జనజీవితం ప్రకృతి ఒడికి పబ్బతిపడుతూ మేడారానికి తరలివెళ్లేందుకు సమాయత్తం అవుతున్నది. ‘సమ్మక్కా.. సారక్కా.. నీవే దిక్కూ’ అంటూ సకల జనులు మేడారానికి మోకరిల్లే ఘడియలు సమీపిస్తున్నాయి. ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మేడారం కుగ్రామం మహానగరాన్ని మరిపించి మహాజాతర చేసేందుకు సమాయత్తం అవుతున్నది. తల్లీబిడ్డలైన సమ్మక్క-సారలమ్మ జాతర నేపథ్యం.. నిర్వహణ ఎప్పటికప్పుడు కొత్తదే. ఆధునికత, హంగూ ఆర్భాటాల ముసుగులో ప్రభుత్వం, బయటి సమాజం ఎన్ని‘కొత్త’రంగులు అద్దినా, ఎన్ని మైపూతలు, మరెన్ని పైపూతలు పూసినా చిలుకలగుట్ట, కన్నెపల్లి గుండెలోతుల్లో కొలువైన అచ్చమైన బండారి.. స్వచ్ఛమైన బంగారం, దర్శనమిచ్చే కుంకుమభరిణెకు ప్రతిరూపాలు అవుతాయా? అంటే ‘ఎన్నటికీ కాలేవు’ అని సమస్త కోయజాతి ముక్తకంఠంతో, కొమ్ముబూరతో సింహనాదమై ప్రతిధ్వనిస్తున్నది. మేడారం మహాజాతర మెల్లిమెల్లిగా దేశం తీరం దాటింది. ఆదివాసీ జాతర అంతర్జాతీయ వేదికలపై అలరారుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి స్వరాష్ట్ర తెలంగాణ దాకా మేడారం నేపథ్యంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు నిత్యం నూతనమే.
2014లో జరిగిన మేడారం జాతర తెలంగాణకు అతిపవిత్రం. దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసే అపురూపమైన సందర్భం. సమ్మక్క గద్దెనెక్కిన నాడే… పార్లమెంట్‌కు తెలంగాణ బిల్లు వచ్చింది. ఈ నేపథ్యంగానే తెలంగాణలో ఏర్పడిన నాటి కేసీఆర్ ప్రభుత్వం ఆదివాసీ (గిరిజన) జీవితాల్లో నిజమైన మార్పులు తేవటానికి అనేక విప్లవాత్మకమైన కార్యాచరణను అమలు చేసేందుకు అడుగులు వేసింది. మేడారం జాతరతోపాటు అనేక ఆదివాసీ, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు పటిష్ఠమైన భూమికకు దారులు తీసింది. ఆదివాసీ గిరిజన జీవితాల్లో గుణాత్మక మార్పులకు బాటలు వేసింది. ములుగును జిల్లా చేసింది. మేడారంలో మ్యూజియం ఏర్పాటుచేసింది. మేడారంలో జంపన్నవాగుపై మరో వంతెనను నిర్మించింది. ఈ క్రమంలో ఈసారి మేడారంలో భక్తులకు సౌకర్యాల కల్పన, తల్లులు కొలువుదీరే గద్దెల ప్రాంగణానికి రేవంత్సర్కార్ శిలాతోరణం కట్టింది. దీనిపై వెలువడే వాదాలు…వ్యాఖ్యానాలకు రానున్న కాలమే.. కానున్న చర్యలకు సాక్షీభూతం అవుతుంది.

