e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News క‌రీంన‌గ‌ర్‌లోని ఈ గుట్ట‌ల‌ వల్లే తెలుగు భాష‌కు ప్రాచీన హోదా వచ్చిందా?

క‌రీంన‌గ‌ర్‌లోని ఈ గుట్ట‌ల‌ వల్లే తెలుగు భాష‌కు ప్రాచీన హోదా వచ్చిందా?

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలోని బొమ్మలమ్మ గుట్ట.. వేల సంవత్సరాల తెలుగు సాహిత్యానికి నిలువెత్తు సాక్ష్యం. ఇటు ఆధ్యాత్మికంగా, అటు చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన ప్రాంతం ఇది. తెలుగుభాషకు ప్రాచీన హోదా రావడానికి దోహదం చేసిన ‘తొలి పద్య శాసనం’ ఈ గుట్టమీదే లభించింది. క్రీ.శ.945లోనే ‘జినవల్లభుడు’ఈ శాసనాన్ని వేయించినట్లు చరిత్ర చెబుతున్నది.

కరీంనగర్‌ నుండి జగిత్యాల వెళ్లే దారిలో కురిక్యాల సమీపంలో బొమ్మలమ్మ గుట్ట ఉన్నది. వేములవాడ చాళుక్య ప్రభువైన రెండో అరికేసరి కాలంలో ‘వృషభాద్రి’ పేరుతో గొప్ప జైనక్షేత్రంగా వెలుగొందింది ఈ ప్రాంతం. రాష్ట్రకూటుల సామంతులైన వేములవాడ చాళుక్యులు క్రీ.శ.750 నుంచి క్రీ.శ.973 వరకు మొదట బోధన్‌ను, ఆ తర్వాత వేములవాడను రాజధానిగా చేసుకొని ‘సపాదలక్ష’ రాజ్యాన్ని (నేటి నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల ప్రాంతాన్ని) పాలించారు. రాజనీతిజ్ఞుడు, విద్యా విశారదుడు, కవిపండిత పోషకుడిగా గుర్తింపు పొందిన రెండో అరికేసరి కాలంలో వేములవాడకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొమ్మలమ్మ గుట్టపై అనేక చారిత్రక నిర్మాణాలు జరిగాయి. కురిక్యాల, గంగాధరల మధ్యనున్న ‘వృషభాద్రి’ గుట్టపై
‘త్రిభువన తిలక’ పేరుతో జైన బసదిని, ‘మదన విలాసము’ పేరుతో ఒక ఉద్యానవనాన్ని జినవల్లభుడు నిర్మించాడు. దానికి సమీపంలోనే ‘కవితా గుణార్థము’ అనే చెరువునూ తవ్వించాడు. పంపకవికి ‘కవితా గుణార్థవుడు’ అనే బిరుదు ఉండేది. ఆ పేరును తాను తవ్వించిన చెరువుకు పెట్టాడు జినవల్లభుడు.

ప్రాచీనతకు సాక్ష్యం

- Advertisement -

గుట ్టపైభాగంలో ‘సిద్ధశిల’గా పిలిచే పెద్దరాయిపైన జైన చక్రేశ్వరీదేవితోపాటు జైన తీర్థం
కరుల విగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రతిమల కింద పద్నాలుగున్నర అడుగుల వెడల్పు కలిగిన రాతిపై ‘పంప మహాకవి’ సోదరుడైన జినవల్లభుడు (నన్నయకంటే వందేండ్ల ముందువాడు) ఓ శాసనాన్ని రాయించాడు. సంస్కృత, కన్నడాంధ్ర పద్యాలతో ఉన్న ఈ త్రిభాషా శాసనం, తెలుగు ప్రాచీన వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. దీని చివరన తెలుగులో చెక్కించిన చివరి మూడు కంద పద్యాలే తెలుగుభాషకు ప్రాచీన హోదాను కట్టబెట్టాయి. తెలుగుభాషలోనే తొలి పద్యాలుగా ఇవి గుర్తింపు పొందాయి. నన్నయ మహాభారత రచనకు వందేండ్లకు పూర్వమే, జినవల్లభుడు ఈ పద్యాలను శాసనాల్లో చెక్కించి చరిత్ర బద్ధం చేశాడు. తద్వారా నన్నయ కన్నా ముందుగానే తెలుగులో పద్య రచన చేసిన‘మహాకవి’గా చరిత్రకెక్కాడు.

