Lokal App | మన పల్లెలో ఏం జరిగింది? పక్క గ్రామంలో పరిస్థితులు ఏమిటి? మండలంలో రాజకీయాలు ఎలా ఉన్నాయి? మన జిల్లా వార్తలు, విశేషాలు ఏంటి?.. అమెరికాలో ఉన్నా సరే, స్థానిక అంశాల పట్ల ఆసక్తి పెరుగుతుందే కానీ తగ్గదు. ఆ మట్టివాసనే పెట్టుబడిగా రూపొందిన ‘లోకల్ యాప్’ కోదాడలో పురుడు పోసుకుందని ఎంతమందికి తెలుసు?
బాల్య స్నేహితులు, కాలేజీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్, కొలీగ్స్.. ఎన్నో వాట్సాప్ గ్రూపులు. నిత్యం పోస్టులు, ఫార్వర్డ్లు, కామెంట్లు.. ఉండనే ఉంటాయి. అయితే, ఒక మండల వ్యాప్తంగా స్థానిక వార్తలకే పరిమితమైన గ్రూపు ఉంటే ఎలా ఉంటుంది? అన్న కోణంలో ఆలోచించారు జానీబాషా, విపుల్ చౌదరి. అలా సూర్యాపేట జిల్లాలో.. కోదాడ మండలానికి సంబంధించి ‘లోకల్’ గ్రూపు ఏర్పాటైంది. తామే అడ్మిన్స్‌గా ఉంటూ.. వివిధ గ్రామాల్లోని యువతను చేర్చుకున్నారు. ఏరోజు సంఘటనలను ఆ రోజు వివరాలు, ఫొటోలతో సహా గ్రూపులో పోస్టు చేసేవారు. కొంతకాలానికి, ఇదే కాన్సెప్ట్‌తో ఒక యాప్‌ను తీసుకొచ్చి, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో తాజా వార్తలను అందిస్తే ఎలా ఉంటుంది? అన్న ఐడియా బుర్రలో మెరిసింది. కోదాడలో గ్రాండ్ సక్సెస్ అయిన
‘లోకల్’ పేరుతోనే యాప్ క్రియేట్ చేశారు. వార్త లకు, విశేషాలకు వేదికగా మార్చారు. ఆ యాప్ ఇప్పుడు లాభాల పంట పండిస్తున్నది. వందమందికి ఉపాధిని ఇస్తున్నది.
మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వార్తా, విశేషాలను ఎప్పటికప్పడు తాజాగా అందిస్తుంది ‘లోకల్ యాప్’. ఈ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకున్నవారి సంఖ్య కోటికి పైనే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ర్టాల్లో కూడా స్థానిక భాషల్లో సేవలు అందిస్తున్నది. తాజాగా మహారాష్ట్రకూ పాకిపోయింది. ప్రస్తుతం 150 జిల్లాలకు చేరువై వార్తా సేవలను దేశమంతా విస్తరిస్తూ.. కార్యాచరణతో దూసుకెళ్తున్నారు జానీబాషా, విపుల్ చౌదరి. మెట్రోనగరాలు మినహా అన్నిచోట్లా జనం స్థానిక వార్తల పట్ల ఆసక్తి చూపుతుండటంతో, 30 శాతం యాప్ డౌన్లోడ్లు గ్రామీణ భారతంలోనే జరుగుతున్నాయి.
‘లోకల్’లో ఎంతోమంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటివరకు రూ.13 వందల కోట్లు సమకూరాయి. దీంతో మరో వందమంది సాంకేతిక నిపుణులను నియమించుకునేందుకు సిద్ధంగా ఉందీ సంస్థ. ఫోర్బ్స్ ఆసియా అండర్-30లోనూ వ్యవస్థాపకులకు చోటు లభించింది. ‘నాస్కామ్ ఎమర్జ్ 50’ వంటి అవార్డులు సైతం అందుకున్నారు ‘లోకల్’ హీరోలు జానీబాషా, విపుల్ చౌదరి.
లోకల్ యాప్ ఆదాయం గత ఏడాది కాలంలో పది రెట్లు పెరిగింది. త్వరలోనే స్థానిక ఉత్పత్తులు, బ్రాండ్లకు లోకల్ యాప్ వేదికగా ప్రచారం కల్పించనున్నారు. అలాగే కొనుగోలు, అమ్మకాలకు మధ్యవర్తిగా ఉంటూ ప్రజలకు మరింత చేరువయ్యేందుకూ ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రాంతీయ భాషలో అమెజాన్ లాంటి ఓ వ్యవస్థను కూడా రూపొందిస్తున్నారు. నిత్య జీవితంలో భాగమైన నిత్యావసరాల ధరలు, వ్యవసాయ పద్ధతులు, పంట మార్కెటింగ్, ఉద్యోగ అవకాశాలు, మ్యాట్రిమోనీ, విద్య, నైపుణ్యం- శిక్షణ, క్లాసిఫైడ్ యాడ్స్, రియల్ ఎస్టేట్ వంటి వివిధ అంశాలను అందిస్తున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌ను గ్రామీణ ప్రజల అవసరాలు తీర్చే ఓ వేదికగా రూపొందించడమే తమ లక్ష్యమని చెబుతున్నారు జానీ, విపుల్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Jobs | నిరుద్యోగులకు ఓ ఉపాధ్యాయుడి కానుక.. లైబ్రరీ, వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి మరీ..
వాచ్‌మన్ నుంచి IIM ప్రొఫెసర్ దాకా.. కేరళ యువకుడి సక్సెస్ స్టోరీ
ఒకప్పుడు స్కూల్ డ్రాప్ అవుట్.. ఇప్పుడు మల్టీ మిలియనీర్.. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా?
కన్నబిడ్డలు కాదనుకున్న అమ్మానాన్నలకు కొడుకు అయ్యాడు
Gudipadu | తెలంగాణలోని ఈ గుడిలో గిరిజనులే పూజారులు
మరో పతంజలి పంకజ కస్తూరి నాయర్
కొడుకును కోల్పోయినా.. వందలాది బిడ్డలకు ప్రాణం పోస్తున్నాడు..