Medaram
మౌఖిక సాహిత్యం ఆధారంగా మేడారం జాతరపై అనేక కథలు ఉన్నాయి. జాతర నిర్వహణ రికార్డులు ఉన్నాయి. తొమ్మిది వందల ఏండ్లుగా మేడారం జాతర జరుగుతున్నదని మౌఖిక సాహిత్యం ఆధారంగా చరిత్రకారుల అంచనా. కాగా, గత శతాబ్దం నుంచే జాతర ప్రాశస్త్యం కనపడుతున్నదని జాతర నిర్వహణ రికార్డులు చెప్తున్నాయి. జాతర విషయమై సమ్మక వంశం వారు, కోయ వడ్డెలు…ములుగు తహసీల్దారు వద్ద 1944 జనవరి 6న ఒప్పందం చేసుకున్నట్లు రాత ప్రతులు ఉన్నాయి. ఆ తరువాత జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జాతర నిర్వహణ భారమై ఉన్న కారణంగా చందా వంశంవారు 1948లో కన్నెపల్ల్లి, మేడారం వడ్డెలకు జాతర జరుపుకొమ్మని చెప్పడంతో 1948 నుంచి జాతర ఆదాయం ఆదివాసీ గిరిజనులకు దకేటట్లుగా నాటి నిజాం ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. ఇక హైదరాబాద్ రాష్ట్రం 1951లో ప్రచురించిన ‘Tribes and Tribal Welfare in Hydearabad’ గ్రంథంలోనూ వరంగల్ జిల్లా ములుగు తాలూకా పరిధిలోని ప్రతీ రెండేండ్లకు ఒకసారి కోయల జాతర జరుగుతుందని పేర్కొన్నారు.
1961లో జాతరను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుంది. పూజారులు కోర్టును ఆశ్రయించడంతో 1962 నవంబర్ 12న వరంగల్ జిల్లా మున్సిఫ్ కోర్టు వెలువరించిన తీర్పులో.. ఆదాయంలో మూడు అణాలు దేవతల కొరకు, నాలుగు అణాల నాలుగు పైసలు సిద్ధబోయిన వారికి, 1/3వ వంతు సారలమ్మ పూజారులకు చెందాలని ఉన్నది. ఆ తరువాత 1963లో ఆ కేసు హైకోర్టు తీర్పులో మేడారం జాతర ఆదాయంలో 1/3 వంతు పూజారులకు, వడ్డెలకు చెందాలని ఉన్నది. 1948లోనే Cast and Tribes of Southern Indiaలోఎడ్గర్ ధరస్టన్ నల్ల్లపల్లి (అది కన్నెపల్లి)లో సారలమ్మ కొలువై ఉందని రాశాడు. 1961లో ప్రచురించిన సెన్సెస్ ఆఫ్ ఇండియాలో (ఫేయిర్స్ అండ్ ఫెస్టివల్ విభాగంలో) రెండేండ్లకోసారి మేడారం జాతర జరుగుతుందని, లక్షమంది వరకు భక్తులు హాజరవుతారని ఉన్నది. 1966లో మేడారం జాతర ఉమ్మడి రాష్ట్రంలో దేవాదాయశాఖ పరిధిలోకి రావటం, 1996లో స్టేట్ ఫెస్టివల్‌గా మారటం, అప్పటి నుంచి జాతర జాతరకు మధ్య వందలు, వేలుగా గిరిజనులతోపాటు, గిరిజనేతరులు లక్షలాదిగా హాజరుకావటం పెరుగుతూ వస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మేడారం ప్రపంచవ్యాప్తంగా కీర్తిని సొంతం చేసుకుంది.

Medaram
సాంస్కృతిక ప్రతిబింబాలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఆదివాసీ గిరిజన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ, వాటిని భవిష్యత్ తరాలకు అందించాలనే తపన పెరిగిందనటానికి 2014కు ముందు, ఆ తరువాత ఉన్న మ్యూజియాలే సాక్ష్యం. ఆదివాసీ గిరిజన కళలు, సంస్కృతి, సంప్రదాయాలు వారిజీవన విధానం పట్ల బయటి సమాజానికి ఉన్న అపోహలు పటాపంచలు కావటమే కాకుండా వారిపట్ల గౌరవం, ఆరాధన భావమూ పెరిగిందనే చెప్పాలి. అందుకు 2014 నుంచి 2023 దాకా సాగిన కేసీఆర్ పాలన తోడ్పాటును అందించిందని ఆ వర్గాలు చెప్తాయి. రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణలో ఉన్నవి రెండే రెండు ట్రైబల్ మ్యూజియాలు. 2009లో మన్ననూరులో నిర్మించిన చెంచులక్ష్మి మ్యూజియం, 2010లో భద్రాచలంలో నిర్మాణమైన ట్రైబల్ హాల్.
