Money Earning Tips | కొంతమంది తక్కువ పనిచేస్తారు. ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. కొంతమందికి ఎక్కువ డబ్బు ఉంటుంది. తక్కువ పన్ను చెల్లిస్తారు. కొద్దిమందికి డబ్బే అవసరం లేదు. ఇతరుల సొమ్ముతోనే వ్యాపారం చేస్తారు. లాభాలు మాత్రం తమ ఖాతాలో వేసుకుంటారు. కానీ, కొద్దిమందే వ్యాపార రంగంలో రాణిస్తారు. అతి కొద్దిమందే సంపన్నులు అవుతారు. ఆర్థిక స్వాతంత్య్రం కూడా కొందరికే వీలవుతుంది. ఎందుకలా? ఏమిటా రహస్యం? అందరికీ ఆ విద్య పట్టుబడదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆసక్తికరం. డబ్బు గొప్పదనం ఏమిటోగానీ.. ఎంత సంపాదించిన వాళ్లకైనా ‘ఇక చాలు’ అనిపించదు. ఇంకా.. ఇంకా.. ఇంకా.. అన్న ఆశ పరుగులు తీయిస్తూ ఉంటుంది. డబ్బు స్వభావాన్ని అర్థం చేసుకోగలిగితే.. ‘మనీ మ్యాజిక్’ చేయడం పెద్ద కష్టమేం కాదు.
స్కూల్లో మీరు బాగా చదవకపోయినా, లెక్కల్లో రాణించకపోయినా, తెలివితేటలు లేకపోయినా, మంచిపేరు తెచ్చుకోకపోయినా.. ఇవేవీ డబ్బు సంపాదనకు ఆటంకం కాదు. మీరు పేదరికం నుంచి వచ్చినా సరే.. ఇవేమీ లెక్కలోకి తీసుకోవాల్సిన అంశాలు కానే కావు. మీరు అతిగా పట్టించుకున్నప్పుడే వాటికి బలం వస్తుందని తెలుసుకోండి.
పెట్టుబడుల ప్రపంచంలో అంకెలు, పదకోశాలే ప్రాణం. వాటిపై అవగాహన పెంచుకోండి. వాటిని కనుక అర్థం చేసుకోలేకపోతే విదేశీ భాషలా అనిపిస్తాయి. ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, కంపెనీల ఆర్థిక నివేదికల ఆత్మను పట్టుకునేందుకు ప్రయత్నించండి. డబ్బును చూడగలిగేలా మనసుకు శిక్షణ ఇవ్వండి.
వ్యాపార రంగంలోకి ఒక్కసారిగా దూకేయాలనో, లక్షలకు లక్షలు సంపాదించాలనో ఆరాటపడకండి. దీనివల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. ముందు ‘బేబీ స్టెప్స్’తో ప్రారంభించండి. ఓటమి.. విజయంలో ఒక భాగం. తప్పులు చేస్తేనే మీరు నేర్చుకోగలుగుతారు. అలా అని తేరుకోలేనంత పెద్దతప్పులు చేయకండి.
డబ్బు పట్ల భయాలు, సందేహాలు ముందడుగు వేయకుండా మిమ్మల్ని అడ్డుకుంటాయి. మీ వైఖరిలో మార్పు వచ్చినప్పుడే సంపాదనకు కొత్తదారులు దొరుకుతాయి. ‘నన్ను పెట్టుబడి పెట్టమంటారా? అంటే నేను ఉన్నదంతా పోగొట్టుకోవాలని మీ ఉద్దేశమా? వయసు మీద పడిపోయింది, ఇప్పుడు రిస్క్ చేయలేను. అన్ని విషయాలూ తెలుసుకోకుండా రంగంలోకి దిగలేను. నేనంత చురుకైనవాణ్ని కాను. ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు నాకు చచ్చినా అర్థంకావు. ఇంట్లో వాళ్లు ఊరుకోరు. వ్యాపారం చేయడానికి నా దగ్గర డబ్బే లేదు’.. ఇలాంటి మాటలు మీ బలహీనతను ప్రతిబింబిస్తాయి. డబ్బు పట్ల సానుకూల వైఖరిని పెంపొందించుకోవడం ఎలాగో ముందు తెలుసుకోండి.
మనం చిన్నప్పటి నుంచీ.. ‘బాగా చదువుకుని మంచి మార్కులు సంపాదించుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. కష్టపడి పనిచేస్తే బాగా డబ్బు సంపాదించవచ్చు. అప్పుడు మంచి ఇల్లు కొనుక్కోవచ్చు. అందుకు కూడా పూర్తిగా డబ్బులు అవసరం లేదు. ఆస్తి తనఖా పెట్టి బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో రుణం తీసుకుంటే, నువ్వు కట్టే రుణంలో వడ్డీని తగ్గించి పన్ను మినహాయింపు సౌకర్యం ఇస్తారు. అలాగే వాయిదాల పద్ధతిలో కార్లు, ఫర్నిచర్ సమకూర్చుకోవచ్చు’ అనే మాట వింటూ ఉంటాం. అంతే తప్ప.. ‘చదువుకుని వ్యాపారంలోకి ప్రవేశించు. తిరుగులేని పెట్టుబడిదారుగా రాణించు’ అని ఎవరూ మనకు సలహా ఇవ్వరు. నూటికి 90 శాతం మందిపై చుట్టుపక్కలవారి మాటలు ప్రభావం చూపుతాయి. దీంతో డిగ్రీ చదువుల ప్రపంచంలోనే వాళ్లు బతికేస్తారు. ముందుగా మంచి ఉద్యోగం సంపాదించుకుని, ఒకటి లేదా రెండు ఇళ్లు కొనుక్కుని, జీవితాంతం బ్యాంకు రుణం వాయిదాలు చెల్లిస్తూ, కుటుంబ బాధ్యతల్లో గడిపేస్తారు. ఉద్యోగ విరమణ తర్వాత బ్యాంకులో దాచుకున్న సొమ్ము లేదా పెన్షన్ వారి జీవనాధారం అవుతుంది. మరి కొందరు ఇందుకు భిన్నంగా ఉంటారు. సంప్రదాయ చదువులకు దూరంగా మసులుతారు. మహామహా వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు తమ విద్యాభ్యాసాన్ని అసంపూర్తిగా ముగించిన వారే. జనరల్ ఎలక్ట్రికల్ వ్యవస్థాపకుడు థామస్ ఎడిసన్, ఫోర్డ్ మోటార్ కంపెనీ అధినేత హెన్రీ ఫోర్డ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, డిస్నీ వ్యవస్థాపకుడు వాల్ట్ డిస్నీ, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బర్గ్.. ఈ కోవలోకి వస్తారు. వీళ్లు డిగ్రీలను కాదనుకున్నారని, వారికి విద్యా వ్యవస్థ పట్ల నమ్మకం లేదనుకుంటే మాత్రం పొరపాటే. సంప్రదాయ చదువు డిగ్రీతో ముగుస్తుంది. వాళ్లు అలా కాదు. చదువు అనేది జీవితాంతం కొనసాగాలని బలంగా నమ్ముతారు. నిరంతర విద్యార్థులుగా బతికేస్తారు. ఈ విశిష్ట లక్షణమే ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తులుగా తీర్చిదిద్దింది. తమ రంగంలో అత్యున్నత స్థాయికి చేర్చింది. వ్యాపారవేత్తలుగా, ఆవిష్కర్తలుగా వాళ్లు తమదైన ముద్ర వేసుకోగలిగారు.
చదువుకున్నవారు డబ్బు సంపాదించలేరని గానీ, డబ్బు సంపాదించాలంటే సంప్రదాయ చదువులకు దూరంగా ఉండాలని గానీ ఎక్కడా లేదు. చదువు భిన్నమైంది. మామూలు చదువులు ఉద్యోగం సంపాదించడానికి లేదా స్వయం ఉపాధికి మాత్రమే ఉపయోగపడతాయి. డబ్బు సంపాదించడానికి అదనంగా మరికొన్ని నైపుణ్యాలు కావాలి. మానసికంగా, ఉద్వేగాలపరంగా కొంత మారాల్సి ఉంటుంది. అవేమిటన్నది తెలియాలంటే.. రాబర్ట్ టి.కియోసాకి ‘క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్’ పుస్తకంలోకి తొంగిచూడాలి. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. డబ్బు లేదా ఆదాయం ఎందులోంచి వస్తుంది? అన్నదాన్ని బట్టి ఏది ఏ విభాగం అన్నది నిర్ణయిస్తారు. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఓ విభాగంలో ఉంటాం. ఫలానా విభాగం గొప్పది అని కానీ, ఫలానా విభాగం చెత్తదని కానీ చెప్పలేం. ఏ విభాగానికి ఆ విభాగం ప్రత్యేకం. ‘అవి రెండు గీతలు, నాలుగు అక్షరాలు కావు. వాటిని నిశితంగా పరిశీలిస్తే, భిన్న ప్రపంచాలు, భిన్న కోణాలు దర్శనమిస్తాయి. ఏవైపున ఉన్నా ఆ ప్రపంచం భిన్నంగా కనిపిస్తుంది’ అంటారు కియోసాకి.
