పోలీస్ స్టేషన్ కోలాహలంగా ఉంది. చాలారోజుల తర్వాత ఇన్స్పెక్టర్ రుద్ర ముఖంలో నవ్వులు వికసించాయి. ఓ చిన్నారి ఇచ్చిన మిఠాయిని ఆప్యాయంగా తీసుకున్నాడు. మరో బుడతడి చేతిలో జాతీయ పతాకం. పోలీసు డ్రెస్‌లో వచ్చిన ఆ కుర్రాడికి రుద్ర సెల్యూట్ చేశాడు. ‘పెద్దయ్యాక ఏమవుతావ్..’ అని అడిగాడు. పోలీస్ అన్నాడు ఆ చిరుత. ‘తప్పకుండా అవుతావులే! మీ నాన్న కానిస్టేబుల్ అయితే… నువ్వు ఐపీఎస్ అవ్వాలి. పదండి జెండా వందనం చేద్దాం’ అని పిల్లలను స్టేషన్ ప్రాంగణంలోకి తీసుకెళ్లాడు.
స్టేషన్లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎప్పుడూ కేసులతో బిజీగా ఉండే ఇన్స్పెక్టర్ రుద్ర.. తమతో కులాసాగా మాట్లాడటం స్టేషన్ సిబ్బందికి ఎంతో ఆనందాన్నిచ్చింది. రుద్ర టీ తాగుతూ మొబైల్ ఫోన్లో ఏదో మాట్లాడుతున్నాడు. ఇంతలో ల్యాండ్‌లైన్‌కు ఓ ఫోన్ వచ్చింది. స్టేషన్ సమీపంలోనే ఒక పెద్ద బంగ్లాలో యజమాని హత్య జరిగినట్టు తెలిసింది. ‘401.. బయల్దేరు’ అని మెరుపువేగంతో కదిలాడు రుద్ర. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా రుద్రతో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు.
స్టేషన్ దగ్గర్లో అంత పెద్ద బంగ్లా ఉన్నట్టు రుద్ర ఎప్పుడూ గమనించలేదు. కారు దిగడంతోనే.. అక్కడ గుమిగూడిన జనాన్ని దూరం పంపండి అని హుకుం ఇచ్చాడు ఇన్స్పెక్టర్. ఆయన వాయిస్‌లో బేస్ చూసి.. కానిస్టేబుళ్లు కల్పించుకోకుండానే ప్రజలు నాలుగు అడుగులు వెనక్కి వేశారు. ఇంట్లోకి దారితీశాడు రుద్ర. అది పాలరాతి భవనం. లోపలంతా జర్మన్ టేక్ ఫర్నిచర్.. పై అంతస్తులో ఈతకొలను. అంత పెద్ద భవనంలో ఒక గదిలో ఓ మనిషి చలనం లేకుండా పడి ఉన్నాడు. యజమాని భార్య దూరంగా సోఫాలో కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నది. ఆమెను ఒకరిద్దరు ఓదారుస్తున్నారు. మృతదేహాన్ని పరీక్షించాడు రుద్ర. ఉదయం పది నుంచి పదకొండు గంటల మధ్య హత్య జరిగిందని అనుమానించాడు. ఘటనా స్థలి పరిసరాలు పరిశీలిస్తూ. ప్రాథమిక విచారణ మొదలుపెట్టాడు.
యజమాని భార్యను సమీపించాడు రుద్ర. ‘పోలీసులకు మీరే ఫోన్ చేశారా?’ అని ఆమెను ప్రశ్నించాడు. ‘లేదు! మా పనమ్మాయి చేసింది’ అంది. అసలేం జరిగిందో చెప్పండి అన్నాడు రుద్ర. ‘నేను ఉదయాన్నే సంతోషిమాత గుడికి వెళ్లాను. అక్కడినుంచి గంటలో తిరిగొచ్చాను. గదిలోకి రాగానే.. ఎదురుగా ఆయన అలా..’ అని బోరుమంది. ‘ఊరుకోండి..’ అని ఆమెను అనునయిస్తూ.. పనమ్మాయి వంక చూశాడు. ‘నేనూ అమ్మగారితో గుడికెళ్లాను బాబు’ అని రుద్ర ఏ ప్రశ్నా అడక్కముందే బెరుగ్గా జవాబిచ్చింది పనమ్మాయి. గదిలో మరోవైపు నిలబడిన వాళ్లను చూస్తూ.. ‘వాళ్లెవరు?’ అన్నాడు. ‘వాళ్లా అండీ! వీళ్లద్దరేమో పనివాళ్లండి! తనేమో డ్రైవర్ అండి!’ అని చెప్పింది.