ఈ రెండు మాత్రమే. కానీ, ఆ తరువాత 2016లో జోడేఘాట్‌లో ఆదివాసీ పోరాట యోధుడు కుమ్రంభీం మ్యూజియం, 2018లో మేడారంలో సమ్మక్క-సారలమ్మ ట్రైబల్ మ్యూజియం, 2019-20లో తెలంగాణ స్టేట్ ట్రైబల్ మ్యూజియం, 2021లో వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్‌నగర్‌లో స్టేట్ మ్యూజియం ఆఫ్ కోయా కల్చర్, 2022లో హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నిర్మాణమైన బంజారాభవన్, ఆదివాసీ భవన్లతోపాటు వాటిలోని రెండు ట్రైబల్ గ్యాలరీస్. అలాగే, 2022-23లో అబిడ్స్ (హైదరాబాద్)లో రాంజీ గోండ్ ట్రైబల్ ఫ్రీడం ఫైటర్స్ మ్యూజియానికి కేసీఆర్ స్థలం కేటాయించి పనులు ప్రారంభించారు. దాని నిర్మాణం తుదిదశకు చేరుకున్నది.
సంస్కృతికి పబ్బతి పట్టిన పాలకులెవరు?
రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు తమ అవసరాల కోసం ఆదివాసీ గిరిజన సంస్కృతిని వాడుకున్నారనే అపవాదు సమాజంలో నాటుకుపోయింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత అన్ని వర్గాలు తమను తాము పునర్నిర్వచించుకున్నట్టే కోయ గిరిజన సమాజంలోనూ నూతన శకం మొదలైంది. తమ అస్తిత్వాన్ని పునర్ నిర్మించుకోవడంలో వేగం పుంజుకున్నది. 2018 జాతర సందర్భంగా అక్కడ మ్యూజియం నిర్మించుకోవటం, అదే జాతర సందర్భంగా గద్దెల ప్రాంగణంలో గిరిజన నృత్య నివేదనం మొదలైంది. రాష్ట్రంలోని కోయ, గోండు, కొండరెడ్డి, చెంచు, కొలాం, తోటి, పర్దాన్ సహా ఆదివాసీ గిరిజన తెగలకు చెందిన దాదాపు 200 మంది కళాకారులతో తల్లీబిడ్డలైన సమ్మక్క-సారలమ్మలు మేడారం గద్దెల నుంచి వనప్రవేశం చేయటానికి ముందు చేసే నృత్య ప్రదర్శన అద్భుతంగా సాగుతుంది. కొమ్ము బూరలు, డోలీ నాదాలు, డోల్ డప్పులు, తార్ప, తమ్డా, తిరియావో వంటి వాయిద్య పరికరాల లయబద్దమైన సంగీత ఝరీ ప్రవహిస్తుండగా ఆయా తెగలకు చెందిన కళాకారులు వారివారి సంప్రదాయరీతిలో నృత్యాలాపన చేస్తుంటే మేడారం పులకించిపోతుంది. 2022 జాతర నాటికి ఈ సమ్మక్క నృత్యనివేదనలో పాల్గొనటానికి దేశంలోని అన్ని గిరిజనప్రాంతాల నుంచి 300 మంది హాజరయ్యారు. ఈసారి 400 మందితో సమ్మక్కకు నృత్య నివేదన చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.
ప్రకృతి గద్దెల చుట్టూ శిలల దడి

Medaram
ఆదివాసీ పెద్దలు, పూజారుల సంఘం, ఆదివాసీ పరిశోధక బృందాన్ని ముందుపెట్టి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మేడారం గద్దెల ప్రాంగణానికి సుందరీకరణ చేపట్టింది. దీన్ని ఇవ్వాళ రాష్ట్ర ప్రభుత్వం పునర్నిర్మాణంగా చెబుతున్నది. జాతర నిర్వహణకు అవసరమైన వసతుల కల్పన, అభివృద్ధి పనుల (శాశ్వత, తాత్కాలిక ప్రాతిపదికన)ను చేపట్టింది. ఇలా చేపట్టిన పనుల్లో అప్పటిదాకా ఉన్న గద్దెల చుట్టూ (కైవారం) ఉన్న ప్రాంతాన్ని శిలాకృతులతో రూపొందిస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతమే కాదు దేశంలోని కోయజాతి చరిత్ర, సంస్కృతి ఇతివృత్తాల ఆధారంగా తమ పూర్వికులు భద్రపరచిన లిఖిత, మౌఖిక సాహిత్యానికి ఆలంభనగా ఉన్న దాదాపు 7 వేల రకాల ఆకృతులను శిలలపై చెక్కి మేడారం గద్దెల కైవారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వీటిపై భిన్నవాదనలు, అభిప్రాయభేదాలు వినిపిస్తుండటం గమనార్హం. తమ సమాజం కానివాళ్లు, తమ సమాజ జీవన విధానానికి సంబంధం లేనివాళ్లు ఎన్ని రకాలుగా వాదించినా అవి తమవి కాదని తేల్చి చెబుతున్నారు అడవితల్లి బిడ్డలు. అయితే, తాము అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టామని చెప్తున్న ప్రభుత్వమో, ప్రభుత్వంలోని పెద్దలో, పరిశీలకులో, పరిశోధకులో వీరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనే వాదనా వినిపిస్తున్నది.
మహబూబ్‌నగర్, ఆళ్లగడ్డ, రాయచోటి, కొత్తకోట వంటి ప్రాంతాల నుంచి మార్బుల్ స్టోన్‌ను తెప్పించారు. శిలలతో గద్దెల ప్రాంగణం, గద్దెల చుట్టూ ఉన్న కైవారాన్ని నిర్మిస్తున్నారు. 4 వేల టన్నుల గ్రానైట్‌తో గద్దెల ప్రాంగణ నిర్మాణ పనులు చేపట్టారు. 46 స్తంభాలతో 271 చ.మీ విస్తీర్ణంలో గద్దెల కైవారం,8 స్తంభాలతో వృత్తాకార గద్దె నిర్మాణం చేపట్టారు.40 అడుగుల వెడల్పుతో మూడు స్వాగత తోరణాలు, 30 అడుగుల వెడల్పుతో ఐదు స్వాగత తోరణాలు, 50 అడుగుల వెడల్పుతో ప్రధాన స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేశారు. మర్రి, వెదురు, వేప, ఇప్ప తదితర 12 రకాల వృక్షజాతులు.. 140 రకాల ఆయుర్వేద మొకలతో గద్దెల ప్రాంగణం ఆవల మేడారం వైపు గార్డెన్‌ను నిర్మిస్తున్నారు.

Medaram
మేడారం నుంచే ఇలవేల్పుల సమ్మేళనం
రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఆదివాసీ గిరిజన తెగలు ప్రత్యేకించి కోయ ఇలవేల్పుల సమ్మేళనాలు నిర్వహించటం అనే ఆనవాయితీ 2018-19 సంవత్సరంలో ఆరంభమైంది. సమ్మక్క కూడా ఇలవేల్పే. ఇలా కోయతెగలోనే 150 మంది ఇలవేల్పులు ఉన్నట్టు గుర్తించామని పరిశోధకులు చెప్తారు. ఇప్పటి వరకు 140 ఇలవేల్పులకు సంబంధించిన ఆధారాలు, ఆచార సంప్రదాయాలను ఆయా సమ్మేళనాల సందర్భంగా వెలుగుచూశాయని అంటారు. ఈ ఇలవేల్పుల సమ్మేళనం ప్రారంభమైంది కూడా మేడారంలోనే కావటం గమనార్హం.