ఇ (ఎంప్లాయీ).. ఒక వ్యక్తి దగ్గర లేదా ఓ కంపెనీలో పనిచేయడం ద్వారా అతనికి ఆదాయం లభిస్తుంది.
ఎస్ (సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేదా స్మాల్ బిజినెస్).. వ్యక్తి గతంగా తాను ఎంచుకున్న స్వయం ఉపాధి మార్గంలో డబ్బు వస్తుంది.
బి (బిగ్ బిజినెస్).. పెద్ద వ్యాపారి తన వ్యాపారం ద్వారా ఆదాయం పొందుతాడు.
ఐ (ఇన్వెస్టర్).. పెట్టుబడిదారు తన పెట్టుబడుల మేరకు సొమ్ము గడిస్తాడు. ఇందులో డబ్బు మరింత డబ్బును సంపాదించడానికి ఉపయోగపడుతుంది.
మనం చేపట్టే పని ఏదైనా కావచ్చు. కొన్నిసార్లు నాలుగు విభాగాల నుంచీ ఆదాయం పొందవచ్చు.
ఉదాహరణకు ఒక వైద్యుడు ఉద్యోగిగా ‘ఇ’ విభాగంలో ఆదాయం పొందుతూ, పెద్ద హాస్పిటల్లో చేరి సేవలు అందించవచ్చు. ప్రభుత్వపరంగా పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంట్‌లోనూ, మిలిటరీ డాక్టర్‌గానో, ఇన్సూరెన్స్ కంపెనీలోనూ పనిచేయవచ్చు. అదే వైద్యుడు ప్రైవేట్ ప్రాక్టీస్ (‘ఎస్’ విభాగం) ప్రారంభించవచ్చు. ఒక క్లినిక్ తెరిచి, ఎంతో కొంతమంది ఉద్యోగులతో దాన్ని నిర్వహించవచ్చు. ఇతర వైద్యులకు ఉపాధి కల్పించవచ్చు. ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు ఒక బిజినెస్ మేనేజర్‌కు బాధ్యత అప్పగించవచ్చు. డాక్టర్‌కు ఇక్కడ సొంత వ్యాపారం ఉంటుంది. కానీ, అందులో తను పనిచేయాల్సిన అవసరం మాత్రం ఉండదు. ఈ రకంగా అతను ఇ, బి విభాగాలు రెండిట్లోనూ ఆదాయం పొందుతాడు. వైద్యునిగా సంపాదించిన మొత్తాన్ని, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, బాండ్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయం గడించవచ్చు. అది ‘ఐ’ విభాగం కిందికి వస్తుంది.
ఎవరెలా వ్యవహరిస్తారు?
1. ‘ఇ’ విభాగం వ్యక్తులు : ఏ వ్యక్తి అయినా భద్రతనిచ్చే ఉద్యోగాన్ని కోరుకుంటాడు. మంచి వేతనం, ఇతరత్రా ప్రయోజనాలు ఆశిస్తాడు. స్థిరత్వాన్ని కోరుకుంటాడు. అనిశ్చితిని అస్సలు తట్టుకోలేడు.
