జరిగిన కథ : వెలనాడు మండలీశ్వరుడు, మహావీరుడు, కాకతీయ సామ్రాజ్య గజసాహిణి జాయచోడుడు స్వయంగా యుద్ధశంఖం పూరించాడని తెలుగు రాజ్యాలన్నిటా తెలిసిపోయింది. అద్దంకి మహారాజు చక్రనారాయణుడు, పాకనాడు మహారాజు సోమాండినాయడు కూడా కొంత చురుకయ్యారు. కానీ, మత
విద్వేషంతో కళ్లు మూసుకుపోయిన ఆ మహారాజులు, ఆ రాజ్యాల ప్రజలు.. ఏమౌతుందో చూద్దామన్నట్లు యుద్ధప్రయత్నాలను విరమించలేదు. పైపెచ్చు ఉభయులకు మఠాల సహకారం పుష్కలంగా ఉంది. వాళ్లు మరింత ద్వేషాన్ని ఎగదోస్తున్నారు.
ఈ సందర్భంలో అందరినీ తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే!వెలనాడు సైన్యం.. ముందు ఎవరిపైన యుద్ధం చేస్తుంది? యుద్ధ ఫలం ఏమిటి? గెలిచిన రాజ్యం కోరేది ఏమిటి? ఓడిన రాజ్యం ఏమి చెయ్యాలి??
వెలనాడు సందివిగ్రహి మాంకనభట్లు పూర్తిగా జాయ చమూపతి నీడలా ఉంటున్నాడు. ఆయన చెప్పింది తుచ తప్పకుండా రెండు శత్రురాజ్యాల సంధివిగ్రహీలకు తెలియజేస్తూ.. వారి మహారాజుల అభిప్రాయాలు తిరిగి జాయ చమూపతికి నివేదిస్తున్నాడు.ఇప్పుడు తమ్ముణ్ని చూస్తే పృథ్వీశ్వరునికే బెదురు పుడుతున్నది.
తమ్ముడు కోరిందల్లా లిప్తకాలంలోనే ఆజ్ఞలు జారీచేస్తూ పరుగులు పెడుతున్నాడు. ఇక ఇతర నియోగులు, సైన్యాధ్యక్షులు, వేగులు, వార్తాహరులు తిండీతిప్పలు మానేసి.. తమతమ నియోగాల యుద్ధసన్నాహాలలో ఊపిరి సలపకుండా ఉన్నారు. మంత్రులు, మహా సేనానులు, యుద్ధ మంత్రాంగ నిపుణులు ఎల్లప్పుడూ జాయ చమూపతి వెంటే ఉంటున్నారు. ఓరోజు తెల్లవారకే ముందే మండలేశ్వరులు పిలుస్తున్నారు అనగానే ఉరుకులు పరుగులపై వచ్చిపడ్డాడు పృథ్వీ. అప్పటికే మంత్రాంగ నిపుణులతో తీవ్రాలోచనలో ఉన్న జాయపుడు అన్నను చూసి చెప్పాడు.
“అన్నా! జాపిలిసిద్ధి.. వాయువేగ మనోవేగంతో వచ్చి ఇక్కడ వాలాలి!”.
కంగారు పడిపోయాడు పృథ్వీ. తమ్ముడు చెప్పే ఆ జాపిలిసిద్ధి ఎవ్వరో తెలియదు. బాగా తెలిసినవాడు, మనకు బాగా కావాల్సినవాడు అన్నట్లు చెబుతున్నాడేమిటి!?
అన్న వెర్రిముఖం వేయడం జాయపుడు గుర్తించాడు.
“విక్రమ సింహపురం.. తిక్కభూపాలుడు.. మహాకవి తిక్కన మంత్రివర్యులు.. జాపిలిసిద్ధి..”
ఒక్కొకవ్యక్తిని గుర్తు చేస్తున్నట్లు జాయపుడు చెప్పడంతో ఆ సదరు జాపిలిసిద్ధి గుర్తొచ్చాడు పృథ్వీకి.