ఒక పనివాణ్ని ‘పొద్దుట్నుంచీ ఇంట్లోనే ఉన్నావా?’ అని గద్దించినట్టు అడిగాడు రుద్ర. ‘లేదు సార్! పొద్దున తొమ్మిది గంటలకు కూరగాయలు తెద్దామని మార్కెట్‌కు వెళ్లాను. నేను వచ్చేసరికి ఇంటి చుట్టూ జనం ఉన్నారు’ అన్నాడు. మరోపనివాడు ‘ప్లంబర్‌ను పిలిపించి పైన వాటర్‌ట్యాంక్ దగ్గర పనులు చేయిస్తున్నా’ అన్నాడు. వీరిద్దరి పక్కనే ఉన్న డ్రైవర్ వంక చూసి.. ‘నీ సంగతేంటి?’ అని అడిగాడు. ‘అమ్మగారిని కారులో గుడి దగ్గర దింపానండి! మళ్లీ ఇంటికి తీసుకొచ్చాను’ అన్నాడు. ‘నువ్వూ గుడిలోకి వెళ్లావా!’ అన్నాడు. ‘లేదండి! బాబుగారు బ్యాంకులో వెయ్యమని చెక్ ఇచ్చారు. వేశాక.. అమ్మగారిని పికప్ చేసుకున్నాను’ అన్నాడు.
సెక్యూరిటీ రూమ్‌కు వెళ్లిన రుద్రకు అక్కడ సీసీటీవీలు పనిచేయని విషయం అర్థమైంది. ఇదే విషయమై వాచ్‌మెన్‌ని ప్రశ్నించగా.. సీసీటీవీలు రెండ్రోజుల నుంచి పనిచేయట్లేదని, రిపేర్ కోసం కంప్లయింట్ ఇస్తే, ఓ వ్యక్తి గేటు వరకు వచ్చి.. మళ్లీ వస్తానని వెనక్కి వెళ్లిపోయినట్టు చెప్పాడు. అతడు మినహా ఉదయం నుంచి కొత్త వ్యక్తులెవరూ లోపలి రాలేదని, పొద్దున్నుంచి గేటు దగ్గరే ఉండటం వల్ల అయ్యగారు చనిపోయే విషయం ట్యాంక్ రిపేర్ చేయిస్తున్న అతను (రెండో పనిమనిషి) వచ్చి చెప్పేవరకు తనకు తెలియదని వాచ్మెన్ అన్నాడు. దీంతో ‘కొత్త వ్యక్తి గేట్ వరకు వచ్చాడా? లోపలివరకు వచ్చాడా?’ అని వాచ్‌మెన్‌ను అడిగాడు రుద్ర. కొంత తడబడ్డ వాచ్మెన్.. ‘గేట్ వరకే!’ అన్నాడు.
సీరియస్‌గా క్లూ కోసం వెతుకుతున్న రుద్రకు.. ఏవో గుసగుసలు వినిపించాయి. వెనక్కి తిరిగితే.. కానిస్టేబుళ్లు ఇద్దరూ చెవులు కొరుక్కోవడం కనిపించింది. ‘కేసు మీద సీరియస్‌గా దృష్టి పెట్టడం మానేసి.. ఏంటా గుసగుసలు..’ అని ఫైర్ అయ్యాడు. ‘సారీ సార్! మా పిల్లాడు, అమ్మాయి.. స్టేషన్లోనే ఉన్నారు కదా! వెళ్లమంటారా?’ అని నీళ్లు నమిలాడు కానిస్టేబుల్. రుద్ర ముఖం మరింత ఎర్రబారింది.. ఆయన కోపాన్ని చూసి వాచ్మెన్ గజగజ వణికిపోయాడు. అంతలోనే చిన్నగా నవ్వి.. కూల్ అయ్యాడు రుద్ర. ‘నువ్వెందుకు వణికిపోతావోయ్! అసలు హంతకుడు దొరికేశాడు! నువ్వు సేఫ్..’ అన్నాడు వాచ్‌మెన్‌తో! అక్కడున్న వాళ్లకేం అర్థం కాలేదు. ‘కానిస్టేబుల్స్ ఆ డ్రైవర్‌ను పట్టుకోండి. అతనే మర్డరర్’ అన్నాడు. పారిపోబోయిన డ్రైవర్ వీపు విమానం మోత మోగించాడు రుద్ర. విచారణలో తానే యజమానిని హత్య చేసినట్టు డ్రైవర్ ఒప్పుకొన్నాడు. ఇంతకీ డ్రైవరే హత్య చేశాడని రుద్ర ఎలా కనిపెట్టగలిగాడు?
రుద్ర డ్రైవర్ని విచారించగా “అమ్మగారిని ఉదయాన్నే గుడిలో దించేసి, అటునుంచి అటే అయ్యగారు ఇచ్చిన చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేశా” అని సమాధానం చెప్పాడు. ఆ రోజు పంద్రాగస్టు. బ్యాంకులకు సెలవు. అలాంటప్పుడు డ్రైవర్ బ్యాంకులో చెక్కును ఎలా డిపాజిట్ చేయగలడు? కానిస్టేబుల్ భార్యాపిల్లలు స్టేషన్లోనే ఉన్నారు అనగానే.. ఆ రోజు పంద్రాగస్టు అన్న పాయింటు రుద్రకు స్ఫురణకు వచ్చింది. అసలు విషయం ఏంటంటే.. రూ. 2 లక్షలు అప్పుగా ఇవ్వమంటే తనను నానా మాటలు తిట్టిన యజమానిపై కోపంతోనే ఈ పనిచేసినట్టు డ్రైవర్ విచారణలో చెప్పాడు.
…? రాజశేఖర్ కడవేర్గు