2. ‘ఎస్’ విభాగం వ్యక్తులు : తమకు తామే యజమానులుగా ఉండాలని భావిస్తారు. దీంతో స్వయం ఉపాధిని ఎంచుకుంటారు. డబ్బు విషయంలో నిర్దిష్టంగా ఉంటారు. ‘మేం కష్టపడుతున్నాం.. అందుకు తగ్గ ప్రతిఫలం రావాల్సిందే!’ అని పట్టుదలగా వ్యవహరిస్తారు. విద్యావంతులైన వృత్తి నిపుణులు – డాక్టర్లు, లాయర్లు, సైంటిస్ట్‌లు, రిటైల్ షాపు ఓనర్లు, కన్సల్టెంట్లు, ట్రావెల్ ఏజెంట్లు ఈ కోవలోకి వస్తారు. వీళ్లంతా స్వేచ్ఛను ఆశిస్తారు. నిపుణులుగా సమాజం నుంచి గౌరవాన్ని పొందాలనుకుంటారు. పురస్కారాలు, సన్మానాల కోసం తపించేవారూ లేకపోలేదు.
3. ‘బి’ విభాగం వ్యక్తులు : ‘నా కంటే ఇంకెవరూ బాగా చేయలేరు’ అని బలంగా నమ్ముతారు. ఇతరులకు పని అప్పగించడానికి వెనకడుగు వేయడం ‘ఎస్’ విభాగం వారి స్వభావమైతే, ఆ పని మెరుగ్గా చేయగల వ్యక్తులు దొరికినప్పుడు, నేను చేయడం ఎందుకనేది ‘బి’ విభాగం వారి నైజం.
4. ‘ఐ’ విభాగం వ్యక్తులు : పెట్టుబడిదారులు డబ్బుతో డబ్బు సంపాదిస్తారు. వారు పని చేయాల్సిన అవసరంలేదు. డబ్బే వారి కోసం పనిచేస్తుంది.
బి, ఐ విభాగాల ద్వారా వేగంగా ఆర్థిక స్వేచ్ఛను అందుకోవడం వీలవుతుంది. ‘బి’ విభాగంలో ఇతరులు మీ కోసం పనిచేస్తారు. ‘ఐ’ విభాగంలో ఆ పని వ్యక్తులకు బదులుగా డబ్బు చేస్తుంది. నువ్వు పనిచేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే లేదు. పైగా ఈ విభాగంలో పన్ను రాయితీలు లభిస్తాయి. ఎడమ వైపు ఉన్న ‘ఇ’, ‘ఎస్’ విభాగాల వారు వ్యక్తిగతంగా శ్రమిస్తే తప్ప ఆదాయం రాదు. వారు ఎక్కువ పన్నులు చెల్లించాల్సి వస్తుంది. సహజంగా ఆర్థిక భద్రత కోరుకునేవారు ఎడమవైపున, ఆర్థిక స్వాతంత్య్రాన్ని ఆశించేవారు కుడి
వైపు ఉంటారు. ముందుగా ‘బి’ విభాగంలోకి ప్రవేశించి, దాని ఆనుపానులు తెలుసుకుని, నగదు కదలికలపై అవగాహన పెంచుకుంటే.. మంచి ఇన్వెస్టర్ అవుతారు.
ఉద్యోగ భద్రత అనేది అపోహ మాత్రమే. మారుతున్న ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త విద్య నేర్చుకోవడం తప్పనిసరి. అలాగే స్వయం ఉపాధి పొందేవారికి రిస్క్ ఎక్కువే. దీంతో అన్నివిధాలా బలహీనపడతారు. అనారోగ్యవంతులైనా, గాయాలపాలైనా.. ఆదాయం దెబ్బతింటుంది. విపరీతంగా శ్రమపడుతూ త్వరగా అలిసిపోతారు. అలసట పెరిగిన కొద్దీ వారిలో భద్రతాభావం సన్నగిల్లుతుంది. మన వెనుక సురక్షితమైన వ్యవస్థ ఉంటే.. దాని ద్వారా ఆదాయం వస్తూ ఉంటే.. ఉద్యోగ అవసరం ఉండదు. మరింత డబ్బు సంపాదించాలనుకుంటే.. వ్యవస్థను మరింతగా విస్తరించాలి. ఎవరైనా సరే, ఒకటి కంటే ఎక్కువ విభాగాల్లో ప్రయత్నించి, తమ ఆదాయాలను మెరుగుపరుచుకోవచ్చు. మన దగ్గర ఆర్థిక విద్యను బోధించే స్కూళ్లు, కాలేజీలు లేవు. చాలామంది గుడ్డిగా ఆర్థిక నిపుణుల మాట వింటారు. బ్యాంకర్లు, ఫైనాన్షియల్ ప్లానర్లు, స్టాక్ బ్రోకర్లు రకరకాల సలహాలు ఇస్తుంటారు. నిజానికి వారెవరూ ‘ఐ’ విభాగంలో పెట్టుబడిదారులు కారు. నెలవారీ వేతనాల కోసం, కమీషన్ల కోసం పనిచేసే (‘ఇ’ విభాగం) వారు. ఈ విషయంలో వారిని నమ్మి మోసపోయే సందర్భాలూ ఉంటాయి.
