Whatsapp | ముప్పై ఏండ్ల క్రితం… ఇల్లు ఎంత ఇరుకుగా ఉన్నా, మూడు తరాలూ కలిసి ఉండేవి. ప్రయాణం ఎంత కష్టమైనా, బంధువుల రాకపోకలు సాగేవి. ఆదాయపు లెక్కలు లేకుండా అనుబంధాలు కొనసాగేవి! అప్పట్లో సలహా ఇచ్చేందుకు, కష్టంలో ఓదార్చేందుకు, బాధలు పంచుకునేందుకు… మనవాడు అనుకునే మనిషి ఎవరో ఒకరు ముందుకొచ్చేవారు. పెద్దవాళ్లను కదిపితే చాలు, ఆంత్రోపాలజిస్టులా వంశవృక్షం మొత్తాన్నీ వల్లె వేసేవారు. కాలం మారిపోయింది. వైశాల్యంతో సంబంధం లేని ఇరుకుతనం, సౌకర్యాలతో కొలవలేని లేమి, సమయాన్ని ఆపలేని నిస్సహాయత! ఇప్పటి కుటుంబాలు చిన్నవి మాత్రమే కాదు… ఒంటరివి కూడా. కానీ ఇప్పుడు ఓ ఊరట కనిపిస్తున్నది. బంధువులంతా కలిసి కబుర్లు చెప్పుకొనే విషయంలో.. వాట్సాప్ గ్రూప్స్ ప్రాధాన్యం పెరుగుతున్నది. ఇది కచ్చితమైన పరిష్కారం కాకపోవచ్చు, కానీ గుర్తించక తప్పని మార్గం. ఇంతకీ ఏమిటీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్? వాటివల్ల ఎలాంటి ఉపశమనం లభిస్తున్నది? అక్కడ ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటి? ఈ అంశాలన్నిటినీ స్పృశించే యత్నమే ఈ కథనం!
స్మార్ట్‌ఫోన్ ఒకప్పుడు విలాసం. ఆ తర్వాత సౌకర్యం. ప్రస్తుతానికి అవసరంగా మారిపోయింది. సమాచారం దగ్గర నుంచి సంపాదన వరకు స్మార్ట్ ఫోన్ల ద్వారా ఎన్నో లావాదేవీలు నడుస్తున్నాయి. గత ఏడాది నాటికే దేశంలో 60 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని అంచనా. ఈ సంఖ్య ప్రతి మూడు నెలలకూ రెండున్నర కోట్ల మేర పెరుగుతూ ఉంటుంది. ‘స్టాటిస్టికా’ అనే సంస్థ అయితే 2023 నాటికి ఏకంగా వంద కోట్ల స్మార్ట్ ఫోన్లు మన దేశంలో మోగుతూ ఉంటాయని ఊహిస్తున్నది. కేవలం స్మార్ట్ ఫోన్లతో మాత్రమే మనం సరిపెట్టుకోవడం లేదు. 4జీ సేవలు కాస్త చవకగానే అందుబాటులోకి రావడంతో… జనం డేటాను కూడా విస్తృతంగా వాడుతున్నారు. ప్రపంచంలో అత్యధికంగా మొబైల్ డేటాను వినియోగిస్తున్నది భారతీయులే. స్మార్ట్ ఫోన్‌తో పాటు వాట్సాప్ వాడకం కూడా పెరిగిపోయింది. ఏకంగా 39 కోట్ల మంది భారతీయులు వాట్సాప్ ఖాతాదారులని లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే ఇది అత్యధికం. మన తర్వాతి స్థానంలో ఉన్న బ్రెజిల్లో కేవలం పదికోట్ల మందే వాట్సాప్ వాడుతున్నారంటే… ఈ మాధ్యమాన్ని ఉపయోగించుకోవడంలో మనం ఎంత ముందున్నామన్నది తెలుస్తుంది. కాల్స్‌తో సహా ఉచితంగా అందే సేవలు, చిన్నపాటి ఫైల్స్ పంపుకునే వీలు, గ్రూప్‌గా ఏర్పడి కబుర్లు చెప్పుకొనే సౌలభ్యం.. లాంటి ఎన్నో అంశాలు వాట్సాప్ విజయానికి దోహదపడ్డాయి. ఇప్పుడిక కుటుంబాలను దగ్గర చేసేందుకు కూడా వీటిని ఉపయోగించుకోవడం విశేషం!