రెండేండ్లకోసారి..
నలుదిశలనూ ఏకం చేసే ఆ నాలుగు రోజులు మేడారాన్ని మహానగరంగా మారుస్తాయి. జనపూనకాలు వనస్థలిని ధర్మస్థలిగా మారుస్తాయి. ఆదివాసీ ఆచారాల్ని ప్రపంచానికి చాటుతాయి. ఆదివాసీ ఆడబిడ్డలు సమ్మక్క, సారలమ్మలకు ఈ ఏడాది జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జాతర జరుగుతుంది. అత్యంత గోప్యంగా నిర్వహించే ఆదివాసీ పూజా విధానం…ఆ నాలుగురోజులపాటు మేడారంలో జరిగే తీరూ ఆధ్యంతం ఆసక్తికరం.

Medaram
మొదటి రోజు సారలమ్మ రాక
సమ్మక్క కూతురైన సారలమ్మ నివాసం కన్నెపల్లి. మేడారం గద్దెలకు మూడుకిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలోని గుడిలో సారలమ్మ కొలువై ఉంటుంది. ఈ జనవరి 28వ తేదీన (బుధవారం) ఉదయం పూజారులు గోప్యంగా పూజాదికాలు నిర్వహిస్తారు. కడుపు పండాలని కోరుకునేవారు, అవివాహితులు, దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్నవారు వందలాదిమంది తడిదుస్తులతో గుడి ఎదుట సాష్టాంగ పడి తల్లికి వరం పడుతారు. దేవతారూపాన్ని చేతబట్టుకుని బయటికి వచ్చిన పూజారులు సాష్టాంగ పడి, వరంపడుతూ పడుకున్నవారి పైనుంచి నడిచివెళ్తారు. సారలమ్మే తమపైనుంచి వెళ్తున్న అనుభూతితో భక్తులు తరించిపోతారు. జాతర కమిటీ, ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం తమ హోదాలను మరిచి సారలమ్మను మోస్తున్న పూజారిని తమ పైనుంచి నడిపించుకుంటారు. మహిళలు మంగళ హారతులిచ్చి, కొబ్బరికాయలతో పూజలు చేసి, సారలమ్మను మేడారానికి సాగనంపుతారు. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకుని బయల్దేరిన పూజారులు జంపన్నవాగు గుండానేరుగా మేడారంలోని సమ్మక్క గద్దెల వద్దకు తీసుకొస్తారు. కొండాయి నుంచి గోవిందరాజు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు అప్పటికే సమ్మక్క సన్నిధికి చేరుకోగా, సారలమ్మతో సహా ఈ ముగ్గురికీ పూజారులు పూజలు నిర్వహిస్తారు. పూజల అనంతరం దేవతలను వారివారి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. గద్దెపై ఆసీనురాలైన సారలమ్మ తల్లి.. సమ్మక్కకు ఆహ్వానం పలికేందుకు సిద్ధమై భక్తులకు దర్శనమిస్తుంది.
రెండోరోజు సమ్మక్క రాక
జాతర రెండో రోజు అధికార లాంఛనాలతో సమ్మక్క స్వాగతం లభిస్తుంది. పోలీసు ఉన్నతాధికారుల తుపాకీ కాల్పుల గౌరవవందనం, ఎదురుకోళ్ల ఘట్టంతో భక్తులు సమ్మక్కను ఆహ్వానిస్తారు. రెండో రోజైన జనవరి 29వ తేదీన (గురువారం) ఉదయమే పూజారులు వనానికి వెళ్లి కంకవనం (వెదురుకర్రలు) తెచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. అనంతరం సమ్మక్క పూజా గృహం నుంచి వడ్డెలు పసిడి కుండలను తెచ్చి గద్దెలపై నెలకొల్పుతారు. మేడారానికి ఈశాన్యాన చిలుకలగుట్టపై నారచెట్టుకింద ఉన్న కుంకుమభరిణె రూపంలోని సమ్మక్కను తెచ్చేందుకు పూజారులు బయల్దేరుతారు. ఈ సమయంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంటుంది. జాతర మొత్తానికి ప్రధాన దేవత అయిన సమ్మక్క రాక కోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమంది భక్తులు చిలుకలగుట్ట సమీపంలో పోగవుతారు.
