జరిగిన కథ : తల్లి నిర్ణయంతో హతాశుడవుతాడు జయసేనుడు. విరహంతో బాధపడుతున్న రోహా దేవిని చెల్లెలు సీహా దేవి వనవిహారానికి తెస్తుంది. వెనుదిరిగి వస్తుంటే.. పాడుబడిన బావిలో నుండి మనిషి మూలుగు వినిపిస్తుంది వాళ్లకు. తర్వాత…
కోరికల వలలో చిక్కుకున్న వాని నట్టి కోర్కెలు వెంటాడి యాహరించు ననవసరపు పనుల యందు తనను తాను మనిషి పోగొట్టుకొనుచుండు మాయ కతన (కోరికల వలలో చిక్కుకున్న వాడిని ఆ కోరికలే వెంటాడి నశింపజేస్తాయి. మనిషి మాయలో చిక్కి, అనవసరపు పనులను చేస్తూ, తన ఉనికిని తానే పోగొట్టుకొంటుంటాడు)అది ఒక అంధకూపం. లోపల మనిషి మూలుగు స్పష్టంగా వినిపిస్తున్నది. మరొక సందర్భంలో అయితే సీహా దేవి ఏదో ఒక ఉపాయం చేసి ఆ మనిషిని బయటికి తీసేదే! కానీ, ఇప్పుడున్న పరిస్థితి వేరు. తాము తమ రాజ్యపు సరిహద్దులకు ఈవల ఉన్నారు. రథం, రథసారథి ఎక్కడ ఉన్నారో వెతుక్కోవాలి. ఇంకొక గడియ గడిస్తే పొద్దుగూకేటట్లు అనిపిస్తున్నది.
వీళ్లు ఇట్లా అయోమయంగా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుండగానే.. దూరాన ఇద్దరు మనుషులు కనిపించినారు. చేతులు ఊపుతూ వాళ్లను దగ్గరికి రమ్మని కేకలు వేసినారు రోహా, సీహా. కొంచెం ప్రయత్నం చేయగానే వాళ్లు గమనించి పరుగెత్తుకొని వచ్చినారు. అందులో ఒకడు తమ రథసారథి కహిలుడు. ఇంకొకరు బౌద్ధ సన్యాసి. తథాగతునికి శరణు పలికినారు ఇద్దరూ.
“అమ్మా! మీరు ఇక్కడ ఉన్నారా? మీ కొరకు వనమంతా వెతుకుతున్నాను. పదండి తల్లీ! తొందరగా వెళదాం. ఇది మన రాజ్యం కూడా కాదు. మీరు మన పొలిమేరలు దాటి వచ్చినారు. పొద్దు గూకేలోపు మనం ఇక్కడినుండి వెళ్లవలసినది” అన్నాడు కహిలుడు.
“అది సరేగానీ, ఈ పాడుబడిన బావిలో ఎవరో పాంథుడు పడిపోయినట్లు ఉన్నాడు కహిలా! అతన్ని కాపాడటం మన విధి. ముందు ఆ పని చూడండి” అన్నది రోహ.
“అమ్మా! మనకు అంత సమయం లేదు..” అని ఇంకా ఏదో చెప్పబోయినాడు కహిలుడు.
“తల్లులారా! మీది మెత్తని మనసు. ఆపదలో ఉన్న సాటి మనిషిని ఆదుకోవడం మానవ ధర్మం. బుద్ధ దేవుడు సెలవిచ్చిన సంఘం శరణం గచ్చామి పరమార్థం ఇదే. సారథి శ్రేష్ఠా! మనం ఇద్దరమూ పూనుకుంటే ఎక్కువ సమయం పట్టదు” అన్నాడు సన్యాసి.
“మేము కూడా సహకరిస్తాం. త్వరపడండి!” ఉత్సాహంగా అన్నది సీహ. కహిలుడు వాదించి మరికొంత సమయం వృథా చేయదలచుకోలేదు. ఆ బౌద్ధ సన్యాసికి అభివాదం చేసి, చేరువలోనున్న ఒక పెద్ద చెట్టు తీగను ఖడ్గంతో నరికి తీసుకొని వచ్చినాడు. దానిని బావిలోకి వదిలి..
