జరిగిన కథ
కొందరు స్వార్థపరులు వేదాలు, ఇతిహాసాల పేరు చెప్పి, దేవుని పేరు చెప్పి అమాయకులను వంచించడం సరికాదంటాడు మాధవుడు. మల్లసు పర్వతం వద్ద కళ్ల ఎదుట ఉన్న కొడుకును పలకరించలేక స్పృహకోల్పోతాడు కుసుమ శ్రేష్ఠి. ఈసాణుడు తాను కోరిన పడతిని పిలిపించలేదన్న కోపంతో సవరసత్తి చెంప పగులగొడతాడు.
ఆ తర్వాత.. గుణము లేని నిన్ను గుణవంతు డవటంచు మెచ్చుకొంటి వృత్తి మేలుగోరి: మూర్ఖమతివి నీవు మొదటి నుండే; నీకు తగిన శాస్తి చేయదగును నాకు. (ఏమాత్రం మంచి గుణం లేని నిన్ను గుణవంతుడవని, మా వృత్తికి అది మేలు చేస్తుందని మెచ్చుకున్నాను కానీ, మొదటి నుంచి నీవు మూర్ఖుడవే. నీకు తగిన శాస్తి నేనే చేయాలి)’ అనుకున్నది సవర. వెంటనే తన దాసికి సైగ చేసింది. ఇటువంటిది ఒకటి జరగవచ్చునని ముందే ఊహించి, భటులను ఆదేశించినాడు ఈసాణుడు. “పడమటి వీధిలో చివరి ఇంట ఓ పడుచు ఉంటుంది. దాని పేరు సౌగంధిక. అది ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకొని ఈడ్చుకొని రండు!” అని. ఈ సంఘటనకు ముందే మల్లసు పర్వతం వద్ద మరో సంఘటన జరిగింది.. జయసేనుడు, వామదేవుడు చూపించిన శౌర్యానికి, ఓడ సిబ్బంది తెగింపు తోడు కావడంతో సముద్రపు దొంగలు సగం సముద్ర దేవతకు బలి అయిపోగా, మరో సగం కాలికి బుద్ధి చెప్పి కనిపించకుండా పోయినారు. రెండు వైపులా శత్రువులను తరిమికొట్టిన జయసేనుడు, వామదేవుడు మళ్లీ పూర్వపు స్థానానికి చేరుకున్నారు. “నాయన గారు కనిపించినారా?” ఆందోళనను అణచుకుంటూ అడిగినాడు జయ ఆశగా. “లేదు జయా!” దేవ సమాధానం. “మా మనుషులకు ఆయన గురించి తెలుస్తుంది..” అంటూ చివరి ఆశతో చుట్టూ కలయ చూసినాడు
జయసేనుడు. ఓడ మీద ఒక మూలన గాయాలతో మూలుగుతూ కనిపించినాడు ఒక సేవకుడు. అతణ్ని సరిగ్గా అప్పుడే వామదేవుడు కూడా చూసినాడు. ఇద్దరూ ఒక్క ఉదుటున అక్కడికి చేరుకున్నారు. జయసేనుడు అతణ్ని గుర్తుపట్టినాడు. “మావురాయా!” అతని తలను ఒడిలోకి తీసుకున్నాడు. “నీకేం కాదు..” అంటుంటే కన్నీళ్లు ఆగలేదు ఇద్దరికీ. మావురాయడు గాయాలతో నెత్తురు ముద్దగా మారిపోయి, కళ్లల్లో ప్రాణాలు నిలుపుకొని ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో తండ్రి గురించి అతణ్ని అడగాలా, వద్దా అన్న సంశయంలో కొట్టుమిట్టాడుతున్న జయ అంతరంగాన్ని చదివినట్లే అతనిట్లా అన్నాడు.. “ప్రభూ! నా ప్రాణాల గురించి ఆలోచించకండి. ముందు నాయనగారిని దక్కించుకోండి!” అన్నాడు ఆయాస పడుతూ. మావురాయడు ఊపిరిపోయే సమయంలో జయసేనుని ఆశలకు ఊపిరి పోసినాడు. “మావురాయా! ఎక్కడ మా నాయన?” అడిగినాడు ఆతృతగా.
“మూడు వారాల నాడే రాజభటులు వచ్చి బంధించి తీసుకొని పోయినారు చిన్నరాజా..” అన్నాడు మావురాయుడు ప్రాణాలు విడుస్తూ. “పెద్ద శ్రేష్ఠి గారిని నేను చూసినాను. ఇంతవరకూ ఇక్కడనే ఉన్నారు. ఇప్పుడే ఆయనను బలవంతంగా చిలుకవాడ వైపు తరలించినారు” అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన ఒక సారంగు. అతను ఆ మాట అంటుండగానే రాజభటుల్లో ఒకడు సర్రున దూసుకొని వచ్చి అతని తలను మొండెం నుంచి వేరు చేసి, అంతే వేగంగా పరుగెత్తినాడు. ఈ హఠాత్ పరిణామానికి మిత్రులిద్దరూ విస్తు పోయినారు. ముందుగా తేరుకున్న జయ.. “దేవా! నేను వాని సంగతి చూస్తా! నీవు ఆలస్యం చేయకుండా చిలుక వాడకు వెళ్లి నాయన కోసం వెతుకు!” అంటూనే ఆ రాజభటుణ్ని వెంబడించినాడు జయసేనుడు. వామదేవుడు గుర్రం ఎక్కినాడు. వాళ్లు బయలుదేరిన మరుక్షణం అక్కడికి ఒక యువకుడు వచ్చినాడు. వాని పేరు మిహిరుడు, సౌగంధిక పంపగా వచ్చినాడు. పోదన యువకుల కోసం అక్కడ వెతుక సాగినాడు.
“చంద్రా! నేను బాధ నుంచి పూర్తిగా తేరుకున్నాను. ఇక నా స్వామి కార్యం పూర్తి చేయవలసి ఉంది” మునిపల్లె నుంచి తిరుగు ప్రయాణంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు అన్నాడు పోటిసుడు. ఆ ఒక్క మాటతో చంద్రహత్థి గుండె బద్ధలైంది. తన ప్రాణాలు ఎవ్వరో పిండేస్తున్న అనుభూతి కలిగింది. కళ్లు వర్షించే మేఘాలైనాయి. చంద్రహత్థి నుంచి జవాబు రాకపోవడంతో ఆశ్చర్యం నిండిన అనుమానంతో ఆగి, ఆమె ముఖం చూసినాడు పోటిసుడు. అతని చూపు తగలగానే ఆమె కళ్లు కట్ట తెగిన చెరువులైనాయి. అతన్ని చుట్టుకుని బిగ్గరగా ఏడవ సాగింది. బిత్తర పోయినాడు పోటిసుడు; తర్వాత విషయం అర్థమైంది అతనికి. ప్రేమతో వీపు నిమురుతూ.. “చంద్రా! నేను ఒక పనిమీద మూడు వారాల క్రితం వచ్చినాను. యజమాని వద్ద పనిచేస్తున్న సేవకుణ్ని. నేను నా సేవక ధర్మం నిర్వహించక పోవడం ఆత్మద్రోహం అవుతుంది కదా!” అన్నాడు, అనునయిస్తున్నట్లుగా. ఆమె ఏడుపు ఆపలేదు. అతను చెప్పే మాటలు ఆమె చెవికి ఎక్కలేదు. అసలు వినదల్చుకుంటే కదా.. వదిలితే ఎక్కడ పారిపోతాడో అని బల్లిలా కరుచుకుని పోయింది గట్టిగా. కొంచెం సేపటి తరువాత కౌగిలిని సడలించి హత్థి ముఖాన్ని వేలుతో పైకెత్తి చూసినాడు.
కనుల కొలను నిండి కారుచుండగ బాష్ప వారి చేత ప్రియుని వదన మపుడు చూడజాల లేని చూపులో భావాల కోటి అల్లుకొనెను పోటిసుడిని. (కొలనులైన కళ్లలో నుంచి కారుతున్న కన్నీళ్ల మధ్య ప్రియుని ముఖం ఆమె చూడలేకపోయింది. ఆమెను విడదీసినా కోటి భావాలు ఆ చూపుల ద్వారా అతణ్ని మరింత గట్టిగా అల్లుకున్నాయి) “చంద్రా! రాత్రి శ్రమణకులు చెప్పిన మాటలు మరచిపోయినావా? ఎందుకింత బేలవైపోయినావు?” అంటూ ప్రేమతో ఆమె కన్నీళ్లు తుడిచినాడు పోటిసుడు. కొంచెంసేపటి తర్వాత ఆమె దుఃఖం దిగమింగుకుంటూ ఇట్లా అన్నది.. “ఏమో! ఈ లోకంలో ఎంత బాధనైనా భరించగలను కానీ నీవు నా నుంచి దూరం అవుతున్నావనే మాట తట్టుకోగలిగే శక్తి ఈ గుండెకు లేదు బావా! తాళి కట్టకపోయినా నీవే నా మొగుడివి. కట్టుబట్టలతో నీ వెంట నరకానికైనా వస్తాను. నన్ను విడిచి వెళ్లిపోతానని మాత్రం అనకు!”. ఒక్క క్షణం ఆగి పోటిసుని మాటకు సమాధానంగా మళ్లీ ఇలా అన్నది..