వాట్సాప్ తర్వాత సందేశాలు అందించేందుకు ఎన్నో రకాల యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. గ్రూప్ సభ్యుల పరిమితి విషయంలో కానీ, ఫైల్ సైజులో కానీ వాట్సాప్ కంటే మెరుగైన సేవలనే అందిస్తున్నాయి. కానీ స్మార్ట్ ఫోన్ ఉపయోగించే దాదాపు ప్రతి ఒక్కరి దగ్గరా వాట్సాప్ ఉంటున్నది. ఈ వెసులుబాటే ‘ఫ్యామిలీ గ్రూప్స్’కు బలమైన పునాది.
వాట్సాప్ సందేశాలు అంటే కేవలం ఫార్వర్డ్ మెసేజ్‌లు మాత్రమే కాదు. అందులో రకరకాల వ్యక్తులు ఉండవచ్చు. ఒకరు తమ కష్టాలను పంచుకుంటే, మరొకరు తమకు అందిన సమాచారాన్ని పదిమందికీ పనికిరావాలని అనుకోవచ్చు. ఫలానా పెద్దావిడ పరిస్థితి బాగోలేదు. ఒకసారి చూసిరండి! ప్రభుత్వం నుంచి ఓ పథకం వచ్చింది. మీకు వర్తిస్తుందేమో గమనించండి!… ఇలాంటి సందేశాలు ఫ్యామిలీ గ్రూప్స్‌లో ఉపయోగపడుతున్నాయి.
ఒకప్పుడు 50 ఏండ్లు పైబడిన పెద్దవాళ్లు వాట్సాప్ ఉపయోగించేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి మారుతున్నది. 2018 నాటికే మన దేశంలో వాట్సాప్ వాడేవాళ్లలో ఏడు శాతం మంది 56 ఏండ్లు దాటినవాళ్లే. ఇప్పటికి ఇది పదిశాతం దాటిపోయి ఉండవచ్చు. ఉమ్మడి కుటుంబాల్లో ఉండే అతి పెద్ద లాభం, పెద్దల అనుభవం! ఇది ఫ్యామిలీ గ్రూప్స్‌తో సాధ్యమవుతున్నది. ఆయుర్వేదం నుంచి జీవిత సమస్యలకు పరిష్కారం వరకు గ్రూప్‌లోని పెద్దల నుంచి తగిన సలహా లభించే అవకాశం ఉంది.
దిల్‌సుఖ్‌నగర్‌లో ఉండే గౌతమ్‌కు ఓ రోజు ఫోన్ వచ్చింది. తన పెదనాన్న కొడుకు చాలారోజులు క్యాన్సర్‌తో బాధపడి చనిపోయాడని సమాచారం. తను ఎక్కడ ఉంటాడని ఆరా తీస్తే… సరిగ్గా తన ఇంటికి పది కిలోమీటర్ల దూరమని తెలిసింది. ఇదీ ఇప్పటి బంధాల స్థితి. అన్నదమ్ములు, బాగా చనువుగా ఉండేవారు తప్ప మరొకరి అనుపానులు తెలియని రోజులివి. ‘మేనమామ కొడుకు ఏమవుతాడు?’ అని అడిగినా ఒక క్షణం ఆలోచించే కాలమిది. ఫ్యామిలీ గ్రూప్స్ ఈ సమస్యకు ఓ పరిష్కారం!
ముంబైలోని నగర్కర్ కుటుంబం లాక్డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులపాలైంది. బంధువులంతా ఊళ్లోనే ఉన్నారు. కానీ ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో… ఎవరికి ఏ అవసరమో తెలియలేదు. అందుకని ఓ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుంది. లాక్డౌన్ సమాచారం, కొవిడ్ లక్షణాలు కనిపిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాయం చేసే సంస్థలు.. తదితర సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు, కష్టంలో ఉన్న సభ్యులకు ఆర్థిక సాయం కూడా చేసే ప్రయత్నం జరిగింది. కొన్ని విపత్కర పరిస్థితులలో ఫ్యామిలీ గ్రూప్ ఎంతగా ఉపయోగపడుతుందో చెప్పే ఉదాహరణ ఇది!
