సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): విదర్భ నుంచి తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సాయంత్రం గ్రేటర్లోని పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 38.4డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 28.4 డిగ్రీలు, గాలిలో తేమ 44శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ద్రోణి ప్రభావంతో గ్రేటర్లోని పలుచోట్ల రానున్న రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు.