సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ): అంతర్రాష్ట్ర మత్తు మాఫియా డాన్ సాకి చక్రపాణి(23)ని ఎట్టకేలకు రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫొర్స్‌మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 1.550కిలోల హషీష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే… కుత్బుల్లాపూర్ ప్రాంతంలోని రంగారెడ్డి నగర్లో జోరుగా హషీష్ అయిల్ అమ్మకాలు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు, శనివారం రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుభాష్ చందర్ తన బృందంతో కలిసి స్థానికంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో హషీష్ ఆయిల్ విక్రయిస్తున్న జనగాం ప్రాంతానికి చెందిన సాకి చక్రపాణి (23)ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇతడిపై ఒడిషాలోని కలిమెలా పోలీస్‌స్టేషన్, ఏటిలోని మోటుగూడ పోలీస్‌స్టేషన్, నగరంలోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదై ఉన్నట్లు ఆబ్కారీ పోలీసులు తెలిపారు. ఈ మేరకు చక్రపాణిని అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి 1.550కిలోల హషీష్ ఆయిల్, 465గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.