తల్లిని కనులారా చూడాలని తపించిపోతారు. ప్రధానవడ్డె (పూజారి) ఒక్కరే చిన్న కాలిబాటన నడుచుకుంటూ చిలుకలగుట్టపైకి వెళ్తాడు. రహస్య ప్రదేశంలో నిక్షిప్తమై ఉన్న సమ్మక్క వద్ద పూజలు నిర్వహిస్తాడు. పూజారిపై దేవత పూనగా కుంకుమభరిణె తీసుకుని అతివేగంగా కిందకు దిగుతాడు. చిలుకల గుట్ట పాదాల వద్ద సమ్మక్క ఆగమన సూచకంగా జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపి స్వాగతిస్తారు. తుపాకీ శబ్దం విన్న మరుక్షణమే భక్తజనం ఉర్రూతలూగుతుంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న భక్తుల్లో దేవుడు పూనిన శివసత్తులు ఊగిపోతారు. మేడారం దద్దరిల్లుతుంది. గద్దెల వద్దే సమ్మక్కకు ఎదురుకోళ్లతో స్వాగతం పలుకుతారు. దేవతను పట్టుకున్న పూజారిని తాకేందుకు ప్రయత్నించే భక్తులను నివారించడం పోలీసులకు సవాలుగా మారుతుంది. మాఘ శుద్ధ పౌర్ణమి ఘడియలు ప్రవేశించగా లాంఛనంగా జాతర ప్రారంభమవుతుంది.

Medaram
మూడో రోజు దేవతల దర్శనం
మేడారం గద్దెలపై ఆసీనులైన సమ్మక్క, సారలమ్మలు మూడోరోజైన శుక్రవారం (జనవరి 30) భక్తజనావళికి దర్శనమిస్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాల అనంతరం భక్తులు తల్లులను దర్శించుకుంటారు. కోర్కెలు తీర్చమని కోరుతూ కానుకలు, మొక్కులు సమర్పించుకుంటారు. నిలువుదోపిడీ ఇస్తారు. తలనీలాలు, తులాభారాలు జరిపిస్తారు. ఆడబిడ్డలుగా భావించిన తల్లులకు మహిళలు ఒడిబియ్యం పోసి కొలుచుకుంటారు. చీరసారెలు పెట్టి పూజిస్తారు. ఈ రోజంతా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దర్శనానికి వచ్చిన లక్షలాదిమందితో గద్దెల ప్రాంగణాలు జన సముద్రమవుతాయి.
నాలుగో రోజు వనప్రవేశం..
సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలకు దర్శనమిచ్చిన సమ్మక్క, సారలమ్మలు నాలుగో రోజు అయిన శనివారం (జనవరి 31) నాడు తిరిగి వనప్రవేశం చేస్తారు. దీంతో జాతర ముగిసిపోతుంది. దేవతలు వనప్రవేశం చేసిన అనంతరం గుండెలనిండా నింపుకొన్న దైవత్వంతో భక్తులు తిరుగుప్రయాణమవుతారు. మరిచిపోని మధురానుభూతులను నెమరేసుకుంటూ ఇళ్లకు పయనమవుతారు. దీంతో అప్పటివరకు జనసంద్రంగా ఉన్న మేడారం మెల్లిమెల్లిగా నిర్మానుష్యమవుతుంది. అలా అంగరంగ వైభవంగా సాగిన వనజాతర ఘనంగా ముగుస్తుంది.