వంద మంది ఒక్క చోట చేరితే… అందరి నేపథ్యాలూ ఒకేలా ఉండవు. అందులో ఒకరు వైద్యుడు కావచ్చు. మరో వ్యక్తి విదేశాల్లో స్థిరపడి ఉండవచ్చు. సాంకేతికత మీద పట్టున్న యువత కూడా ఉండవచ్చు. ఒకరు సంప్రదాయవాదులైతే మరొకరు నాస్తికులు కావచ్చు. అలా ఈ గ్రూప్ అన్ని రకాల నైపుణ్యాలు, అభిప్రాయాలు తెలుసుకుని కలబోసుకునే లోకం అవుతుంది.
…సాంకేతికత అలవాటు కానంతవరకూ ఇబ్బందిగానే తోస్తుంది. ఆ తర్వాత మన జీవితంలో భాగమైపోతుంది. ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ కూడా అంతే! టూర్ ప్లాన్ చేసుకోవడం దగ్గర నుంచీ కష్టంలో ఉన్నవారిని పరామర్శించడం వరకూ పరిమితులు లేని వనరుగా మారుతున్నదీ వ్యవస్థ.
తరాలు, ప్రాంతాలు దాటుకుని ఒక చిన్న పెట్టెలో కలుసుకోవడం అద్భుతమైన విషయమే. కానీ దాంతో మనిషి తత్వం అయితే మారిపోదుగా! వారి మధ్య భేదాలు, భేషజాలు అలాగే ఉంటాయి. దాంతో రకరకాల సమస్యలు తలెత్తుతాయి.
‘భారతీయ కుటుంబాల్లో… పెద్దలు చిన్నవారి మీద ఆధిపత్యం చూపించడం, పితృస్వామ్య ధోరణి స్పష్టంగా కనిపిస్తాయి. ఆ కుటుంబాలకు ఆన్లైన్ ప్రతిరూపం అయిన ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లలో కూడా ఇదే ధోరణి కొనసాగుతుంది’ అంటారు ఎ.ఎఫ్.మాథ్యూ అనే సామాజికవేత్త. ఇలాంటి పరిస్థితులు ఇప్పటి తరానికి నప్పకపోవచ్చు. స్వేచ్ఛ, కెరీర్ లాంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేవారికి ఈ గ్రూప్ ఓ బందిఖానాలా తోచవచ్చు.
ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ అంతగా ప్రచారంలో లేని 2017లోనే ‘నమా’ అనే యువతి తను గ్రూప్ నుంచి నిష్క్రమిస్తూ రాసిన సందేశం సంచలనం సృష్టించింది. ‘నకిలీ వార్తలు, అసభ్యమైన హాస్యం, ఇతర దేశాల మీద విద్వేషం లాంటి సందేశాలతో మన చాట్ నిండిపోతున్నది. దీనిపట్ల ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం చూసి… నేను ఈ గ్రూప్‌కు తగననే అభిప్రాయంతో ఇక్కడినుంచి బయటికి వెళ్లిపోతున్నాను’ ఇదీ ఆ సందేశ సారాంశం. నిజంగానే చాలా సందర్భాల్లో ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులు ఫార్వర్డ్ మెసేజ్‌లకు ఆనవాళ్లుగా మారుతున్నాయి. జీవితం పట్ల ఎలాంటి దృక్పథం లేనివారికీ, కాలక్షేపం చేసేవారికీ ఇవి ఇబ్బంది కలిగించకపోవచ్చు. కానీ వాట్సాప్‌ను ఓ సమాచార మాధ్యమంగా భావించేవాళ్లకి మాత్రం కచ్చితంగా ఇబ్బందే!
