తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఒకసారి కరెంటు కష్టాలు తీవ్రమయ్యాయి. నిరసనగా రాజీవ్ రహదారి దిగ్బంధానికి కేసీఆర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట సమీపంలో తాను స్వయంగా రోడ్డుపై బైఠాయించారు. చుట్టుపక్కల మందపల్లి తదితర అనేక గ్రామాల ప్రజలు, మహిళలు ఆందోళనలో పాల్గొన్నారు. ఆ సమయంలో పలువురు వృద్ధ మహిళలు, పురుషులు అక్కడికి వచ్చి, పక్కనే కూర్చుని ఆప్యాయంగా కేసీఆర్ భుజంపై చేయి వేసి, ‘ఇగ అటే పోతవా! కనబడుడే లేదు. ఇటాంకల వచ్చుడే కరువైంది.
నువ్వు ఉద్యమం అని తిరుగుతే మరి మా గోసెవలు సూడాలె?’ అని ఆత్మీయంగా అడుగుతున్నారు. ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు అక్కడికి వచ్చిన ప్రొఫెసర్ జయశంకర్ ఈ దృశ్యాన్ని చూసి, ‘ఒక రాజకీయ నాయకుడితో ప్రజలు ఇంతగా మమేకవడమా?’ అని ఆశ్చర్యపోయారు.
ఆ ప్రాంత ప్రజలతో తనకున్న అనుబంధం అలాంటిదని కేసీఆర్ ఆయనకు జవాబిచ్చారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో ప్రతి పల్లె ఆయనకు తెలుసు. ఎక్కడికి వెళ్లినా పదిమందిని పేరు పెట్టి పలకరిస్తారు. అద్భుతమైన జ్ఞాపకశక్తి ఆయనది. ఎవరినైనా మనం పరిచయం చేస్తూ, పేరు తప్పు చెప్తే, ‘ఆయన పేరు అదికాదు, ఇది’ అని సరిచేసిన సందర్భాలు లోకల్ ఎమ్మెల్యేలకే అనేకం తారసపడుతుంటాయి. ఆయన అందరి మనిషి. ఆయన మనసు అందరిపైనా ఉంటుంది.
అందరినీ కలుపుకొని పోయే తత్వం ఆయనది. ఈ తత్వమే కేసీఆర్ను అందరివాణ్ని చేసింది. సమాజానికి ఏది అవసరమో బోధించి, ఆ దిశగా నిర్దేశం చేయడం నాయకుడి కర్తవ్యం అంటారు కేసీఆర్. ఉద్యమంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే పంథాను అనుసరించారు. అందుకే ఆయన తెలంగాణ బాపు అయ్యారు. మన రాష్ర్టానికి పెద్ద కాపు అయ్యారు.