“పాంథ కిశోరా! బయటికి రా! నీకేం భయంలేదు. ఇదిగో ఈ తీగను పట్టుకొని పైకి ఎగబాకు” లోనికి తొంగి చూస్తూ, బిగ్గరగా అరిచినాడు. లోపలి నుండి సమాధానం లేదు కానీ మనిషి మూలుగు శబ్దం అధికమైంది. అతడేదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తున్నది కానీ మాట స్పష్టంగా వినిపించడం లేదు. కహిలుడికి విసుగు, అసహనం అధికం అవుతున్నాయి. ‘ఈ సన్యాసి ఎవడో చివరకు నా వృత్తికి ఎసరు పెట్టేటట్లు ఉన్నాడు’ అనుకుంటూ అతని వంక చురచురా చూసినాడు. ఆ సన్యాసి పేరు మాధవుడు. చెరగని చిరునవ్వుతో కహిలుని చూసి..
“నాయనా! కొంచెం ఓపిక వహించు. ఈ కూపములోనికి దిగి, ఆ అభాగ్యుని నేను పైకి తెస్తాను” అన్నాడు.
కహిలుడు ఏదో అనబోయే లోపు… “మంచి ఉపాయం స్వామీ! తమరు ఆ పని చేస్తే, మేము ముగ్గురమూ ఈ తాడు పట్టుకుంటాము” అన్నది రోహ.
అందుకు కహిలుడు.. “అట్లయితే మీరు ఇతణ్ని లోపలికి వెళ్లనీయండి. ఈ లోపున నేను రథము తీసుకొని వస్తాను” అని ఆ తీగను మెరుపు తీగలిద్దరికీ ఇచ్చి, రథం కోసం పరుగెత్తినాడు.
ఆ సోదరీమణులు తీగను పట్టుకోగా, మాధవుడు దాని ఆధారంగా నూతిలోనికి దిగినాడు.
అక్కడ పోదన నగరంలో… మల్లికాపురం వెళ్లనవసరం లేదని తల్లి చెప్పడం విని మిత్రుడు పడుతున్న అవస్థ చూసి.. ‘ఏదో ఒకటి చేయాలి ’ అనుకొన్న వామదేవుడు.
“అది కాదు చిన్నమ్మా! నీవు తననే పంపిస్తావని అనుకొని, జయసేనుడు అందుకు సంసిద్ధమవుతున్నాడు” అనేసినాడు. “పిచ్చివాడు!” వామదేవుని మాటలను తేలికగా తీసుకొని, కొడుకును ముద్దుగా మందలిస్తూ, తన ఆంతరిక మందిరం వైపు సాగిపోయింది సిరిసత్తి.
“మిత్రమా! ఇదేమి విపత్కరం? నేను ముందుగా నా అందాల దయిత (భార్య)ను చూడాలని అనుకున్నాను కదా! ఆరోజు పరస్త్రీ అనుకుని చూడటానికి జంకి, సరిగ్గా చూడలేదు. తను నా భార్య అని తెలిసిన క్షణం నుంచి మనసు మనసులో లేదు. ఇప్పుడు తానే వెళ్తానంటున్నది అమ్మ. నన్ను వెంట తీసుకొని వెళ్లనని చెప్పకనే చెప్పింది. నేటికి నాలుగవ రోజున ఆమె వెళ్లి, ఐదవ రోజున అక్కడ ఉండి, ఆరవ రోజు ఇక్కడికి తీసుకొస్తే….ప్! కష్టం!!! అన్ని రోజులు నా రోహను నేను చూడకుండా ఉండలేను” తీవ్రంగా తల విదిలించినాడు జయసేనుడు.
ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. “కొంచెం ప్రమాదకరం! అయినా నువ్వు సిద్ధమైతే ఒక ఉపాయం ఉన్నది” చివరకు అన్నాడు వామదేవుడు. “నా ప్రియ భామిని కోసం ఎంత ప్రమాదమైనా ఎదుర్కొనడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అన్నాడు జయసేనుడు. వామదేవుడు తన ఆలోచనను జయసేనునికి తెలియజేసినాడు. అది విని ఉబ్బితబిబ్బైనాడు జయసేనుడు.
