మా ఇంట్లో ఎవరం కూడా శోకరసాన్ని ఎక్కువసేపు పోషించేవాళ్లం కాదు. నాయనమ్మ (ఉంకోమ్మ) చనిపోయాక మొదటి నాలుగైదు రోజులు అందరూ రావడం, మా అత్తయ్యలు, చిన్న నానమ్మ ఏడవడం ఉండేది. ఆ తర్వాత మామూలైపోయింది.
మా కుటుంబసభ్యులే ఓ యాభై మంది దాకా ఉండేవారు. అమ్మతోపాటు చిన్నమ్మలు, అత్తయ్యలు అందరూ కబుర్లు చెప్పుకొంటూ పనులు చేసుకునేవారు. ఇక మా ఈడు పిల్లలం ఆటలే ఆటలు! ఎవరైనా వచ్చి చూస్తే.. ఓ మనిషి చనిపోయిన ఇల్లులా ఉండేది కాదు. అన్నిటికన్నా హైలైట్ ఏమిటంటే.. ఆఖరి రోజు. దూరం చుట్టాలు వెళ్లిపోయిన మర్నాడు అన్నమాట. మా కజిన్స్లో అబ్బాయిందరూ కలిసి మమ్మల్ని కూడా తీసుకుని సినిమాకు వెళ్దామని ప్లాన్ వేశారు. ఇంతమంది టికెట్లకు సరిపడా డబ్బు.. ఎవరి దగ్గరా లేదు. అప్పుడు వాళ్లకు ఒక ఐడియా వచ్చింది. ‘పెద్దవాళ్లందరినీ అడిగితేనో!?’ అనుకున్నారు. అదికూడా ఎవరి పిల్లలు వాళ్ల తల్లిదండ్రులను అడిగితే.. ‘ఛట్! ఎటు పొయ్యేది లేదు. చప్పుడు కాకుండ ఇంట్ల ఉండండి’ అంటారు. అందుకని మామయ్యలనూ, చిన్నాయనలనూ అడుగుదామని నిశ్చయించారు. దానికోసం మార్కెటింగ్ నిపుణులను ఎంపిక చేశారు. అంటే.. వాళ్లు ఎంతటి పిసినారులనైనా, కఠినాత్ములనైనా కరిగించగల వాళ్లన్నమాట. “మామయ్యా.. ప్లీజ్.. ప్లీజ్! సిన్మాకు పైసలియ్యండి. మీకు ఎప్పుడంటే అప్పుడు సిగరెట్లు తెచ్చిస్త! కాళ్లు గుంజినప్పుడు కాళ్లు పిసుకుత!” ఇలా బతిమిలాడారు. వాళ్లు కూడా ముసిముసి నవ్వులు నవ్వుతూ కాసేపు సరదాగా ఏడిపించి.. అప్పుడు డబ్బులు శాంక్షన్ చేశారు.
మొత్తానికి ఇంట్లో అందరి దగ్గరా ‘సినిమా నిధి’ కోసం చందాలు వసూలు చేశారు. ఒక్కొక్కరి దగ్గరా ఐదు రూపాయలకు తక్కువ కాకుండా తీసుకున్నారు. మా నాన్న అందరికంటే ఎక్కువగా ఇరవై రూపాయలిచ్చాడు. మొత్తానికి ఆ సాయంత్రం కజిన్స్ అందరం కలిసి మా ఊర్లో ఉన్న ఒకే ఒక్క థియేటర్.. జయలక్ష్మీ నరసింహ టాకీసులో సినిమాకు వెళ్లాం. ఆరోజు మేము చూసిన సినిమా ‘సంపూర్ణ దక్షిణ దేశ యాత్ర’. ఇది 1974 జులైలో. అప్పటికే కాలేజీలో చదువుతున్న కొందరు అబ్బాయిలకు ఏదైనా రొమాంటిక్ సినిమా అయితే బాగుండునని ఉన్నా.. ఆ సినిమా తప్ప వేరే గత్యంతరం లేక ఊరుకున్నారు. మా ఊర్లో ఉన్నది అదొక్కటే థియేటర్. పైగా ఆ సినిమా కనుకనే చందాలు వసూలు అయ్యాయనేది నిర్వివాదాంశం.