చట్టాలు, మార్కెట్ శక్తుల ప్రభావం వల్ల సంపద బదిలీ అవుతుంది. ‘బి, ‘ఐ’ విభాగాల్లో రాణించాలంటే, మార్కెట్ శక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. వాటిని ప్రభావితం చేసే చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. ఆయా పరిణామాలు మీకు అనుకూలంగా ఉండేట్టు చూసుకోవాలి.
బిజినెస్, లీడర్షిప్.. అనేవి సైన్స్, ఆర్ట్స్ మాదిరిగా జీవితాంతం అధ్యయనం చేయాల్సిన అంశాలు. ఆర్థిక నివేదికలను చదవడం, మార్కెటింగ్, సేల్స్, అకౌంటింగ్, మేనేజ్మెంట్, ప్రొడక్షన్ వ్యవహారాలు, వ్యాపారవర్గాలతో సంప్రదింపులు.. తదితర అంశాల్లో అవగాహన పెంచుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా వ్యక్తులతో కలిసి పనిచేయడం, అనుచరులను ముందుకు నడిపించడం తెలిసి ఉండాలి.
ఒక కొత్త బిజినెస్ ఐడియా మీకు తట్టొచ్చు. అందుకు తగిన పెట్టుబడి మీకు అందుబాటులోకి రావచ్చు. కానీ, ఓ వ్యవస్థను నిర్మించగల సామర్థ్యం మీకు ఉందా? అన్నది బేరీజు వేసుకోవాలి. మెక్ డొనాల్డ్ కంటే మీరు మెరుగైన బర్గర్ తయారు చేయవచ్చు. కానీ, మీరు అంతకంటే మెరుగైన వ్యాపార వ్యవస్థను నిర్మించగలరో లేదో ఆలోచించుకోవాలి. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా మెక్ డొనాల్డ్ కార్యాలయాలన్నీ ఒకే తీరుగా ఉంటాయి. అక్కడి వ్యక్తులు ఒకే రకమైన భాష మాట్లాడతారు. అక్కడి వస్తువుల రుచి ఒకటిగానే ఉంటుంది. పెట్టుబడి అంటే డబ్బే కాదు. దానికి సంబంధించిన జ్ఞానం కూడా. ఒక్క చిన్నమార్కెట్ కుదుపుతో తలకిందులయ్యేవారు ఎందరో ఉంటారు. మార్కెట్ ఎత్తుపల్లాలకు లోనవుతున్నప్పుడు చాలామంది ఆందోళనకు గురై స్టాక్స్ అన్నీ అమ్మేస్తుంటారు. పక్కా పెట్టుబడిదారులు వాటిని కొని లాభపడతారు. ఆర్థికరంగంలో ఒడుదొడుకులకు వాళ్లు అసలు భయపడరు. మార్పు అంటే సంపద బదిలీ కావడమేనని బలంగా నమ్ముతారు. రియల్ ఎస్టేట్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్.. ఇలా ఎందులోనైనా మనం ప్రవేశించవచ్చు. కాబట్టి, సంపాదనను వ్యసనంగా మార్చుకోకూడదు. ఓ శాస్త్రంలా అధ్యయనం చేయాలి. అప్పుడే. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.