ఒక సందేశం కంటే నేరుగా ఫోన్ చేసి మాట్లాడటం మేలు. ఫోన్ చేయడం కంటే వ్యక్తిగతంగా కలవడం మరింత ప్రభావం చూపిస్తుందని అంటారు సామాజికవేత్తలు. కానీ ఎంత ముఖ్యమైన విషయాన్నయినా వాట్సాప్‌లో పెట్టేయడం అలవాటైపోయింది. ‘మా ఇంట్లో పెళ్లికి రండి’ అంటూ ఆహ్వానించడం దగ్గర నుంచి ‘మీ అమ్మగారు చనిపోయినందుకు బాధపడుతున్నాను’ అనే సంతాపం వరకూ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ ద్వారా బంధువులకు సందేశాలు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. అది తేలిక కదా అనుకుంటున్నారు. ఇది ఏమంత శుభపరిణామం కాదన్నది నిపుణుల బాధ.
ఒక పెళ్లిలో ఇద్దరు బంధువులు కలుసుకున్నప్పుడు గౌరవంగా పలకరించుకుంటారు. ఫోన్లో మాట్లాడుకునేటప్పుడూ కొన్ని మర్యాదలు పాటిస్తారు. కానీ వాట్సాప్‌లో ఇలాంటి నిబంధనలు మనకు ఇంకా అలవాటు కాలేదు. ఆ రచ్చబండ మీద ఎవరినైనా, ఏదైనా అనేయవచ్చు అనే ధోరణి ఉంది. సహజంగానే ఇది ఎన్నో వివాదాలకు దారితీస్తున్నది. అహాలను గాయపరుస్తున్నది. బంధాలను కూల్చడంతో పాటు ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తెస్తున్నది. హరియాణా సోనిపట్‌కు చెందిన ‘లవ్ జోహార్’ అనే వ్యక్తి… ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో మొదలైన తగాదా వల్లే హత్యకు గురయ్యాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురు కటకటాల వెనక్కి వెళ్లారు.
ఇవాళ ఫలానా సభ్యుడి పెండ్లి రోజు… ఆశీస్సులు అందించాల్సిందే! లేకపోతే గుర్తుపెట్టేసుకుంటారు. ఎవరో మంచి కథను ఫార్వర్డ్ చేశారు. చదవకపోయినా మెచ్చుకోవాల్సిందే. ఇవి కాక మిగతా వాళ్లను న్యూనత పరిచేలా, ఊరించేలా… కొత్త కార్లను, విదేశీయాత్రలను సచిత్రంగా బృందంలో ప్రకటించేవాళ్లకీ లోటు లేదు. ఇవన్నీ కష్టాలే మరి!
సమాచార మాధ్యమం ఏదైనా… రెండువైపులా పదునున్న ఆయుధమే! టెలిఫోన్ల నుంచి ఫేస్బుక్ వరకు సరిగ్గా ఉపయోగించుకుంటే జీవితాలను మార్చేస్తాయి. లేకపోతే కాలాన్ని దిగమింగేస్తాయి. ఇదే మాట వాట్సాప్‌కు కూడా వర్తిస్తుంది. ఓ వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్ తన పరిమితుల్లో ఉంటే కనుక ఓదార్పుగా, అనుబంధాల వారధిగా నిలుస్తుంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల్లో మినీ గ్రూపులూ వచ్చేశాయి. అందులో భర్త-భార్య-పిల్లలు మాత్రమే ఉంటారు. ఆఫీసు నుంచి ఏం తీసుకురావాలో భార్య చెబుతుంది, రాత్రికి ఏం వండాలో భర్త పురమాయిస్తాడు, ప్రస్తుతం తాము ఏ మాల్లో ఉన్నదీ పిల్లలు పోస్ట్ చేస్తారు. అలా ముగ్గురికీ ఓ మాధ్యమంలానూ పనిచేస్తున్నది వాట్సాప్ గ్రూప్. ఇది మంచి పరిణామమా, కాదా అన్న తీర్పు అనవసరం. ఇది ఒకానొక మార్పు. ఆమోదించాల్సిందే. అనుసరించాల్సిందే. ఇంకేదో బలమైన గాలి వీచేదాకా ఈ హవా కొనసాగుతూనే ఉంటుంది.
ఒంటరిగా ఉండేవారికి, పదిమందితో తమ భావాలను పంచుకోలేని సెలబ్రిటీలకు ఈ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్ చాలా భరోసా కల్పిస్తాయి. అందుకే తారలు సైతం తమ ఫ్యామిలీ చాట్స్ గర్వంగా వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి. తన భర్త రణ్వీర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత, దాన్ని కుటుంబం అంతా ఎలా ప్రశంసించిందో చెబుతున్న ఫ్యామిలీ చాట్‌ను బహిర్గతం చేసింది దీపిక పదుకోన్. ప్రియాంక చోప్రా తను ‘చోప్రాస్’ అనే ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో సభ్యురాలిననీ, దూరదూరంగా ఉండే బంధువులంతా ఎప్పటికప్పుడు తమ క్షేమసమాచారాలను ఈ గ్రూప్ ద్వారా పంచుకుంటారనీ చెప్పింది. కరీనా కపూర్, అభిషేక్ బచ్చన్, జాహ్నవి కపూర్… ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులు తమ జీవితంలో అభిన్నమైన భాగమని వెల్లడించారు.
ఫ్యామిలీ వాట్సాప్ బృందాల్లో రకరకాల వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. కొన్నిసార్లు చికాకు కలిగిస్తారు. కొన్నిసార్లు సమస్యల్లోనూ పడేస్తారు. ఉదాహరణకు..
శుభోదయం సుబ్బారావులు : వీళ్లు ప్రతి ఉదయమూ సూర్యుడితో పాటే నిద్రలేచి అందరినీ పలకరించేలా, ఉత్సాహపరిచేలా రకరకాల కొటేషన్లు, ఫొటోలు పెడుతుంటారు. వీళ్లతో ఫోన్ మెమరీ నిండిపోవడం ఖాయం.
స్వీయ చిత్రాల డాబులు : వీళ్లకు తమ జీవితం గురించి తప్ప మరో ఆలోచన ఉండదు. తమ పిల్లలు గీసిన చిత్రాలు, భార్య చేసిన వంటలు అన్నీ ఎప్పటికప్పుడు ఫొటోలు తీసి… తమ కుటుంబంలో ఉన్నంత ప్రతిభ మరెక్కడా లేదని నిరూపించే ప్రయత్నం చేస్తుంటారు.
బ్రేకింగ్ బాబులు : ఒక వార్తను టీవీలకంటే ముందుగా బృంద సభ్యులకు చేర్చాలని వీళ్ల తాపత్రయం. ఆ హడావుడిలో ఒక్కోసారి ఐసీయూలో ఉన్నవారు కూడా చనిపోయారని చెప్పేస్తుంటారు. పెట్రోల్ రేట్ల గురించి, ఓటీటీలో విడుదలయ్యే చిత్రాల గురించి కూడా గొప్పగా ప్రకటిస్తారు.
కంగారూలు: డియోడరెంట్ వాడుతున్నారా, మీకు కేన్సర్ ఖాయం. రోడ్డు మీదకు వెళ్తున్నారా, ఈ ప్రమాదం చూసి జాగ్రత్తగా ఉండండి. చలికాలం చెమట పడుతున్నదా, గుండెనొప్పికి సూచన కావచ్చు… ఇలా నిత్యం ఏదో ఒక హెచ్చరికతో ప్రతి అడుగునూ ఓ ప్రమాదంగా మార్చేస్తుంటారు.
స్పందించే వాళ్లు: ఎవరు ఏ సందేశం పెట్టినా, ఏ ఫొటో పంపినా… వీళ్లు చటుక్కున స్పందిస్తుంటారు. అయితే చాలా సందర్భాల్లో ఈ స్పందన యాంత్రికంగా ఉంటుంది. ఎవరన్నా తమ కష్టం గురించి చెప్పినా ‘గ్రేట్’ అని పెట్టి ఆ తర్వాత నాలుక కరుచుకుంటారు.
జీవనదులు: బృందం స్తబ్ధుగా ఉంటే వీళ్లు భరించలేరు. ‘ఏమిటీ ఎవరూ మాట్లాడటం లేదు?’ అంటూ ఓ బాణం వదులుతారు. లేకపోతే ఎవరో ఒక సభ్యుడిని ‘తిన్నావా?’ అని అడుగుతారు. మొత్తానికి చలనం వచ్చేదాకా ఊరుకోరు.
..వీళ్లే కాదు! గ్రూప్ సభ్యులకు నచ్చుతుందా లేదా అనే ఆలోచన లేకుండా వచ్చిన సందేశాన్ని వచ్చినట్టు ఫార్వార్డ్ చేసేవాళ్లు, ఆరోగ్యానికి సంబంధించిన విశేషాలను వెతికి వెతికి పంచేవాళ్లు, పజిల్స్‌తో మెదళ్లను చిరాకుపెట్టేవాళ్లు, వీడియోలతో గుంపును నింపేవాళ్లు… ఇలా ఒకొక్కరిదీ ఒక్కోతీరు.
చాలామంది దృష్టిలో ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అది మన ఆన్లైన్ కుటుంబం. దానినుంచి నిష్క్రమించడం అంటే అందులో ఉన్న పెద్దల్ని అవమానించడం, చిన్నవాళ్లని లెక్కచేయకపోవడం. అందుకనే చాలామంది ఈ గ్రూపుల నుంచి బయటకు రావాలన్నా రాలేక శాశ్వతంగా మ్యూట్‌లో ఉండిపోతూ ఉంటారు. వాదవివాదాలకూ, శుభాకాంక్షలకూ అతీతంగా స్థితప్రజ్ఞత పాటించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇక వల్ల కాదు అనిపిస్తే ఎలాంటి హడావుడి సృష్టించకుండా బయటకు రావడం ఎలా!
♦ ‘నా ఫోన్లో స్పేస్ చాలా తక్కువగా ఉంటున్నది. రకరకాల వాట్సాప్ గ్రూపుల వల్ల ముఖ్యమైన యాప్స్ మధ్యలోనే ఆగిపోతున్నాయి’ అని చెప్పవచ్చు. లేదా ‘ఇంటి దగ్గర ఇంటర్నెట్ సమస్య’ అని డేటా మీదకు తోసేయవచ్చు. ఎవరినీ నొప్పించకుండా ఉండటానికి ఈ పాటి లౌక్యం తప్పదు.
♦ ‘ఈమధ్య ఎక్కువకాలం సోషల్ మీడియాలో గడిపేస్తున్నాను. కొన్నాళ్లు విరామం తీసుకోవాలని అనుకుంటున్నాను’ అంటూ సోషల్ మీడియా విరామాన్ని ప్రకటించవచ్చు.
♦ నేరుగా అడ్మిన్లను సంప్రదించి, ఇబ్బంది చెప్పుకొని… గ్రూప్ నుంచి తొలగించమని అభ్యర్థించవచ్చు.
♦ తరచూ వాట్సాప్ నోటిఫికేషన్లు రావడం వల్ల ఏకాగ్రత దెబ్బతింటున్నదనీ… అది తమ కెరీర్, చదువుల మీద ప్రభావం చూపిస్తున్నదని బయటకు రావచ్చు.
చివరగా… గత్యంతరం లేదు అనుకుంటే కనుక గ్రూప్ సభ్యుల వల్ల తాము ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చెబుతూ, వారి వైఖరిని మార్చుకోమని సూచిస్తూ నేరుగా వీడ్కోలు తీసుకోవచ్చు. కాకపోతే దాని పర్యవసానాలకు సిద్ధంగా ఉండాలి.
“వాట్సాప్ సహకారంతో యువతకు డిజిటల్ నైపుణ్యాలపై శిక్షణ…”
ఆన్ లైన్ మోసాలను అరికట్టేందుకు వాట్సాప్ సరికొత్త ప్రచారం..”
Meta to Face FTC | ఇన్‌స్టా.. వాట్సాప్ సేల్ తప్పదా.. మెటాకు ఎఫ్‌టీసీ తలనొప్పి?!”