అలసుద్ది… నీలమేఘ ఛాయలో మెరిసిపోయే పదారేండ్ల పిల్ల. మౌనంగా తన పని తాను చేసుకుని పోయే ముగ్ధ. నోరు తెరిచిందా.. ముత్యాల వంటి మాటలతో ఆకట్టుకునే జాణ. అవసరమైతే నలుగురిని అవలీలగా ఎదుర్కొని, మట్టికరిపించగల సాహసి. దాని నడక కరి. నవ్వు వెన్నెల సిరి. దొరసాని పిలుపునందుకొని వినమ్రంగా నిలుచున్నది.
అలసుద్దిని ఆపాద మస్తకం చూస్తూ.. “ఏందే సుద్దీ! మీ అయ్య నీ మనువు కోసం ఏమన్నా యత్నాలు చేస్తున్నాడా ?” అంది సిరిసత్తి. ఆ ప్రశ్నలో ఒక ఆత్మీయత, ఒకింత వాత్సల్యం కలగలిసి ఉన్నాయి. అలసుద్ది మాట్లాడలేదు. సిగ్గుతో తలవంచుకొని నేలమీద పిచ్చి గీతలు గీస్తున్నది.. బొటనవేలుతో.
“అంతఃపురంలో పని మానేస్తావా?” అడిగింది సిరిసత్తి. వెంటనే అడ్డంగా తల ఊపింది అలసుద్ది.
“నా దగ్గర మానేస్తావా?” మరో ప్రశ్న సంధించింది మరింత వేగంగా యజమాని. కాదన్నట్లు తల అడ్డంగా తిప్పింది సుద్ది. “కానీ, మానేయాలి!” ఆజ్ఞాపించినట్లు అన్నది సిరి.
‘ఎందుకు?’ అన్నట్లు గుడ్లు వెళ్లబెట్టింది అలసుద్ది. “భయపడకు! ఇకపై నీవు పూర్తిగా చిన్నమ్మ గారి సేవలో కాలం గడుపవలసి ఉంటుంది” నవ్వుతూ అన్నది సిరిసత్తి. అలసుద్ది మొఖం విచ్చుకున్నది. అంతలోనే చిన్నరాణి ఎవరన్న ప్రశ్న ఉదయించింది మనసులో. అయినా అడుగ లేదు. అడగకుండానే అమ్మగారు చెబుతారని దానికి తెలుసు.
“ఎవ్వరని అడగవేందే మూగనోమూ… నేనే చెప్తానని తెలుసు. మాట వెచ్చించదు, గడుసు పిండం! సరే.. నాకు తప్పదు కదా! చిన్నరాణి అంటే ఎవరనుకున్నావు? మా జయ భార్య. ఎల్లుండే వెళ్లి తీసుకొని రావాలి! నువ్వు వస్తావా?”. “అట్లనే అమ్మ!” అని సంతోషం పట్టలేక నోరువిప్పింది అలసుద్ది. వచ్చిన పని అయిపోయినట్లు అక్కడినుండి కదలబోయింది.
“ఆగు!” అంటూ అలసుద్దిని ఆపి.. “ఎల్లుండి అంటే ఎల్లుండి కాదు, మూడు రోజుల తర్వాత” అన్నది సిరిసత్తి.
నడకలో వేగం తగ్గించి.. యజమాని చెప్పిన మాట వింటున్నది అలసుద్ది. “నీవు వెళ్లి ఆ కువిందుని పంపించు”
పక్క గదిలోనే పని చేస్తున్న కువిందుడు ఆ మాటలు విని అమ్మ గారి ముందుకు వచ్చి నిలబడ్డాడు.
“కువిందూ! రేపు నీవు మల్లికాపురికి పోవాల్సింది” అన్నది ఆజ్ఞాపిస్తున్నట్లు సిరిసత్తి. “ఆజ్ఞ తల్లీ!” అన్నాడు తలవంచుకొని కువిందుడు. “మల్లికాపురిలో ఎవరుంటారో నీకు తెలుసు కదా?”