“ఆ.. గుర్తొచ్చాడు. నెల్లూరు పాలకుడు తిక్కకు జ్ఞాతిసోదరుడు. నీ స్నేహితుడు. గొప్ప యోధుడని నువ్వూ బావగారూ ఎప్పుడూ తలచుకుంటారు. కదూ!”.
“అద్గది. బాగా గుర్తు పెట్టుకున్నావ్ అన్నా. వాణ్ని నా మాటగా చెప్పి వెనువెంటనే రప్పించాలి..”
వేగంగా బయటికి పరుగుతీశాడు పృథ్వీ. అన్నట్లుగానే మరి మూడురోజుల్లో నెల్లూరు నుంచి వచ్చి జాయపుణ్ని గట్టిగా వాటేసుకున్నాడు జాపిలిసిద్ధి.
“మిత్రమా ఎన్నాళ్లకెన్నాళ్లకు..?!” ఇద్దరూ ఆత్మీయంగా హత్తుకున్నారు.
“నెల్లూరులో మేము కష్టాలలో ఉన్నప్పుడు నువ్వు ఆఘమేఘాల మీదొచ్చి మాకు అండగా నిలబడ్డావు. ఇప్పుడు నువ్వు పిలిస్తే మేము రాకుండా ఎలా ఉంటాం జాయపా?” అన్నాడు ఆశీనుడవుతూ.
“అయినా నువ్వు కాకతీయ సామ్రాజ్యానికే గజసాహిణివి. నీకు మా అవసరం ఏర్పడటం మా అదృష్టం. చెప్పు.. ఈ బృత్యుడు నీకు చేయగల బుడుత సాయం ఏమిటో?” అన్నాడు కూడా.
“ఇటీవల అనుమకొండ వెళ్లినప్పుడు.. ‘నీ మిత్రుడు ఇప్పుడు వెలనాడు మండలేశ్వరుడు. ఆయన పాలన ఎలా ఉందో తెలుసుకుంటున్నావా జాపిలీ!’.. అని అడిగారు మహామండలేశ్వరులు”.
ఇలా హాయిగా, ఆత్మీయంగా గలగలా మాట్లాడటం జాపిలిసిద్ధి నైజం. అతని శక్తియుక్తులు క్షుణ్నంగా జాయపునికి తెలుసు. జాపిలి ప్రస్తుతం అద్దంకిసీమకు ఆవలి సరిహద్దు సీమను పాలిస్తున్నాడు.
ఇది తెలిసే జాయపుడు జాపిలిసిద్ధిని పిలిపించాడు.
విషయం విని సాలోచనగా అన్నాడు జాపిలి.
“చాలా చిన్నసమస్య జాయపా. కానీ, ఈ మతతత్త్వం పెద్ద మహమ్మారి. ఇప్పుడు దక్షిణాపథం, దక్షిణావర్తం.. అంతా వైష్ణవగోల. మేము కూడా శైవులమే! కానీ మహాకవి మా తిక్కనామాత్యులు హరిహర తత్వవేత్తలు కదా. కాబట్టి మేము ఏ మతానికీ వత్తాసు పలకం. నీ స్నేహం మేరకు ఏమైనా చేస్తా. అద్దంకిసీమ పాలకుడు చక్రనారాయణుడ్ని ఉక్కిరిబిక్కిరి చెయ్యమంటావా?”.
“ఆయన ఆ స్థాయి దాటిపోయాడు. సాక్షాత్తూ వెలనాడు మండలేశ్వరుడైన నేనే, మీరు చేస్తున్నది తప్పు అంటే కూడా భయపడకుండా యుద్ధానికి సిద్ధమయ్యాడు..” వివరించాడు జాయపుడు.
“అబ్బో.. అంత బలిసిందా ఆయన గారికి!?.. ఊ.. మరి పాకనాడువారి బలుపు ఏమిటి?”.
“ఒక్కటే. మత పిచ్చి. అది కళ్లు కనిపించకుండా చేస్తున్నది. ఆయన కూడా యుద్ధమంటే భయపడటం లేదు..”
“ఈ మత పిచ్చిగాళ్లు యుద్ధంవల్ల మారతారా.. ప్చ్! ఏమో నాకైతే నమ్మకంలేదు. అయితే కాకతీయ సామ్రాజ్యంలో రాజ్యాలమధ్య ఇలాంటి ఘర్షణలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు. యుద్ధంలో నువ్వు చెప్పిన పాత్ర పోషించడానికి సర్వదా సిద్ధం జాయపా..”
“నువ్వే సర్వసైన్యాధ్యక్షుడివిగా యుద్ధానికి సారథ్యం వహించాలి జాపిలి..” అభ్యర్థించాడు జాయపుడు.
లిప్తకాలం అందరితోపాటు జాపిలిసిద్ధి కూడా ఆశ్చర్యంతో ఉండిపోయి అనంతరం అందరి జయజయద్వానాలు అందుకున్నాడు.. కించిత్ నిబిడాశ్చర్యంతో.
జాపిలిసిద్ధిని శాస్ర్తోక్తంగా సర్వసైన్యాధ్యక్షుడిని చేశాక జాపిలి, పృథ్వీ యుద్ధసన్నాహాలు ముమ్మరం చేశారు. కానీ, ఆరోజు నుంచి జాయపుడు మళ్లీ వారికి కనిపించలేదు.
జాపిలి అడిగాడు పృథ్వీశ్వరుని..
“పృథ్వీ.. జాయపుడు ఎక్కడ?”.
“ఏమో. తెలియదు సోదరా!”.
“అదేంటి?”.
“అవును. జాయపుడు ఎక్కడెక్కడో కళాప్రపంచంలో సంచరిస్తాడు. పరిశీలిస్తాడు. జీవిస్తాడు. ఆ వివరాలేమీ నాకు తెలియదు”.
నోరు వెళ్లబెట్టాడు జాపిలిసిద్ధి.
“అయ్యో! అవతల తలకెత్తుకున్నది యుద్ధం. ఈ సమయంలో కూడా కనిపించకుండా పొతే.. తమ్ముడు కదా.. అడగవా?”.
“వాడు తమ్ముడేంటి.. దేవుడు!!”.
చెబుతున్నప్పుడు పృథ్వీ కళ్లలో మెరుపు చూశాక మరేమీ అడగలేదు జాపిలిసిద్ధి.
యుద్ధ శంఖం పూరించడానికి మరో మూడుమాసాల సమయం పట్టింది.
అప్పుడు.. మూడు మాసాల అనంతరం సర్వం యుద్ధానికి సిద్ధమయ్యాక మళ్లీ ప్రత్యక్షమయ్యాడు వెలనాడు మండలేశ్వరుడు జాయచోడుడు.
సంప్రదాయం ప్రకారం యుద్ధం ప్రకటించిన రాజ్యం యుద్ధకారణం చెబుతూ సంధివిగ్రహి ద్వారా చివరి సంధి ప్రతిపాదన పంపాలి. తొలుత మంకనభట్లును సంది ప్రతిపాదనతో మొదట అద్దంకిసీమకు పంపాడు. తర్వాత పాకనాడుకు..
“మత భావనలు రాజ్యపాలకుల ప్రధానవిధి కాదు. రాజ్యంలో మత ఘర్షణలు పెచ్చరిల్లినప్పుడు పాలకులుగా అమాయకులను రక్షణగా నిలవాల్సిన మీరు శాంతియత్నాలు చేయడం పోయి మీరే మత ఘర్షణలు మరింత పెంచి.. అమాయకులు ముఖ్యంగా.. అద్దంకిసీమలో వివిధ రంగాలలో పనిచేస్తూ పొట్టపోసుకుంటున్న మా రాజ్య ప్రజల మరణాలకు కారణమయ్యారు. ఇకనైనా మీ దుష్క్రుత్యాలను ఆపండి. లేదా మీరు శాంతిమంత్రం పఠించే వరకు మీపై యుద్ధం ఆగదు. ఇది కాకతీయసామ్రాజ్యచక్రవర్తి శ్రీశ్రీశ్రీ గణపతిదేవుల తరఫున వెలనాడు మండలీశ్వరుడు జాయ చోడమహారాజు పంపిన సందేశం. మీ స్పందనను కోరుతున్నవాడు.. సంధివిగ్రహి మంకనభట్టు!”
“ఇది పూర్తిగా మా రాజ్య సార్వభౌమాధికారంలో కలగజేసుకోవడమేనని మేము భావిస్తున్నాం. మీ రాజ్యప్రజలకు రక్షణలేదు అని భావిస్తే మీ రాజ్యప్రజలు మా రాజ్యంలో ఉండనక్కరలేదు. తక్షణమే వారు మా రాజ్యాన్ని విడిచి వెళ్లిపోవచ్చు. మీరు మాపై ఎలాంటి దండయాత్ర చేయడానికీ మేము అంగీకరించం. అలాంటి దుందుడుకు చర్యలను మేము ఎదుర్కోగలం. మీరు దండయాత్ర చేస్తే తగిన శాస్తి చేయగలం!”
అద్దంకి చక్రనారాయణ మహారాజు, పాకనాడు సోమాండినాయడు వేరు వేరుగా ఇచ్చిన జవాబు..
దాదాపుగా ఒక్కటే!
యుద్ధం తప్పలేదు. ఎక్కడైతే ఆ దేవాలయం ఉన్నదో.. అంటే అ రెండురాజ్యాల పొలిమేరలో చిగురుపాడు గ్రామం వద్ద యుద్ధక్షేత్రం సిద్ధంచేసి యుద్ధస్థంభం నాటి.. వెలనాడు సర్వసైన్యాధ్యక్షుడు జాలిపిసిద్ధి, అద్దంకి సర్వసైన్యాధ్యక్షుడు కదిరీపతి తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్నారు.
అనంతరం యుద్ధకాహళి ఉద్రిక్తంగా మోగింది.
విక్రమపై పూర్తి యుద్ధవీరునిలా వచ్చాడు వెలనాడు మండలేశ్వరుడు జాయచోడుడు.
“గతంలో యుద్ధాలకు ఈ యుద్ధానికి తేడా ఉంది. ఇది మతఘర్షణలు వద్దు అని తెలియజేయడానికి మతమత్త చిత్తులైన ఇద్దరు మహారాజుల పీచమణచడానికి జరుపుతున్న యుద్ధం. ఈ సందర్భంగా నేనోక ప్రతిపాదన చేస్తాను. ఈ దేవాలయంలో రుద్రుడు ఉండాలని పాకనాడువారు, కాదుకాదు విష్ణువు ఉండాలని అద్దంకి వారు యుద్ధానికి సిద్ధపడ్డారు. శాంతికోసం వెలనాడు యుద్ధానికి వచ్చింది. నేను ప్రతిపాదించేది ఏమంటే ఆ ఇద్దరు దేవతలు కాకుండా.. అసలు ఈ శిధిలాలయంలో ఉండాల్సిన బుద్ధదేవుని విగ్రహం తిరిగి ప్రతిష్ఠించాలి. ఏమంటారు?”.
యుద్ధక్షేత్రంలో గోల గోల. అందరూ తలోమాటా మాట్లాడసాగారు.
అద్దంకి చక్రనారాయణుడు ఖడ్గమెత్తి..
“విజయం మాదే. మాదే విజయం. జాయ చోడమహారాజు మా అభిప్రాయాన్నే బలపరచారు. బుద్ధుడు మా విష్ణుమూర్తి అవతారాలలో ఒకరు. కాబట్టి ఇది వైష్ణవ విజయం..”
మళ్లీ గోలగోల. ఆశ్చర్యపోయాడు జాయచోడుడు. విగ్రహారాధనే వద్దన్న బుద్ధుడ్ని దేవుడిని చేశారు. ఇప్పుడు చెబితే ఎవడు వింటాడు?! మతపిచ్చికి మందు లేదు. ఆనాడూ ఈనాడూ.
ఎవరి స్కంధావారంలో వారి సైన్యం సిద్ధంగా ఉంది.