“శ్రమణకుల బోధలు, వేదిక మీద జరిగిన చర్చలు మనసుకు ఎంతో సంతోషాన్నిచ్చినాయి. కానీ ఒక్కసారి వినగానే మనుషులు మారిపోతే ఈ లోకం ఇట్లా ఉండేదా బావా! బుద్ధదేవునికే ఎంతో తపస్సు చేస్తే గానీ జ్ఞానం లభించలేదు. మామూలు మనుషులం మనం. అంత తొందరగా మనసు, బుద్ధి, ఆలోచనలు మారిపోతాయా?” అన్నది.. కౌగిలి నుంచి విడివడి, నడుము చుట్టూ చేతులు చుట్టేసి ముందుకు నడుస్తూ అతనితో. “మనసులో గట్టిగా అనుకో! మార్పు అక్కడనే మొదలైతది” తనతో పాటు నడిపిస్తూ అన్నాడు. “మీరు మగవారు! ఏదైనా తొందరగా మరచిపోగలరు. గౌతమ బుద్ధుడు వెళ్లి పోలేదా? ఆడవాళ్లు అంత కఠినంగా ఉండలేరు; తేలికగా బంధాలు తెంచుకోలేరు” అన్నది. అతని మీద భారం వేసి నడుస్తూ. నిన్నటి వరకు అతణ్ని ఆమె నడిపించింది. ఇప్పుడు ఆమెను అతను నడిపిస్తున్నాడు. మనసు దృఢమైనప్పుడు శారీరక బలహీనతను అధిగమిస్తుంది; మనసు బలహీనమైతే అది శరీరదార్ఢ్యాన్ని కూడా తగ్గిస్తుంది కదా!
పోదన నగరంలో.. ఆ రాత్రి అణులచ్చి వెళ్లినంత వరకూ ఎదురు చూసి, ఆమె పోగానే సిరిసత్తి మందిరానికి వెళ్లింది అలసుద్ది. ఒంటరితనం రోహను పరిపరి విధాలుగా ఆలోచింప జేయసాగింది. అన్నిటినీ మించి భర్త ఎడబాటు ఆమెను విపరీతంగా కుంగదీస్తున్నది. తనది కానిదైన ధనమును గోరుట వైద్య మెరుగనట్టి వ్యాధిఁ బడుట ధనవిహీను బంధు జన మందు తిరుగుట కన్న విరహబాధ మిన్న గాదె (పరుల ధనానికి ఆశపడటం; వైద్యానికి లొంగని జబ్బు బారిన పడటం; కటిక పేదరికంలో బంధువుల మధ్య తిరిగే పరిస్థితి కలగడం.. ఈ మూడింటి కంటే విరహబాధ భరించడమే చాలా కష్టం కదా!).. అనుకుంటూ, దుఃఖిస్తూ కూర్చున్న రోహ వద్దకు ఆ రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత వచ్చింది అలసుద్ది.
“అక్కా! ఇంకా నిద్రపోలేదా?” తనకోసం కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్న రోహను ఆశ్చర్యంగా చూస్తూ అన్నది అలసుద్ది. మలిసంజ తొలిజాము దాటగానే కలవడానికి ఆమె మందిరానికి వెళ్లిన తనతో ఎన్నో విషయాలు మాట్లాడింది పెద్ద రాణి. ఆమె కూడా పుట్టెడు దుఃఖంలో ఉన్నది. ఆ మాటా – ఈ మాట మాట్లాడుతుంటే కాలం తెలిసిరాలేదు. తను వచ్చేటప్పటికి చిన్న రాణి పడుకొని ఉంటుందని; తాను కూడా నిద్రపోయి, తెల్లవారి లేచినప్పుడు అన్నీ తీరికగా చెప్పవచ్చు అనుకున్నది. కానీ.. తాను వచ్చేదాకా ఆమె నిద్రపోకుండా ఉండటమే కాదు.. రెప్పలు కూడా వాల్చకుండా ఉండటం చూసి నమ్మలేనట్లుగా అడిగింది. రోహ సమాధానం చెప్పలేదు సరికదా తెరిచిన కనుగుడ్లు మరింత విశాలం చేసింది. ఒక్కక్షణం ఒళ్లు గగుర్పొడిచింది అలసుద్దికి “అమ్మా! ఏమైంది?” అన్నది భయం, అనుమానం కలగల్సిన గొంతుతో. రోహలో మార్పు లేదు. నిలువు గుడ్లు వేసుకొని అట్లే చూస్తున్నది. “రోహా!” అని గట్టిగా, ఆందోళనగా ఒక పిలుపు హఠాత్తుగా వెనకనుంచి వినిపించగానే.. గుండెలు అవిసిపోయినాయి అలసుద్దికి. పక్కకు తప్పుకొని తలతిప్పి చూసేటప్పటికి.. పెద్దరాణిని పెనవేసుకున్న చిన్నరాణి కనిపించింది. “అత్తమ్మా!” అంటూ పసిపిల్లలా, బిగ్గరగా ఏడుస్తున్నది రోహ. “పిచ్చి పిల్లా! ఎందుకింత బాధ?” అని తల నిమురుతూ ఓదారుస్తూ.. దుఃఖపు నదిగా మారింది సిరిసత్తి. అంతసేపటి భయం ఆ దృశ్యం చూడగానే ఆనందమయం కాగా, కన్నీటి కడవలా మారింది అలసుద్ది.
ముగ్గురి అంతరంగాల్లో విభిన్న భావాలు చెలరేగుతున్నా, మూడింటికి మూలం ఒక్కటే! ఆ ఇంటి ప్రధాన వ్యక్తులు ఇంట్లో లేకపోవడం. ఎక్కడున్నారో, ఎట్లా ఉన్నారో తెలవకపోవడం. ఆ రాత్రి ముగ్గురికీ శివరాత్రే అయింది. జరిగిన సంఘటనలు గుర్తుకు చేసుకొని; జరుగుతున్న పరిణామాలు చర్చించుకొని; జరగబోయే వాటిని ఊహించుకొని; అందుకు చేయదగిన ప్రతిక్రియలను యోచిస్తూ.. గడియలను క్షణాలుగా మారుస్తూనే ఉన్నారు. తెలతెలవారతుండగా కువిందునితో ‘రాణులకు ఎవరూ నిద్రాభంగం కలిగించకూడదని, తాను కూడా ఇంటికి వెళ్లి మలిసంజ వేళకు వచ్చేందుకు మహారాణి గారు అనుమతి నిచ్చినారు’ అని చెప్పి వెళ్లింది అలసుద్ది. ఈ మాట విన్న అణులచ్చి మనసులో ఎన్నో అనుమానాలు పొడసూపినాయి. ఎవరికంటా పడకుండా చిన్నరాణి మందిరం వద్ద కేగి, తెర పక్కకు తప్పించి లోపలి దృశ్యం చూసి బిగుసుకుని పోయింది.
చిన్నరాణి మందిరంలో పెద్దరాణి!
అది కూడా..
మామూలుగా కాదు!
ఒకే మంచం మీద!!
ఒకరి కౌగిలిలో మరొకరు!!!
లోకంలో అత్తా-కోడలు ఎక్కడైనా ఇట్లా ఉంటారా? పసిబిడ్డ తల్లి కౌగిలిలో ఒదిగిపోయినట్లు.. సిరిసత్తి గుండెల్లో తలపెట్టి, ఆమెను అల్లుకొని హాయిగా నిద్రపోతున్నది రోహ; అంతకంటే ప్రశాంత వదనంతో కోడలిని పొదువుకొని గాఢ నిద్రలో ఉన్నది అత్త సిరిసత్తి. ‘వీళ్ల సంబురం మండ!’ కళ్లల్లో నిప్పులు పోసుకున్నది అణులచ్చి. ఆ నిప్పులు నిజంగానే వాళ్లను కాల్చేయగలవని ఆ క్షణం అణులచ్చికి కూడా తెలవదు.
ముగ్గురి అంతరంగాల్లో విభిన్న భావాలు చెలరేగుతున్నా, మూడింటికి మూలం ఒక్కటే! ఆ ఇంటి ప్రధాన వ్యక్తులు ఇంట్లో లేకపోవడం. ఎక్కడున్నారో, ఎట్లా ఉన్నారో తెలవకపోవడం. జరిగిన సంఘటనలు గుర్తుకు చేసుకొని; జరుగుతున్న పరిణామాలు చర్చించుకొని; జరగబోయే వాటిని ఊహించుకొని; అందుకు చేయదగిన ప్రతిక్రియలను యోచిస్తూ.. గడియలను క్షణాలుగా మారుస్తూనే ఉన్నారు.