“తెలుసునమ్మా! మన జయసేనుల వారి అత్తగారు ఉంటారు” అన్నాడు తడుముకోకుండా.
యాభయ్యేళ్ల నమ్మిన బంటు కువిందుడు. చిన్న రాజా వారు (జయసేనుడు) అతని చేతుల్లోనే పెరిగినాడు. 30 ఏళ్లకు పైగా ఆ కుటుంబానికి సేవలందిస్తున్న కువిందుడు ఆ ఇంట్లో అందరికీ ఇష్టమైన వాడు. అతనంటే అందరికీ గౌరవం, అభిమానం కూడా. ఇంతకుముందు కుసుమ శ్రేష్ఠికి తోడూ నీడగా ఉండేవాడు కువిందుడు. వయసు మించుతున్నదని అతన్ని ఇంటికి పరిమితం చేసి, కుమారిలుడు అనే మరొక యువ సేవకుణ్ని ఏర్పాటు చేసుకున్నాడు శ్రేష్ఠి, కానీ, కువిందుడు దుర్బలుడు కాదు. మరో అరవై ఏళ్లు హాయిగా సేవలందించగల దృఢకాయుడు.
“మల్లికాపురికి వెళ్లి రావడానికి నీకు ఎంత కాలం పడుతుంది?” సూటిగా అడిగింది సిరిసత్తి.
“ఒక రోజులో పోయి రాగాలను తల్లీ! తెల్లవారుజామున బయలుదేరితే, మధ్యాహ్నానికల్లా వచ్చేయగలను” అన్నాడు వినయం కలగలిసిన ఆత్మవిశ్వాసంతో కువిందుడు. వాని పనితనానికి లోలోన మురిసి పోతూనే.. “అంత తొందరేం లేదు కువిందూ! రేపు ఉదయమే భోజనం చేసి బయలుదేరు. రాత్రికి అక్కడ ఉండి, మరుసటి రోజు ఉదయం అక్కడి నుండి తిరుగు ప్రయాణం అయితే సరిపోతుంది. మా కోడలిని కాపురానికి తెచ్చుకొనడానికి మేము పంచమినాడు అక్కడికి చేరుకోనున్నామని చెప్పు! అంతే నీవు చేయవలసింది” అన్నది సిరిసత్తి.
అమ్మ ఆజ్ఞ ప్రకారమే మరుసటి రోజు ఉదయమే బయలుదేరినాడు కువిందుడు. శ్రేష్ఠి గారి అశ్వశాలలో అన్నీ మేలుజాతి గుర్రాలే. అందులో తాను తరచూ ఉపయోగించుకునే ముదురు గోధుమ వన్నెగల గుర్రాన్ని ఎంపిక చేసుకుని బయలుదేరినాడు. గుర్రం ఊరి పొలిమేరలు దాటి, వేగమందుకున్నది. మరికొన్ని నిమిషాల్లో అది నాలుగు కాళ్ల మీద పరుగు అందుకోబోతుందనగా… మెరుపు వేగంతో ఎదురైన తెల్ల గుర్రం మీది యువకుడు ఒకడు పక్కనుండి తోసుకొని పోతూ.. కువిందుడి మొఖం మీద ఒక్క ముష్టి ఘాతాన్ని ఇచ్చినాడు. ఆ దెబ్బకు అల్లంత దూరాన పడిపోయినాడు కువిందుడు.
జరిగింది వేగంగా ఆలోచించుకుంటూ హఠాత్తుగా లేచి, ఎదుటివాని గుర్రం మీదికి లంఘించాలి అనుకుంటుండగానే.. మరొకడు కువిందుని మీద విరుచుకుపడ్డాడు. కువిందుడు తేరుకునేలోపే మొదటివాడు మళ్లీ దాడి చేసినాడు. ఇట్లా ఇద్దరూ దెబ్బమీద దెబ్బ వేస్తూ ఉండగా.. తట్టుకోలేని కువిందుడు స్పృహ కోల్పోయినాడు.
(సశేషం)
– దోరవేటి
89788 71961