రేపు యుద్ధం ప్రారంభం అనగా ముందురోజు సంధ్యవేళ.. రెండు రాజ్యాల యుద్ధముఖ్యులను వెలనాడు స్కంధావారంలోని తన గోల్లెనకు ఆహ్వానించాడు జాయపుడు.
“యుద్ధానికి ముందు కొంత కళాకాలక్షేపం. మూడు రాజ్యాల వీరులంతా మా కూసెనపూండి కళాక్షేత్ర కళాకారుల ప్రదర్శనలను తిలకించాల్సిందిగా మనవి..”
యుద్ధ ఉద్రిక్త, ఉద్వేగాలతో ఊగిపోతున్నతరుణంలో ఈ కళాప్రదర్శనలు ఏమిటో ఎవ్వరికీ అంతుపట్టలేదు. కానీ, కళాప్రదర్శన అంటే జనానికి మతంలాగే అర్థంపర్థంలేని పిచ్చి. అది ఎంతచెత్తగా ఉన్నా నోరువెళ్లబెట్టి చూస్తారు. అందుకు మహామహా సైన్యాధ్యక్షులు కూడా మినహాయింపు కాదు.
అందరూ యుద్ధక్షేత్రానికి వచ్చేసరికి అక్కడొక రంగస్థలం నిర్మించి ఉంది.
అప్పటివరకు ఎవ్వరూ దాన్ని పట్టించుకోలేదు. మహారాజులు, మంత్రులు, సర్వసైన్యాధ్యక్షుడు, మహాసేనానులు, సేనానులు, దళపతులు కలసి ఒక్కొక్క రాజ్యం నుంచి వందమంది పైగా ఉంటారు. సైన్యం పూర్తిగా వీళ్ల చెప్పుచేతల్లో ఉంటుంది కాబట్టి యుద్ధాన్ని తీవ్రంగా ప్రభావితంచేసేది వీరే. ఈ ముఖ్యులందరినీ జాయపుడు తనతో ఆ రంగస్థలం వద్దకు తోడ్కొని వచ్చాడు. అప్పటికే వారికోసం ఆసనాలు సిద్ధపరచి ఉన్నాయి. అక్కడ కళాకారుల్లాంటి కొందరు.. కళాసేవకుల్లా వారికి స్వాగతం పలికారు.
ఆ వేదిక కూడా అద్భుతంగా ఉంది. వేదికకున్న యవనిక, రంగురంగుల తెరలు, ఆ అట్టహాసం.. అచ్చెరువు గొలిపేలా ఉంది. గ్రామాలలో గోతులు తవ్వి ఆ ఎత్తుమీద నాట్యమాడితే గోతులలో కూర్చుని చూడటమే తెలుసు. ధనదుపురం లాంటి చోట ఒకటి, రెండు అత్యుత్తమ రంగస్థల భవనాలను చూశారు కానీ ఇలా బహిరంగ యుద్ధక్షేత్రంలో అలాంటిది ఏర్పాటు చేయడం.. అబ్బురం!
అందరూ ఆసీనులయ్యాక యవనిక తొలిగింది.
రంగస్థలంపై తొలుత ఓ నటుడు వచ్చాడు. తన కళారూపాన్ని ప్రదర్శించడానికి సిద్ధమైనట్లు అందరికీ నమస్కరించి నిలబడ్డాడు. అందరూ ఆశ్చర్యపోతూ చూస్తుండగా.. ఆ నటుడు తన కళారూపం ప్రదర్శన ప్రారంభించాడు. దానిపేరు ‘వాలకం’..
వాలకం అంటే ఒక్క నటుడే ఓ పాత్రతో అభినయం మొదలెట్టి మరో పాత్రలోకి.. తర్వాత మరో పాత్రలోకి.. అలా రకరకాల పాత్రలలోకి మారుతూ ప్రేక్షకులను అలరిస్తాడు. ఇక్కడ తొలుత ఓ శైవభక్తుడిగా అభినయం ప్రారంభించి తరవాత వైష్ణవభక్తుడిగా మారాడు. ముగింపులో హరిహరుడుగా ప్రత్యక్షమయ్యాడు.
-(సశేషం)