new year decisions | కొత్త సంవత్సరం వచ్చేసిందనో, కొత్త డైరీ చేతిలో పడిందనో.. ఎడాపెడా కొత్త తీర్మానాల చిట్టా రాసేయకండి. రాసినా ఆలోచించి రాయండి. ఒక్కసారి డైరీకి ఎక్కితే.. మీకు మీరు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. కరోనా ప్రభావం ఏదో ఓ రూపంలో వెంటాడుతున్న సమయం కాబట్టి, ఒకటికి పదిసార్లు ఆలోచించి తీర్మానాలు తీసుకోవాలి.
ఓ నెలరోజులు పొట్టను పస్తులు పెడితే ఎంతోకొంత బరువు తగ్గిపోతారు. అప్పటికప్పుడు మిత్రుల అభినందనలూ అందుతాయి. కానీ, అది మంచి పద్ధతి కాదు. దీనివల్ల శరీరానికి మీ మీద అపనమ్మకం పెరిగిపోతుంది. ఉద్దేశపూర్వకంగానే ఆకలిని పెంచేసి, అదనపు కొవ్వును నిల్వచేసుకుంటుంది. దీంతో మళ్లీ బరువెక్కిపోతారు. మంచి ఆహారం, సరైన వ్యాయామం, సరైన జీవనశైలితో బరువు తగ్గడమే ఆరోగ్యకరం.
ఆత్మీయులను ఆహ్వానించి, ఆదరంగా స్వాగతించి, కొసరికొసరి వడ్డించడంలో ఉన్న ఆనందమే వేరు! అందులోనూ, ఒకట్రెండు పెండ్లి రోజులు, పుట్టిన రోజులు నిరాడంబరంగానే జరిగిపోయాయి. ఈ ఏడాదైనా ఘనంగా పార్టీ ఇద్దామని అనుకోవడంలో తప్పులేదు. కానీ, ఆ తీర్మానాన్ని కూడా తాత్కాలికంగా పక్కన పెట్టేయండి. 2022ను కూడా ‘నో పార్టీ నామ సంవత్సరం’గానే పరిగణించండి.
పోస్టింగ్‌లు, కామెంట్లు, లైక్‌లు.. అదో వర్చువల్ ప్రపంచం! లైకుల లెక్క తెలుసుకోవడానికి నిద్రలేని రాత్రులు గడిపేవారు, అర్థంలేని కామెంట్లు పెట్టి ఆత్మీయులను దూరం చేసుకున్నవారు ఎంతోమంది. అలా అని సామాజిక మాధ్యమాల్ని కోరికోరి దూరం చేసుకోలేం. మన భావాలు పంచుకోవడానికి, పరిచయాలు పెంచుకోవడానికి ఇప్పటికీ ఇదే తిరుగులేని వేదిక. కాకపోతే, దూకుడు వద్దు. సంస్కారాన్ని వదులుకోవద్దు. అపరిచితులను నమ్మవద్దు. వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దు. ఆ సమాచారం ఆధారంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. సోషల్ మీడియా వ్యసనానికి బానిసైపోవద్దు. ఇంట్లో ఎలుక పడిందని ఇల్లు తగులబెట్టుకోలేం కదా!
ఈ ఏడాది వెజ్ నుంచి నాన్వెజ్కో, నాన్‌వెజ్ నుంచి వెజ్కో పూర్తిగా మారిపోవాలని నిర్ణయించుకున్నారా? ముప్పూటలా మిల్లెట్స్‌తో కడుపునింపుకోవాలని గట్టిగా అనుకుంటున్నారా? వద్దు. ఏ మార్పు అయినా క్రమంగానే జరగాలి. హఠాత్తుగా మీ ఆహారశైలి మారితే శరీరం ఇబ్బంది పడుతుంది. పోషక నిపుణులతో మాట్లాడాకే అంతిమ నిర్ణయం తీసుకోండి. అప్పట్లోగా జీర్ణ వ్యవస్థ కూడా అలవాటు పడుతుంది.
రెండేండ్ల నుంచీ ఇంక్రిమెంట్లు లేవు. బోనస్‌లు పడలేదు. ప్రమోషన్ల సంగతి దేవుడెరుగు. ‘అకటా! ఎంత దయలేనివారు ఈ పెట్టుబడిదారులు!’ అంటూ పుష్పవిలాపం స్థాయిలో బాధపడిపోకండి. అర్జెంటుగా ఉద్యోగం మారాల్సిందే అన్న శపథం చేసేయకండి. మార్కెట్ ఏమంత పుంజుకోలేదు. దిగ్గజ సంస్థలే గజగజా వణికేస్తున్నాయి. ఇంకొక్క ఏడాది వేచిచూడటం ఉత్తమం. అంతలోపు మీ నైపుణ్యాలను పెంచుకోండి. అయినా, రాజీనామా సిద్ధం చేసుకుంటామంటే మీ ఇష్టం. పోగాలం దాపురించినప్పుడు..
ఖర్చులు తగ్గించుకోవడం, వృథా అరికట్టడం, వ్యయాలకు పగ్గాలు వేయడం.. ఆర్థిక క్రమశిక్షణలో ఓ భాగమే. అలా అని గుడ్డెద్దు చేనులో పడ్డట్టు.. అన్ని ఖర్చులకూ కోతలు పెట్టడమూ సరికాదు. ప్రీమియం పెరిగినా సరే, ఆరోగ్య బీమా కొనసాగించండి. ధరలు ఆకాశాన్ని అంటుతున్నా కూడా, కూరగాయల బడ్జెట్ తగ్గించకండి. వీలైతే ఇంకొంత పెంచండి. ఫీజుల విషయంలో రాజీపడిపోయి పిల్లల్ని ప్రమాణాలు లేని విద్యాసంస్థల్లో చేర్పించకండి. ఇల్లు కొనుగోలు, స్టాక్‌మార్కెట్ పెట్టుబడులు మొదలైన.. ఆర్థిక నిర్ణయాల విషయంలోనూ
దుందుడుకు తీర్మానాలు వద్దు.
షరా: ఈ వ్యాసం కొత్త సంవత్సర తీర్మానాలను కచ్చితంగా అమలు చేసేవారికి మాత్రమే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఈ కొత్త ఏడాదిలో మహిళలు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి
debut Heroines 2021 | తెలుగు ఇండస్ట్రీపై మెరిసిన కొత్త తారలు వీళ్లే..
Price Shock |2022లో సామాన్యుడికి షాక్.. వంట నూనె మొదలు కార్ల వరకూ అన్నింటి ధరలమోతే?!
Omicron on Gold | కొత్త సంవత్సరం షాకివ్వబోతున్న బంగారం ధరలు.. కారణమిదేనా !
GST Hike | జీఎస్టీ వాత మోత.. ఇవి కొంటే కండ్లు బైర్లు కమ్మాల్సిందే.. న్యూఇయర్‌లో పెరిగేవి ఇవే !
2021లో మహిళల కోసం జిందగీ అందించిన ప్రత్యేక కథనాలు మీకోసం..