కానుగ సతత హిరిత వృక్షం. ఇది పదిహేను నుంచి ఇరవై అడుగుల ఎత్తు పెరుగుతుంది. చల్లని నీడనిస్తుంది. గుండ్రని ఆకులు కలిగి ఉంటుంది. కాయలు సీమ బాదం (మూత్రపిండ) ఆకారంలో ఉంటాయి. దీన్ని సంస్కృతంలో నక్తమాల, కరజ, చిరబిల్వక పేర్లతోనూ పిలుస్తారు. ఆయుర్వేద వైద్య శాస్త్రంలో ‘కుష్టబిల్’ అంటారు. కుష్టు రోగాన్ని జయించేదని దీని అర్థం.
కానుగ ఔషధ మొక్క. వందల సంవత్సరాల క్రితమే ఈ కానుగను సిద్ధ వైద్యంలో ఉపయోగించారు. ఆకులు, కొమ్మలు, వేర్లు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఉదయం పూట కానుగ ఆకుల కషాయాన్ని తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. కానుగ ఆకుల కాషాయం తాగితే దురలవాట్లకు దూరం చేస్తుంది. మలబద్ధకం సమస్యకు కానుగ దివ్యౌషధం. నరాల రుగ్మత, అలసట, తిమ్మిర్లు వంటి సమస్యలను నియంత్రిస్తుంది.
ఈ చెట్టు పూలు గులాబీ రంగులో, నీలిరంగు ఛాయలో గుత్తులు గుత్తులుగా పూసి సువాసన కలిగి ఉంటాయి. కానుగ చెట్లు ఏప్రిల్-మే నెలల్లో పూస్తాయి. జూన్ నెలలో కాయలు కాస్తాయి. పొట్టు తీసిన గింజల నుంచి నూనెను తయారు చేస్తారు. ఈ నూనెను ఎక్కువగా బయోడీజిల్, సబ్బులు, వార్నిష్ తయారీలో ఉపయోగిస్తున్నారు. చెట్టు నుంచి తీసే ద్రావణం, విత్తనాల నుంచి తీసే నూనె క్రిమి సంహారకంగా ఉపయోగపడతాయి. కానుగ నూనె వంట చేయడానికి పనికిరాదు. కానుగ నూనెలో పామిటిక్ ఆమ్లం, స్టియరిక్ ఆమ్లం, లినోలిక్ ఆమ్లం, ఓలిక్ ఆమ్లం ఉంటాయి. ఈ నూనెలో వున్న కిరొంజిన్ రసాయనం ఒక జీవ ఉత్ప్రేరకం.
పూర్వం కానుగ నూనెతో దీపాలు వెలిగించుకునేవారు. ఎడ్లబండ్ల ఇరుసుకు కానుగ నూనె కందెనగా ఉపయోగిస్తారు. చర్మ పరిశ్రమలో టానింగ్ చేయడానికి వినియోగిస్తారు. పీవీ వనంలో అనేక కానుగ చెట్లు చూడవచ్చు. ఇవన్నీ సహజంగా పెరిగినవే. మేం దాని కింద సేద తీరుతున్నాం!
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు