Personal finance Tips | ‘అప్పు-డే తెల్లారిందా’ ఈ మాటతోనే చాలామంది మధ్యతరగతి జీవుల రోజు మొదలవుతుంది. ‘అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా!’ గీతాన్ని ఒంటబట్టించుకున్న వారికి రుణపాశమంటే భయం ఉండదు. అవసరానికి అప్పు చేయడం తప్పు కాదనీ, తద్వారా తక్షణ ముప్పు తప్పించుకోవచ్చని బలంగా విశ్వసిస్తుంటారు. కానీ, పరపతికి మించిన రుణగ్రహణం జీవితానికి గ్రహణం వంటిది. ఆ పీడ వీడాలంటే ఏండ్లు పట్టొచ్చు, కొన్నిసార్లు జీవితం పూర్తయ్యేనాటికి కూడా రుణగ్రస్తుడిగానే మిగిలిపోవచ్చు. చిన్న చిన్న తప్పులు సరిదిద్దుకుంటే ఈ అప్పుల ముప్పు నుంచి తేలిగ్గా బయటపడొచ్చు.
‘అప్పిచ్చువాడు..’ ఉన్న ఊళ్లోనే మకాం ఉండాలని సుమతీ శతకకారుడి తీర్మానం. పెద్దల మాటలను, మన అవసరాలను దృష్టిలో ఉంచుకుంటే అప్పు చేయడం తప్పు కాదు. కానీ, తీర్చే మార్గం ఏమిటో స్పష్టంగా తెలిసి ఉండాలి. నెలాఖరులో వేతన జీవుల వెతలు అన్నీ ఇన్నీ కావు. అవసరానికి అప్పు ఎవరు ఇస్తారా అని జల్లెడ పడుతుంటారు. ఆర్థిక విధానాలు ఎంత కచ్చితంగా పాటించినప్పటికీ, అనుకోకుండా వచ్చే ఆరోగ్య సమస్యలు అప్పులపాలు చేస్తుంటాయి. ఆరోగ్యబీమా తీసుకుంటే.. అలాంటి ఇబ్బందులు తలెత్తినప్పటికీ అప్పు కోసం వెంపర్లాడాల్సిన దుస్థితి ఏర్పడదు.
సర్వసాధారణంగా సరైన ఆర్థిక విధానాలు పాటించని వ్యక్తులే ఎక్కువగా అప్పులపై ఆధారపడాల్సి వస్తుంటుంది. అయితే, అప్పు చేయడం మినహా మరోమార్గం లేదన్నప్పుడు బ్యాంకులో రుణం తీసుకోవడం శ్రేయస్కరం. బ్యాంకులు రుణగ్రహీత ఆదాయ, వ్యయాలు పరిశీలించి, సిబిల్ స్కోర్‌ను అనుసరించి రుణ పరిమితిని నిర్ణయిస్తాయి. అంటే, ‘ఇంత మొత్తం అప్పు రుణగ్రహీత కట్టగలడు’ అని పరోక్షంగా ధ్రువీకరించటం అన్నమాట. బ్యాంకు నిర్దేశించిన మొత్తం రుణం పొందడం భారంగా పరిణమించదు. అయితే, రెండుమూడు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవడం, ఇన్స్టంట్ లోన్ యాప్స్ ద్వారా అప్పులు తీసుకోవడం మొదలుపెడితే కష్టాలు కొని తెచ్చుకున్నట్టే! బ్యాంక్ రుణంతోపాటు ప్రైవేట్ వ్యక్తుల దగ్గరా ఎక్కువ వడ్డీకి అప్పు చేసే స్థాయికి చేరుకోవడం అంటే సదరు వ్యక్తి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడని అంచనాకు రావచ్చు. బ్యాంకు లోన్ అందరికీ రాకపోవచ్చు. అలాంటివారు ప్రైవేట్ వ్యక్తులపై ఆధారపడాల్సి వస్తుంది. అయినవారి మధ్యే ఆర్థికాంశాలు చిచ్చుపెడుతున్న ఈ రోజుల్లో.. బయటివ్యక్తి దగ్గర రుణాలు తీసుకోవడం అంత శ్రేయస్కరం కాదని గమనించాలి.
