సుల్తాన్‌బజార్, మే 2 : అధికారంలోకి వచ్చిన వెంటనే 3,758 మందికి వీఆర్వో ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి మాట నిలబెట్టుకోవాలని వీఆర్ఏ జేఏసీ చైర్మన్ వంగూరి రాములు కోరారు. శనివారం అబిడ్స్‌లోని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం(సీసీఎల్ఏ) ముందు వీఆర్ఏ వారసులు ధర్నా, అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో జీవో నంబర్ 81,85 ప్రకారం 16,758 మందికి ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నారు. మిగిలిన 3,758 మందికి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వీఆర్వో ఉద్యోగాలు కల్పించి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని అప్పటి పీసీసీ చీఫ్, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని పేర్కొన్నారు. కానీ కానీ రేవంత్ సీఎంగా బాధ్యతలు తీసుకుని రెండున్నరేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ మిగిలిన వీఆర్వో ఉద్యోగాలను భర్తీ చేయలేదని మండిపడ్డారు.
బకాయిలో ఉన్న రెండు నెలల వీఆర్వోల జీతాలను చెల్లించాలని, 81 జీవోను వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ధర్నాలో వీఆర్ఏ జేఏసీ జిల్లా ఇన్చార్జిలు మధు, కే రమేశ్ పటేల్, శివ, రాజశేఖర్, రవి సాగర్, బీ నర్సింహులు, సుల్తాన్గౌడ్, సంగమేశ్వర్, నగేశ్, చందుతో పాటు 61 ఏండ్లు నిండిన వీఆర్ఏలు, వారసులు పాల్గొన్నారు.