‘బొమ్మల’ పేరుతోనే..

గుట్టమీద రాతి శిల్పాలతోపాటు అమ్మవారి (జైన చక్రేశ్వరీ దేవి) విగ్రహం చెక్కి ఉండటం వల్ల స్థానికులు ఈ కొండను ‘బొమ్మలమ్మ గుట్ట’ అని పిలుస్తున్నారు. ఈ గుట్ట వృషభం (ఎద్దు) ఆకారంలో ఉంది. అంతేకాదు, గుట్టపైన వృషభేశ్వరుడి విగ్రహం చెక్కి ఉంది. కాబట్టి, గతంలో ఈ కొండ ‘వృషభాద్రి’, ‘వృషభగిరి’ పేర్లతో ప్రాచుర్యం పొందింది. ఈ గుట్టపై ఉన్న ప్రతీ శిల్పం వందల ఏండ్లనాటి తెలుగు వైభవానికి సాక్ష్యంగా నిలిచింది. గతంలో ఇక్కడ లభించిన 23వ జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడి విగ్రహాన్ని కరీంనగర్‌లోని పురావస్తు శాఖ మ్యూజియానికి తరలించి భద్రపరిచారు. తెలంగాణ ప్రాచీన వైభవానికి అద్దం పట్టే ఈ గుట్టను దర్శనీయ స్థలంగా వృద్ధి చేయాలి.

తొలి కంద పద్యాలు..

జిన భవనములెత్తించుట
జిన పూజల్సేయుచున్కి జినమునులకున
త్తిన అన్నదానం బీవుట
జిన వల్లభుబోలగలరె జిన ధర్మపరుల్‌

దినకరు సరివెల్గుదుమని
జినవల్లభునొట్ట నెత్తు జితన వినచున్‌
మనుజుల్గలరే ధాత్రిన్‌
వినుతిచ్చుడు ననియవృత్త విబుధ కవీన్ద్రుల్‌

ఒక్కొక్క గుణంబు కల్గుదు
రొక్కణ్ణిగాకొక్క లెక్కలేదెవ్వరికిన్‌
లెక్కింప నొక్కలక్కకు
మిక్కిలి గుణపక్షపాతి గుణమణ గుణముల్‌

జినభవనాలు కట్టించడం, జినసాధువుల పూజలు చేయడం, జినమునులకు నచ్చిన భోజనాలు పెట్టడంలో ఇతర జైనులెవ్వరినీ జినవల్లభునితో సరిపోల్చలేం. సూర్యుడితో సమానంగా వెలుగువారు, జినవల్లభునితో సరితూగు మరే కవులూ లేరు. ఒక్కొక్కరూ ఒక్కొక్క సుగుణంతో ఉంటారు. ఆలోచిస్తే జినవల్లభుడే గుణమణి. పైగా ఆయన గుణపక్షపాతి అని ఈ కంద పద్యాల తాత్పర్యం.

-అరవింద్‌ ఆర్య 997 270 270

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

మూడు భాషలకు నెలవుగా ముక్కంటి క్షేత్రం.. మనకు తెలియని వేములవాడ చరిత్ర ఇదీ..

ganesh chaturthi | గణపతి బప్పా మోరియా అని ఎందుకు అంటారు?

ganesh chaturthi | కాణిపాకానికి ఆ పేరెలా వచ్చింది? స్థల పురాణమేంటి?

గాంధారి మైసమ్మ | మేడారం జాత‌రలాగే రెండేండ్ల‌కొక‌సారి జ‌రిగే ఆదివాసీల జాత‌ర గురించి తెలుసా

కృష్ణాష్ట‌మి 2021 | ఆ గుళ్లో పూజ‌లు చేస్తే పిల్లలు పుడ‌తారట‌.. భక్తుల విశ్వాసం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement