Pen Kalamkari | కలంకారీ దుస్తులు మనకు సుపరిచితమే. ఆర్గానిక్ రంగులు అద్దుకుని అందరి వార్డ్రోబ్లలోనూ దర్శనమిస్తాయి. వాల్ హ్యాంగింగ్స్లానూ ఆస్వాదిస్తారు హస్తకళా ప్రియులు. గతంలో ఆడవాళ్లకే పరిమితమైనా.. ఇప్పుడు పురుషుల కోసమూ లభిస్తున్నాయి. అందులోనూ పెన్ కలంకారీ డిజైన్లు ఫ్యాషన్ ప్రపంచంలో లేటెస్ట్, హాటెస్ట్ ట్రెండ్.
కలంకారీ.. అనగానే గోధుమ వన్నె మీద ఎరుపు, పసుపు వర్ణాల్లో కొలువుదీరిన బొమ్మలూ, తీగలూ, పువ్వులూ గుర్తొస్తాయి. చూడగానే ఇది కలంకారీ అని గుర్తుపట్టేంత ప్రత్యేకంగా ఉంటాయా డిజైన్లు. అందుకే కలంకారీకి ఎప్పుడూ బలమైన అభిమానుల బృందం ఉంటుంది. అయితే, కాలచక్రం గిర్రున తిరిగి.. పెన్ కలంకారీ దగ్గర ఆగినట్టు.. ఫ్యాషన్ ప్రపంచాన్ని ఇప్పుడీ డిజైన్లే ఏలుతున్నాయి. చీరలు, లంగా ఓణీలు, డ్రెస్సులు, కుర్తాలు, హ్యాండ్ బ్యాగులు, దుపట్టాలు, వాల్ హ్యాంగింగ్లు.. అన్నింటా ఈ అచ్చులే కనిపిస్తున్నాయి.
నిజానికి, కలంకారీ అంటే బట్టల మీద అచ్చంగా చేతి అద్దకమే. అయితే, ఈ అద్దకాల్లోనూ రెండు రకాలు. మచిలీపట్నం తరహాలో చెక్క అచ్చుల ఆధారంగా బ్లాక్ ప్రింటింగ్ చేసి, దాని మీద రంగులు అద్దుతారు. మరొకటి శ్రీకాళహస్తి రకం. ఇందులో బాగా కాల్చి చల్లార్చిన చింతపుల్ల సాయంతో తెలుపు వస్త్రం మీద నేరుగా చేత్తోనే డిజైన్లు గీస్తారు. దానిమీద వెదురు పెన్నుతో రంగుల్ని అద్దుతారు.
పెన్ కలంకారీ అంటే ఇదే. ఈ రకం డిజైన్లే మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి.
నిజమైన కలంకారీలో ఆర్గానిక్ రంగుల్నే వాడతారు. ముందుగా బట్టను పాలు, కరక్కాయ మిశ్రమంలో ముంచి తీస్తారు. కాబట్టి వస్త్రం పాల వాసన వస్తుంటుంది. చేత్తో వేస్తారు కనుక అక్కడక్కడా డిజైన్లలో లోపాలుంటాయి. ఈ రహస్యాలు లుసుకుంటే మనం కూడా ఒరిజినల్ కలంకారీ కొనుక్కోవచ్చు. నచ్చితే.. కళ అయినది.. కలంకారిది… అని పాడుకోవచ్చు… కావాలనుకున్న డ్రెస్సు వేసుకోవచ్చు!
Silver Purse | వెండి పర్సు వారెవ్వా..!”