మురిసిన సమ్మక్క

Sammakka Barrage
ఆదివాసీ గిరిజన ఆరాధ్యదైవాలకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పేరు పెట్టడంలోనూ కేసీఆర్ సర్కార్ దార్శనికత ప్రదర్శించిందనే చెప్పాలి. గోదావరి నదిపై తుపాకులగూడెంలో నాడు నిర్మించిన ప్రాజెక్టుకు సమ్మక్క సాగర్‌గా నామకరణం చేశారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న క్రమంలో వచ్చిన మేడారం జాతర సందర్భంగా తాడ్వాయి మండలానికి సమ్మక్క-సారలమ్మ మండలంగా నామకరణం చేయాలనే డిమాండ్ బలంగా వినిపించింది. ఆ డిమాండ్‌కు అనుగుణంగా తాడ్వాయి మండలానికి సమ్మక్క-సారలమ్మ (ఎస్ఎస్) తాడ్వాయి మండలంగా నామకరణం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. తొలివిడతగా రాష్ట్రంలో 31 జిల్లాలు ఏర్పడ్డాయి.
అయితే, 2018 ఎన్నికల సందర్భంగా ములుగు నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల బహిరంగసభలో కేసీఆర్ ‘ములుగు జిల్లాను ఏర్పాటు చేస్తా.. బీఆర్ఎస్ నుంచి ఎన్నికల బరిలో నిలుచున్న చందూలాల్‌ను మీరు ఎమ్మెల్యేగా గెలిపించండీ’ అని కోరారు. అనూహ్యంగా ఆ ఎన్నికల్లో చందూలాల్ ఓటమిపాలయ్యారు. తమ పార్టీ అభ్యర్థి ఓడిపోయినా సరే, తాను ములుగు జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే తపనతో కేసీఆర్ ములుగు జిల్లాను ఏర్పాటు చేశారు. జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను నిర్మించటం, జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన క్రమంలో ములుగులోనూ మెడికల్ కాలేజీ నెలకొల్పడం కండ్ల ముందరి చరిత్ర. అలాగే, రాష్ట్ర విభజన బిల్లులో కేంద్రం రాష్ర్టానికి ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా ఆ గిరిజన యూనివర్సిటీని కేటాయించవచ్చు. కానీ, దాన్ని ములుగులోనే ఏర్పాటు చేయాలని నాటి కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ఆ ఫలితంగా ప్రస్తుతం ములుగు సమీపంలోని జాకారంలో 200 ఎకరాల స్థలాన్ని కేటాయించినా.. కేంద్రం చేస్తున్న జాప్యానికి పార్లమెంట్ సాక్షిగా బీఆర్ఎస్ ఉద్యమిస్తే ఎట్టకేలకు ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీని కేంద్రం నెలకొల్పిన విషయం తెలిసిందే.

Medaram
విశ్వాసాల మేడారం
మేడారం విశ్వాసాల జాతర. మనిషి ఎంత ఆధునికుడే అయినా మేడారంలో అనాది జీవనంలో ఓలలాడిపోతాడు. జంపన్నవాగులో తానమాడినప్పటి నుంచి దేవతల వనప్రవేశం దాకా మేడారం పరిసరాల్లో ప్రతీది పవిత్రమే. కాలం ఎంత పరుగులు తీసినా… జాతర జాతరకు మధ్య ఎన్ని కొత్త రూపాలు అవతరించినా సమ్మక్క-సారలమ్మ భక్తుల ఆచార సంప్రదాయాలు తరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. విశ్వాసమే ఊపిరిగా జాతర ప్రవహిస్తూనే ఉన్నది.