‘నాకు డబ్బు పట్ల వ్యామోహం లేదు. నేనెప్పుడూ ధనికుణ్ని కాలేను. పెట్టుబడి అనేది రిస్క్. డబ్బే సర్వస్వం కాదు’ తరహా వ్యాఖ్యలు చేసేవారు చాలామందే ఉంటారు. డబ్బుతో జీవితాన్ని సౌకర్యవంతంగా గడప వచ్చన్న భావన ఉన్నా, డబ్బు సంపాదన ఓ వ్యసనమనే భావన వారిలో పాతుకుపోయి ఉంటుంది. దీంతో బాగా డబ్బున్న వారిమీద దుర్మార్గులనే ముద్ర వేస్తుంటారు. దానివల్ల ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి.
సంపన్నులకు దీర్ఘకాలిక దృష్టి, పక్కా ప్రణాళిక ఉంటాయి. ఏ పనిలోనైనా తక్షణ విజయం సాధించాలనే తొందరపాటు కనిపించదు. తమ ఆదాయాన్ని పెట్టుబడిగా మార్చుకుంటూ.. సంపదను క్రమంగా పెంచుకుంటూ పోతారు. ‘కాంపౌండింగ్ ఎఫెక్ట్’ ను బలంగా నమ్ముతారు. మీరు కూడా సంపన్నులు కాదలిస్తే, మీ ఆలోచనా విధానాన్నీ అలానే మార్చుకోండి.
గొప్ప పెట్టుబడిదారు కావాలంటే.. గెలుపు, ఓటములకు సమానంగా స్పందించాలి. ఫక్తు వ్యాపారులకు పెద్దగా భావోద్వేగాలు ఉండవు. భయాన్నీ, దురాశనూ దరిచేరనివ్వరు. ఇతరుల గురించి ఆలోచించరు. డబ్బు పోగొట్టుకుంటామనే భయం ఉండదు. పోగొట్టుకోవడం అనేది గెలుపు ప్రక్రియలో ఒక భాగమని నమ్ముతారు. షేర్ ధర పతాక స్థాయికి చేరినప్పుడు మరో ఆలోచన లేకుండా.. మొత్తం స్టాక్స్ అమ్మేస్తారు. మార్కెట్ నేలచూపులు చూస్తున్నప్పుడు మళ్లీ కొనేస్తారు.
నగదు కదలికల పాఠం.. ‘క్యాష్ ఫ్లో గేమ్’ ప్రజలకు ఆర్థిక విద్య అందించడానికి కియోసాకీ ‘రిచ్ డాడ్’ అనే కంపెనీని ప్రారంభించారు. దీనిద్వారా ‘క్యాష్ ఫ్లో గేమ్’ ప్రాచుర్యం పొందింది. ఇందులో డమ్మీ నగదుతో ఆటాడుకుంటారు. చదువులతో, డిగ్రీలతో నిమిత్తం లేకుండా, వీలైనన్నిసార్లు తప్పులు చేయవచ్చు. ప్రతి తప్పులో ఓ పాఠం నేర్చుకోవచ్చు. అమెరికా వ్యాప్తంగా ‘క్యాష్ ఫ్లో క్లబ్’లు వెలిశాయి. ఆర్థికంగా ఒడుదొడుకులు ఎదురైనప్పుడు, ఓదార్పునిచ్చి జీవిత ప్రయాణం సాఫీగా సాగడానికి ఈ సంఘాలు సహాయకారిగా నిలుస్తాయి. ‘సుదీర్ఘమైన ప్రయాణంలో ఆర్థికంగా, మానసికంగా, భావోద్వేగపరంగా, ఆధ్యాత్మికంగా ఎదగడానికి క్యాష్‌ఫ్లో క్లబ్‌లు సహాయకారిగా నిలుస్తాయి. ఇందులో చేరిన తర్వాత ప్రతి ఒక్కరూ మార్పు దిశగా కదులుతారు. మీరు కూడా సాధ్యమైనంత వేగంతో పరుగెత్తవచ్చు’ అంటారు కియోసాకి.
…? డాక్టర్ పార్థసారథి చిరువోలు
“అంబానీ, అదానీ, ఇతర కుబేరుల పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా..”
బిల్ గేట్స్, వారెన్ బఫెట్, రతన్ టాటా.. అపర కుబేరులు చేసిన ఫస్ట్ జాబ్ ఏంటో తెలుసా?
“అదానీ నిమిషానికి ఎంత సంపాదిస్తాడో తెలుసా? సగటు వ్యక్తి జీవితకాలం కష్టపడినా అంత రాదు!!”