నిజానికి అది భక్తి టూరిజం వారు ప్రమోట్ చేయాల్సిన సినిమా. డబ్బింగ్ చిత్రం. కథానాయిక కానన్ కౌశల్ అని జ్ఞాపకం. రాజకుమారి ‘లల్లిలలా’ అని చెలులతో కలిసి ఆడిపాడుతూ ఉద్యానవనంలో ఓ వీరుణ్ని చూసి ప్రేమలో పడుతుంది. అతడు కూడా డిటోడిటో. రాజుగారు ఏ మాత్రం వీల్లేదని ఆ శూరుడికి ఓ వంద పరీక్షలు పెడతాడు. అతడు అన్ని పరీక్షల్లోనూ అవలీలగా నెగ్గి రాజకుమారిని పెళ్లి చేసుకుంటాడు. నిజానికి అతను కూడా మరో దేశపు రాకుమారుడే. ఇద్దరూ కలిసి సరదాగా అడవుల్లో విహరించడానికి వెళ్లి ఓ డ్యూయెట్ పాడాక, అక్కడ రాజకుమారుడు తను కూడా మరో దేశపు యువరాజునే అని చెప్పబోయేంతలో.. ‘మీ విలువిద్యను చూడగోరుతున్నాను’ అని యువరాణి గోముగా అడుగుతుంది. ఇక వీరశూరుడు ఆగుతాడా?! దూరంగా అలికిడి రాగానే బాణం వేస్తాడు. అది వెళ్లి సినిమా ఫార్ములా ప్రకారం ఓ మునికి తగిలి అతడు ప్రాణాలు విడుస్తాడు. వెంటనే మునిపత్ని కూడా తనువు చాలిస్తుంది. చనిపోయేది పోకుండా.. ‘మా చావుకు కారణమైన నీవు పాముగా మారుతావు’ అంటూ వీరశూరుణ్ని శపిస్తుంది. మామూలుగా అయితే శాపం ఇచ్చినవాళ్లే విమోచనం కూడా చెబుతారు గానీ, ఈ మునిపత్ని స్ట్రిక్ట్‌గా ఉంది ఎందుకో! ఆ పాము రాజకుమార్తె చుట్టూ తిరుగుతూ ఉంటే మహారాజు, మహారాణి దాన్ని పారేయించాలని చూస్తారు. అయినా సరే పాము ఎలాగోలా మళ్లీ యువరాణిని చేరుకుంటూనే ఉంటుంది.
కడివెడు కన్నీళ్లు కారుస్తూ యువరాణి తను పూజించే పార్వతీదేవిని ‘లేవా.. బ్రోవగ రావా?!’ అని హైపిచ్‌లో అడిగాక.. పార్వతి ప్రత్యక్షమై ఒక బుట్ట ఇస్తుంది. ఆ బుట్టలో మొగుణ్ని.. అంటే పామును పెట్టుకుని అన్ని పుణ్యక్షేత్రాలకూ వెళ్లమనీ, ఎక్కడ పాము మనిషిగా మారుతుందో అప్పుడు శాపవిమోచనం అవుతుందనీ చెబుతుంది. ఇక అక్కడినుంచి రాజకుమారి బీదరాలి వేషంలో ఆ పామును బుట్టలో పెట్టుకుని దాన్ని నెత్తిమీద మోస్తూ.. పాటలు పాడుకుంటూ ఎన్నో గుళ్లకు తిరగడం, మరెన్నో ప్రమాదాలకు లోనవడం.. పామో, మారువేషంలో వచ్చే పార్వతీ దేవో రక్షించడం, చివరికి కంచిలో పాము మళ్లీ రాజకుమారుడు అవడం, పార్వతీ దేవి ప్రత్యక్షమై వరాలివ్వడంతో సినిమా ముగుస్తుంది.
‘ఏదో ఒకటి.. సినిమా అయితే చాలు’ అనుకునే మాకు ఈ సినిమా బాగానే అనిపించింది. కానీ, మా బావలకీ, అన్నదమ్ములకీ ఏ మాత్రం నచ్చలేదు. హీరో మొదటి అరగంట, చివరి ఐదు నిముషాలే కనిపించడం వల్లనో ఏమో!.. “మొత్తానికి హీరోకు ఎక్కువ పైసలు ఇయ్యకుండ చిన్న హీరోను పెట్టి మేనేజ్ చేసిన్రు గదరా!” అనుకున్నారు. ఆ మాటలే నాకు అర్థం కాలేదు. ఇంటికి వచ్చాక ఆ రాత్రి పదకొండిటికి అందరం కబుర్లు చెప్పుకొంటూ వేడివేడి అన్నంలో పప్పుచారు కలుపుకొని తింటుంటే.. మజాగా అనిపించింది మాత్రం జ్ఞాపకం.