ ఆ తెగ అనుభవిస్తున్న బాధలు, అట్టడుగున ఉన్నప్పటికీ ఆటంకాలు దాటుకుని ఎవరో ఒకరు సాధిస్తున్న విజయాలు పాఠకులను ఆలోచింపజేస్తాయి.
ఏకలవ్య కాలనీ- ఎరుకల జీవనగాథలు
రచన: పలమనేరు బాలాజీ
పేజీలు: 165; ధర: రూ. 220
ప్రచురణ: పర్స్పెక్టివ్స్
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
ఫోన్: 040 24652387