కొందరు తమ పలుకుబడితో రుణాలు రొటేషన్ చేస్తుంటారు. ‘హమ్మయ్య! ఈ పూటకు గండం గడిచింది’ అనుకుంటారు. కానీ, అప్పు తీర్చడానికి అప్పు చేయాల్సి వస్తుందంటే ఆ వ్యక్తి రెడ్ జోన్లో ఉన్నాడని గ్రహించాలి. చిన్నచిన్న అప్పులు తీర్చడానికి పెద్ద అప్పు చేస్తుంటారు. వడ్డీ సహా అది రెండింతలు అయ్యాక.. దాన్ని తీర్చడానికి మరో భారీ రుణం చేస్తారు. ఇలా ఎన్ని రోజులు? రుణచట్రంలో ఇరుక్కుంటే ఓ పట్టాన బయటపడలేం. ఆనందాల కోసం, లగ్జరీల కోసం అప్పు చేయడం అర్థశాస్త్ర రీత్యా పెద్ద నేరం. అలాంటి నేరానికి పాల్పడితే.. జీవితాన్ని చేజేతులా అగాధంలోకి నెట్టుకున్నట్లే. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు.. ఎదురింటి వాళ్లకు ఉంది కదా అని 72 అంగుళాల టీవీ కోసమో, అబ్బాయికి కొత్త బైక్ కొనివ్వాలనో, అమ్మాయికి డైమెండ్ నెక్లెస్ గిఫ్ట్‌గా ఇవ్వాలనో, నలుగురిలో దర్జాగా కనిపించాలనో రుణాలు తీసుకుంటే.. వాటిని తీర్చలేక రోడ్డున పడే రోజు రావచ్చు. రుణదాతల ఒత్తిడి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపొచ్చు. అంతవరకూ రావొద్దంటే ఉన్నదాంట్లో సర్దుకుపోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఆస్తులు అమ్మయినా సరే అప్పు తీర్చేయాలి. ‘అప్పు లేని వాడె అధిక సంపన్నుడు’ అన్న వేమన వాక్యాన్ని మించిన ఆర్థిక సూత్రం మరొకటి లేదు.
➤ ఎక్కువ అప్పులు ఉన్నప్పుడు స్థిరాస్తిని విక్రయించి గానీ, బంగారం అమ్మి గానీ వాటిని తీర్చేయాలి. భూమి ధర రెట్టింపు కావడానికి ఐదారేండ్లు పడుతుంది. పదేండ్లు దాటినా బంగారం ధర రెండింతలు కాదు. అదే సమయంలో వడ్డీతో లెక్కిస్తే మూడేండ్లలో అప్పు రెట్టింపు అవుతుంది. ఈ నేపథ్యంలో స్థిరాస్తి, బంగారం అమ్మి అప్పు తీర్చడం మంచిపద్ధతి.
➤ ఆస్తులు అమ్ముకుంటే పరువు పోతుందని వెనుకడుగు వేస్తే.. నాలుగేండ్ల తర్వాత అదే ఆస్తి అమ్మినా రుణాలు పూర్తిగా తీరుతాయన్న గ్యారెంటీ ఉండదు.
➤ ఇంటి రుణంపై టాప్అప్ లోన్ తీసుకుని అప్పులు తీర్చేయొచ్చు. రూ.లక్షకు రమారమి రూ.వెయ్యి వరకు ఈఎమ్ఐ ఉంటుంది కాబట్టి, పెద్దగా భారం అనిపించదు.
➤ రుణాలన్నీ జాబితాగా రాసుకొని.. అధిక వడ్డీ ఉన్నవి మొదట తీర్చాలి. రుణదాతలతో మీ పరిస్థితి వివరించి.. వాయిదాల పద్ధతిలో అప్పు చెల్లించే ప్రయత్నం చేయాలి.
➤ అన్నిటికీ మించి అప్పుల ఒత్తిళ్లు ఆరోగ్యంపై పడకుండా ధైర్యంగా ఉండాలి. అప్పు ఎగ్గొట్టే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకూడదు.
➤ అదనపు రాబడి మార్గాలపై దృష్టి సారించడం చాలా అవసరం. అది సాధ్యం కానప్పుడు ఖర్చుల నియంత్రణ తప్పనిసరి.
– ఎం. రాం ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in, www.rpwealth.in
“Want to Buy A Car | ఈ కారణాలతో కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇంకోసారి ఆలోచించండి”