గట్టమ్మకు తొలిమొక్కు
మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరకు వచ్చే భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతే మేడారం వెళతారు. వరంగల్-ములుగు ప్రధాన రహదారిపై ములుగుకు రెండు కిలోమీటర్ల దూరంలో గట్టమ్మ గుడి ఉంది. కోరికలు తీర్చే తల్లిగా పేరొందిన గట్టమ్మ తల్లి ఇక్కడ చాలా సంవత్సరాల క్రితం గట్టంపల్లె గ్రామంలో వెలిసింది. ములుగు ప్రాంతంలో ఎవరింట్లో పుణ్యకార్యం జరిగినా మొదట గట్టమ్మను సందర్శించి పూజలు జరుపుతారు. రాజకీయ నాయకులు సైతం ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమకు శుభం జరిగేలా ఆశీర్వదించమని గట్టమ్మను వేడుకుంటారు.
పూనకాలు
గట్టమ్మ దాటినప్పటి నుంచి భక్తులు శిగాలూగిపోతారు. అలా శిగాలూగిపోయేవాళ్లనే శివసత్తులని, దేవుడున్న మనిషి అని పిలుచుకుంటారు. జాతర జరిగే నాలుగు రోజులు మేడారం పరిసర ప్రాంతాలు అబ్బియ రాగాలతో… సమ్మక్క కొలుపులతో ప్రతిధ్వనిస్తాయి. జంపన్నవాగులో శివసత్తులు స్నానాలకు దిగితే పూనకాలతో మైమరిచిపోతారు. కొత్త చీర, రవికలు (రెండు) ధరించి, తలవెంట్రుకలు విరబోసుకొని, గాజులు వేసుకొని, కాళ్లకు పసుపు పూసుకొని, బొట్టు పెట్టుకొని (మగవారు కూడా), నడుముకు ఒడిబియ్యం కట్టుకొని భక్తి భావంతో ఊగిపోతారు. మహిళలు భక్తితో జంటలు పట్టుకొని ఆదమరిచి పూనకంతో ఊగిపోతుంటారు. ఆ సమయంలో మహిళలు ఆడే మాటలు సాక్షాత్తు సమ్మక్క పలుకుతుందని భావిస్తారు. తమ కోరికలు తీర్చాలని భక్తులు వారితో వేడుకుంటారు.

Medaram
ఎదురుకోళ్లు
సమ్మక్క-సారలమ్మల జాతర సందర్భంగా కొనసాగే ఎదురుకోళ్ల సంప్రదాయానికి ఎంతో ఆదరణ ఉంది. సమ్మక్క-సారలమ్మల గద్దెల వద్ద కోడిని ఎగురవేసే సంప్రదాయాన్ని ‘ఎదురుకోళ్లు’ అనే పేరుతో పిలుస్తారు. దేవతలిరువురు గద్దె వద్దకు వచ్చే సమయంలో బలి ఇస్తామని మొక్కుకున్న కోడిని, గద్దె దగ్గర ఎగురవేయడం ద్వారా దేవతలు చూశారని భావించి తరువాత కోడిని బలిచ్చి, దేవతలకు నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం ఎదురుకోళ్లు పేరుతో కొనసాగుతుంది.
బండారి పవిత్రం
మేడారం జాతరలో అత్యంత పవిత్రంగా భక్తులు బండారి (పసుపు)ను భావిస్తారు. పసుపు, కుంకుమలను అందుకోవడానికి లక్షలాది మంది భక్తులు ఆరాటపడతారు. బండారిని అందుకుంటూ భక్తులు ఆరాటంతో దర్శనం క్యూలో ముందుకు సాగుతుంటారు. అందిన బండారిని ఇళ్లకు తీసుకువెళ్లి ఇంటిల్లిపాది బొట్టుగా ధరిస్తే వారి కష్టాలు తీరిపోతాయని, అరిష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సమ్మక్క తల్లి అదృశ్యమైన చోట పసుపు, కుంకుమ కలిగిన భరిణలు దొరికాయని దీంతో వాటిని తల్లికి ప్రతిరూపంగా భావించి, ఈ పసుపు, కుంకుమల బండారిని పొందేందుకు భక్తులు ఉత్సాహం కనబరుస్తారు.
…? నూర శ్రీనివాస్

Medaram