Krishify | ఏ రుతువులో ఏ పంట మంచిది? తెగుళ్ల నివారణకు ఏ మందులు వాడాలి? మద్దతు ధర ఎంత ఉంటుంది? ఎంతవరకు గిట్టుబాటు అవుతుంది?.. ఇవన్నీ ఈ వేదిక మీద రైతులు నిత్యం చర్చించుకుంటారు. ఒకప్పుడు పొలం గట్లకే పరిమితమైన ఈ ముచ్చట్లను ఇప్పుడు ‘కృషిఫై’ యాప్‌లో మాట్లాడుకుంటున్నారు. రైతును కోటీశ్వరుడిని చేయడమే తమ లక్ష్యమని అంటున్నారు ‘కృషిఫై’ వ్యవస్థాపకులు.

ఒకప్పుడు, సంప్రదాయ వ్యవసాయమే ఆధారం. తాత ముత్తాతలనాటి పద్ధతులే దిక్కు. ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. ఆ మార్పును మామూలు రైతులకు అందిస్తుంది.. ‘కృషిఫై’. ఇది పక్కా రైతుల యాప్. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుని.. పొలానికి సంబంధించిన సమగ్ర సమాచారం నమోదు చేస్తే చాలు. పంట సమస్యలు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలు, సర్కారీ పథకాల గురించి తోటి రైతులతో, నిపుణులతో చర్చించే అవకాశం కల్పిస్తుంది. తాజా వ్యవసాయ పద్ధతులు, సబ్సిడీల సమాచారమూ అందిస్తుంది. లాభదాయకంగా పంటలు పండిస్తున్న నవతరం రైతులతో చర్చా వేదికలు ఏర్పాటు
చేస్తుంది. ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు, పశువులు మొదలైనవాటి ధరవరలు యాప్‌లో ఉంటాయి. ఒకరకంగా ఇది రైతుల ఫ్లిప్‌కార్ట్ కూడా. నాగలి నుంచి ట్రాక్టరు వరకూ అన్నీ ఆన్లైన్లో ఆర్డరు చేయవచ్చు. తెగుళ్ల నుంచి పంటను రక్షించుకోవడానికి అనుసరించాల్సిన మార్గాలనూ నిపుణులను అడిగి తెలుసుకోవచ్చు.

ప్రతి దశలోనూ
గురుగ్రామ్ కేంద్రంగా ఏర్పాటైన స్టార్టప్ ఇది. అరవై లక్షల మంది రైతులు ఇందులో సభ్యులు. ఈ యాప్‌ను ‘ఇండియన్ ఫార్మర్స్ ఫేస్బుక్’ అనీ పిలుస్తున్నారు. ఇప్పటికే అతిపెద్ద వ్యవసాయ కమ్యూనిటీగా గుర్తింపుపొందింది. రాజేష్ రంజన్ ఈ స్టార్టప్ సహ-వ్యవస్థాపకుడు. తనది బిహార్‌లోని రైతు కుటుంబం. పెట్టుబడి డబ్బులు లేక, సమయానికి అప్పు పుట్టక, పుట్టినా వడ్డీతో సహా తడిసి మోపెడైతే తీర్చలేక.. రైతన్న పడే కష్టాలను చూశాడు. ఓ రైతుబిడ్డగా అనుభవించాడు. ఆ ఆవేదనలోంచే ఈ వ్యాపార ఆలోచన పుట్టింది.

భారతదేశంలో సగటు రైతు ఆదాయం నెలకు ఆరున్నరవేలు మాత్రమే! సాధారణ కార్మికుడి వేతనం కంటే కూడా తక్కువే. దీనికి కారణం.. తనకు సేద్యంలోని కొత్త పోకడలు తెలియవు. ప్రపంచానికి గూగుల్ రూపంలో గుట్టలు గుట్టలుగా అందుతున్న సమాచారం, రైతులకు మాత్రం చేరడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి రైతు-కేంద్రీకృత నెట్వర్కింగ్ కమ్యూనిటీ అవసరమని అనుకున్నాడు. తన ఆలోచనను మిత్రులతో పంచుకొన్నాడు. దేశవ్యాప్తంగా రైతులను అనుసంధానం చేసేలా ‘కృషిఫై’ యాప్‌ను రూపొందించాడు. ఈ కృషిలో తన ఐఐటీ క్లాస్మేట్స్ అవినాశ్ కుమార్, మనీశ్ అగర్వాల్‌లను కూడా భాగస్వాములను చేసుకున్నాడు. ఇప్పటికే అనేకమంది ఇన్వెస్టర్లు ఇందులో పెట్టుబడి పెట్టారు. ‘వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధ ప్రవేశించే రోజూ ఎంతో దూరం లేదు. రాబోయే రెండేళ్లలో 100 కోట్ల మంది రైతులను చేరుకోవడం మా తక్షణ లక్ష్యం. రైతును కోటీశ్వరుడిని చేయడమే మా తక్షణ కర్తవ్యం’ అంటాడు రాజేశ్ రంజన్ మహా పట్టుదలతో.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
రైతులకు అండగా తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు.. వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసా
వ్యవసాయం చేస్తున్న డాక్టర్.. గవర్నర్ ఇంటికి కూడా ఈయన పండించిన బియ్యమే వెళ్తాయి
అన్నదాతకు అండగా వరంగల్ జిల్లా మహిళలు.. ఏం చేస్తున్నారంటే..”
లోకల్ యాప్ మొదలైంది కోదాడలోనే అని తెలుసా?”