‘మఖానా’గా పిలుచుకునే తామర గింజల్లో బోలెడన్ని పోషకాలు ఉంటాయి. ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని కొందరు పచ్చిగా తింటే, కొందరు వేయించుకొని తింటారు. కూరల్లో, స్వీట్లలో వాడుతుంటారు కూడా! ఇన్ని గుణాలు ఉండబట్టి వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే ఇతర దేశాలు, రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవడం తప్ప.. మన దగ్గర మఖానా సాగు ఇప్పటిదాకా లేదు! ఈ లోటును భర్తీ చేస్తూ మన తెలంగాణ రైతులకు ‘మఖానా’ పంటను అందుబాటులోకి తెచ్చారు అధికారులు.
మఖానా పంటకు మన నల్లగొండను క్షేత్రంగా ఎంచుకున్నారు వ్యవసాయ అధికారులు. మఖానా సాగుపై అధ్యయనాన్ని పూర్తిచేసిన జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖ శాస్త్రవేత్తలు, అధికారులు జిల్లాలోని మూడు ప్రాంతాల్లో నారుమడులను సిద్ధం చేశారు. రోజురోజుకూ మఖానాకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఈ అరుదైన పంటను సాగుచేసేందుకు రంగం సిద్ధమైంది. కలెక్టర్ చొరవతో జిల్లాలో అనువైన ప్రాంతాలను ఎంపిక చేశారు. మార్చి నెలలో జిల్లా నుంచి వ్యవసాయ, ఉద్యానశాస్త్రవేత్తలు, అధికారులతో కూడిన బృందం బీహార్‌లోని దర్భంగాకు వెళ్లి మఖానా సాగు, విత్తనం మొదలుకొని పంటకోత ఇలా రకరకాల ప్రక్రియల గురించి అధ్యయం చేసి వచ్చారు. అక్కడి రైతుల అనుభవాలను తెలుసుకున్నారు. పంటసాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చీడపీడలను అరికట్టడం, దిగుబడి తదితర అంశాలపై లోతైన విశ్లేషణ చేశారు. ఆ వివరాలన్నిటినీ పైలట్ ప్రాజెక్టులో భాగంగా సాగుబడి చేస్తున్న రైతులకు వివరించారు. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కంపసాగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం, మల్లేపల్లి ఉద్యాన పరిశోధన కేంద్రంలో ఒక ఎకరం విస్తీర్ణం చొప్పున నారుమడులు పోశారు. అదే విధంగా కనగల్ మండల కేంద్రంలో నర్సిరెడ్డి అనే రైతు అధికారుల ప్రోత్సాహంతో ఎకరం భూమిలో మఖానా సాగును ప్రారంభించారు.
మఖానా పంటకు ప్రత్యేకమైన వాతావరణం అవసరం. నల్లగొండ భూములు, వాతావరణం, నీటి వసతులు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయని అధికారులు అంచనా వేశారు. మఖానా అంటే బీహార్‌లో మాత్రమే పండుతుందనే నానుడిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మూడుచోట్ల ప్రయోగాత్మకంగా సాగు ప్రారంభించామని, ఈ పంట 60 శాతం దిగుబడి వచ్చినా.. ఇతర ప్రాంతాలకు విస్తరించి, రాబోయే రోజుల్లో నల్లగొండ జిల్లాలో మఖానా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నాయని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.
మఖానా విత్తనం చల్లిన తర్వాత రెండు మూడు నెలలు నారుమడి పెంచాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని పంట కొలనులో నాటాలి. ఒక ఎకరం సాగుకు 10 కేజీల విత్తనం అవసరం అవుతుంది. విత్తనాలను నవంబర్- డిసెంబర్ నెలల్లో చల్లుతారు. నారుమడి నుంచి పంట కోత వరకు మొత్తం 8 నెలల సమయం పడుతుంది. ఈ పంట సాగుకు ఎకరానికి రూ.60 వేల నుంచి రూ.70 వేలు ఖర్చు అవుతుంది. సుమారు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల ఆదాయం వస్తుందని అంచనా. ఖర్చులు పోనూ ఎకరానికి లక్షన్నర వరకు వరకు ఆదాయం సమకూరుతుందని అధికారులు చెబుతున్నారు. పైలట్ ప్రాజెక్టులో మెరుగైన ఫలితాలు వస్తే.. ఈ పంటను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడిస్తున్నారు. మొత్తానికి కొత్తగా పరిచయమైన మఖానా నల్లగొండలో మంచి దిగుబడి సాధించి, మన రాష్ట్రంలో మరిన్ని చోట్ల వేళ్లూనుకోవాలనీ, రైతులకు మంచి లాభాలను అందించాలని మనమూ కోరుకుందాం.
..? మజ్జిగపు శ్రీనివాస్‌రెడ్డి