జరిగిన కథ : చెరసాలలో బందీగా ఉన్న మురారిదేవుణ్ని విడిపించాడు జాయచోడుడు. మూర్తీభవించిన రాజరికపు మూర్ఖత్వంలా ఉన్నాడు మురారి. మేనల్లుడితో కలిసి పాకనాడు వెళ్లిన జాయచోడుడు.. అక్కడ మురారి ఏర్పరచుకున్న రాజవ్యవస్థను చూసి అవాక్కయ్యాడు. ఆ చిన్న సామంతరాజ్యాన్ని తన సామ్రాజ్యంగా రూపొందించుకుని.. ఇష్టారాజ్యంగా పరిపాలిస్తున్నాడు. ఆదిమకాలపు గణనాయకునిలా పూర్తి నిరంకుశపాలనతో ఆనందంగా జీవిస్తున్నాడు. కొడుకు పాలన చూస్తే చక్రవర్తి గుండె ఆగిపోతుందని అనుకున్నాడు జాయచోడుడు.
రెండేళ్లుగా గణపతిదేవుడు, రాణి రుద్రమదేవి యుద్ధాలలో మునిగి ఆంధ్ర సామ్రాజ్యాన్ని స్థాపించగా.. మురారి పరిపాలన మొత్తంగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. తనకు అనుకూలమైన ఓ అధికార బృందాన్ని కూడా రూపొందించుకుంటున్నాడని వేగు అంకమరట్ట నివేదిక. అనుమకొండ కోశాగారానికి దినదినమూ వేలకోట్లు ఆదాయం వస్తుంది. విధివిధానాలు క్రమబద్ధం చెయ్యడం వల్ల ధనం, లెక్కలు పక్కదారి పట్టించడం అధికారులకు అవకాశం ఉండదని ఆయన అభిప్రాయం. చక్రవర్తి అన్నిటినీ క్రమబద్ధం చేస్తాడు కానీ, పన్ను వసూళ్లలో కాస్త మెతక. చూసీ చూడకుండా పోతాడు. ఇది మురారికి నచ్చడం లేదు.
అందుకే.. ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్నాడు. భయపెట్టి బెంబేలెత్తిస్తున్నాడు. మోసం, పద్దుల్లో తేడాలు కనిపిస్తే తీవ్రమైన శిక్షలు విధిస్తున్నాడు. చక్రవర్తి సంస్కరించి క్రమబద్ధం చేసిన నియోగాలపై మురారి దృష్టి కేంద్రీకరించాడు. అలాంటి వాటిలో పన్నుల నియోగం అతని కంటపడింది. పన్నుల వసూలుపై దృష్టి కేంద్రీకరించాడు. కోశాగారానికి ఎక్కువ ఆదాయం ఈ పన్నుల నియోగం నుంచే వస్తుంది కాబట్టి పన్నుల వసూలు సక్రమంగా ఉన్నదో లేదో శల్యపరీక్ష చేస్తున్నాడు. భయపడినంతా అయ్యింది.
ఒకచోట పన్ను వసూలులో అలక్ష్యం దృష్టికొచ్చింది. జంతువులపై పన్ను కోశాగారానికి అతిముఖ్యమైన ఆదాయం. ప్రతివారి ఇంటా జంతువులు ఉంటాయి. గ్రామీణులకు పశువులే సమస్తం. ఈ పశుగుంపులపై అరి, అప్పనం, పుల్లరి అనే మూడు పన్నులు విధిస్తారు. గొల్లలు, మాదిగలు.. మొదలైన వృత్తులవాళ్లు బాగా స్థితిమంతులు. మంచి ఆదాయం, ఆస్తులున్న వృత్తులు వీరివి. పశువులపై పన్నులన్నీ ఎలాంటి మినహాయింపులు కోరకుండా చెల్లిస్తారు.
దేవాలయాలకు అంగరంగవైభవ నిమిత్తం దానమిచ్చిన పశువులపై పన్నుల్లో మినహాయింపులు ఉంటాయి. కానీ, అవి పద్దుల్లో స్పష్టంగా రాసి లేదు. మాటకు కట్టుబడి కార్యకలాపాలు నిర్వహించే ధర్మకాలం కాబట్టి గుళ్లకు ఇచ్చిన పశువులు కాబట్టి పన్ను మినహాయింపు ఉండే ఉంటుందని అధికారులు పట్టించుకోలేదు.
ఇదే పెద్దదోషంగా మురారిదేవుడు ఎత్తి చూపాడు. కోపంతో ఉగ్రుడైపోయాడు. ఈ తప్పునకు కారణమైన ఉద్యోగులు ఇద్దరు. మాచయశర్మ, వీరాయ. ఇద్దరిని తక్షణమే తన ముందు ప్రవేశపెట్టమన్నాడు. ఇద్దరూ వచ్చి అతనికి సాష్టాంగ ప్రమాణం చేశారు. నియోగాధిపతి మాచయశర్మ యువరాజుగారి ఆగ్రహవేశాలను చూసి, అవి గుడికి దానమిచ్చిన పశువులే కానీ పన్ను మినహాయింపు ఉన్నదో లేదో తనకు తెలియదని.. వసూలు బాధ్యత తనది కాదని.. వీరాయదేనని నమ్మబలికాడు. అనేక తర్జన భర్జనల అనంతరం ఇద్దరికి కొరత వేయడం శిక్షగా నిర్ణయించాడు మురారి. తలారి బృందానికి శిక్ష అమలు చేయవలసిందిగా ఆదేశించి సభ చాలించాడు. అయితే అప్పుడే తలారి.. “మాచయశర్మ కులీనుడు, పండితుడు కాబట్టి ఆయనకు శిక్షను మినహాయించారని, వీరాయ పంచముడు, అసలు తప్పు చేసినవాడు కాబట్టి అతను శిక్షార్హుడు!” అని నొక్కి వక్కాణించాడు.
దీని పర్యవసానం తెలియని మురారి..
“అటులే కానిమ్ము!” అన్నాడు.
అంటే మాచయశర్మకు దండన లేదు. మాదిగ కులస్తుడైన వీరాయకు దండన ఉంది.
వీరాయను వధ్యశాల వద్దకు తీసుకుపోయారు. భటులు వీరాయను చేతులు విరిచి గోగునారతో కదలకుండా కట్టారు. తర్వాత అతని నోరును గట్టి బిరుసైన గుడ్డతో చుట్టి కట్టేశారు. వీరాయ విలవిల్లాడుతున్నాడు.
శరీరమంతా వణకిపోతోంది. మరో నలుగురు భటులు మూడుమూరల పలుగు తెచ్చారు. దానిని ఒక మూర నేలలో దిగబడేటట్లు పాతారు. అప్పుడు ఆ పలుగు నేలపై రెండు మూరల పొడవుగా కనిపిస్తోంది. చేతులు విరిచి కట్టిన వీరాయను ఇద్దరు భటులు పట్టుకుని ఆ పలుగువద్దకు ఈడ్చుకువచ్చారు. వీరాయ ప్రతిఘటిస్తూ నేలపై దొర్లి ఏడ్చాడు. కళ్లతో మొక్కుకున్నాడు. కన్నీళ్లు కాలువలు కడుతున్నాయి. కనికరించే పరిస్థితి లేదు. అది యువరాజు విధించిన శిక్ష. అమలు జరిగి తీరాల్సిందే. ఇద్దరు అతణ్ని అలవోకగా పైకెత్తగా.. మరొకడు వీరాయ గుదస్థానం వద్ద పంచెను పక్కకు తొలగించాడు. ఆ ఇద్దరూ ఎత్తి వీరాయ గుదస్థానంలోకి పలుగు దిగబడేటట్లు విసురుగా కూర్చోబెట్టారు. అంతే.. పలుగు అతని గుదస్థానం నుంచి పేగులు, పొట్ట, గుండెను చీల్చుకుంటూ మెడ వద్ద ఆగింది. పలుగు మరింత పొడవుంటే అది కపాలాన్ని తాకేదే. ఇదంతా రెండు ఘడియల కాలంలో జరిగిపోయింది.
ముందు కనుగుడ్లు బయటికి పొడుచుకు వచ్చాయి. నోటినుంచి భీకరమైన ఆర్తనాదంతో నాలిక వికృతంగా బయటికి వచ్చి.. నోరు అలా తెరుచుకుని ఉండిపోయింది. శరీరంలో ప్రతి భాగమూ వణుకుతూ గిలగిల కొట్టుకుంటోంది. గుదస్థానం నుంచి స్రవించిన రక్తం పలుగువెంట కారి నేల ఎర్రబారింది. శరీరం చలనరహితమై తల పక్కకు వాలిపోయింది.
ఈ శిక్ష.. రాజధాని అనుమకొండలో తీవ్ర సంచలనం సృష్టించింది. వృత్తి సమయసెట్టిలు ఈ సంఘటనను చాల తీవ్రంగా తీసుకున్నారు. పల్లెల్లో ‘సమయాలను’ పట్టణాలలో ఇప్పుడు ‘నకరాలు’ అంటున్నారు. అనుమకొండ నకరశెట్టి వల్లయ. భారతరాజ్యాలలో గుర్తింపు ఉన్న ప్రముఖ వ్యక్తి. ఆయన ఈ శిక్షపట్ల ఉగ్రుడైపోయాడు. పన్నుల వసూలు నియోగాధిపతిని నిలదీశాడు. ఈ అపరాధం, ఈ శిక్ష, దానిని అమలుచేసిన తీరు.. అన్నీ పరమ దుర్మార్గం. అసలు అది అతని అపరాధం కాదు. అది శిక్షార్హం కాదు. దానికి కూడా నియోగాధిపతే బాధ్యుడు. లేకుంటే ఇద్దరూ బాధ్యులు. ఇద్దరికీ శిక్ష విధించకుండా పంచముడైన వీరాయకే శిక్ష విధించి.. మాచయశర్మకు శిక్ష నుంచి తప్పించడం.. చాలా ఘోరం! గణపతిదేవుడిలాంటి చక్రవర్తి పాలనలో ఈ దుర్మార్గం ఊహాతీతం.
ఇది మెల్లమెల్లగా అనుమకొండ అంతా పాకింది. అందరూ ఆశ్చర్యపోయారు. అన్ని వృత్తులవారు తీవ్ర నిరసన ప్రకటించసాగారు. ముఖ్యంగా మాదిగలు సహాయనిరాకరణ చేశారు. చచ్చిన జంతు కళేబరాలను తీసుకోవడం, వీధులలోంచి తొలగించడం కూడా ఆపేశారు. పక్షం రోజుల్లోనే అనుమకొండ పురమంతా దుర్వాసనలతో, జంతుకళేబరాల గుట్టలతో నిండిపోయింది. ఈ సంఘటన సంఘీయుల ద్వారా రాజనగరికి తెలిసినా.. యువ చక్రవర్తి స్వయంగా తీసుకుని అమలు పరచిన అంశం కావడంతో జవాబివ్వడంలో తాత్సారం జరిగింది. చివరికి గణపతిదేవుని దృష్టికి వెళ్లింది. మహాప్రధాని హేమాద్రిరెడ్డిని పిలిచి చడామడా తిట్టాడాయన.
“ఒక నకరం వారు నిరసన తెలియజేయడం ఎంతపెద్ద అంశమో మీకు తెలియదా ప్రధానీ?”
“ఇది బాహత్తర నియోగాధిపతి యువరాజులు శ్రీ మురారిదేవుల వారు తీసుకున్న నిర్ణయం ప్రభూ..”
హతాశుడయ్యాడు. నిజమా!? పరిపాలన నేర్చుకుంటాడని అధికారం ఇస్తే శిక్షలు విధిస్తున్నాడా!?
అదీ ఉద్యోగులపై? ఎంత దురహంకారం??
మహాప్రధాని సణిగాడు..
“అదీ.. శిక్షలు లేకుంటే చెడ్డ నడవడిక కలవారు మరీ పెచ్చుమీరిపోతారు ప్రభూ..”
ఆయన జవాబు చక్రవర్తికి తీవ్ర ఆవేదన కలిగించింది.
“చాలు ఆపండి. సమస్య ఎదిగి శిక్షార్హమైనదిగా పరిణామం చెందడానికి చాలా అంశాలుంటాయి. వీటిలో ఎక్కడ మన చాకచక్యం ఉపయోగించినా అది శిక్షార్హమైన నేరంగా మారదు. సమస్యకు శిక్ష పరిష్కారం కాదు. దానిని ఒకచోట నిలువరించి సంస్కరించడమే రాజధర్మనీతి..”
మరుక్షణం ఆయనను పదవీభ్రష్టుణ్ని చేసి రాజనీతిజ్ఞతలో మంచి పండితుడు, శైవగోళకీ మఠాలను పర్యవేక్షిస్తున్న మరో ప్రధాని శివదేవయ్యను మహాప్రధానిగా చేసి.. మల్యాల హేమాద్రిరెడ్డిని తిరిగి సైన్యరంగానికి మార్చాడు.
మురారి ప్రవర్తన ఆయనను చాలా ఆందోళనకు గురిచేస్తోంది. మురారి గాడి తప్పుతున్నాడా?! ఎలా వీడిని అదుపులో పెట్టడం??
“జాయచోడులవారు ఎక్కడ? ఆయనకీ అంశం బోధపరచండి..”
గ్రంథరచనలో భాగంగా నాట్యాంశాల పరిశీలనకై పర్యటనలో ఉన్న జాయచోడునికి.. అంచె వేగుల ద్వారా వార్త అందించారు.
హుటాహుటిన వచ్చిన జాయచోడుడు.. అంతఃపురంలో నారాంబ సమక్షంలోనే మురారిని కంచుకం పట్టి, ఆ చెంపా ఈ చెంపా వాయించాడు.
“తప్పుడు శిక్ష విధించిన న్యాయాధికారికి శిక్ష ఏమిటో తెలుసా.. అదే శిక్ష వాడికి బహిరంగంగా పురప్రజల ముందు అమలుపరచడం. నీచుడా.. ఎంత తప్పుచేశావ్!? నీ తండ్రిగారు ఆ శిక్ష అమలు చేయలేక నన్ను పిలిపించారు. అర్థమైందా??”
పుష్ప మాత్రం విచిమయాత్ .. మూలచ్ఛేదం న కారయేత్
మాలాకార యివారామే .. న యాథాంగ కారకః ॥
(రాజు ప్రజలను రక్షించి, వారిని నొప్పించకుండానే పన్నులను తీసుకోవాలి. తోటమాలి పువ్వులను కోసి మాలలు కట్టినట్లుగా.. పన్నులు వసూలు చెయ్యాలి. అంతేకానీ, చెట్లను వేర్లతోసహా నరికి కాల్చి.. బొగ్గులను అమ్మినట్లు పన్నులు వసూలు చెయ్యకూడదు) “క్షమించు మామా..” కాళ్లపై పడ్డాడు మురారి. వణికిపోయింది నారాంబ. మజ్జిగ పానీయంతో తమ్ముడిని కాస్త చల్లబరిచింది. “వాడు.. నాకున్న ఏకైక ఆశ. తప్పు చేస్తే బావగారికి చెప్పకు. ఆయన మరీ ముక్కుసూటి వ్యక్తి. నువ్వే వాడికి తగిన శిక్ష విధించు. నేను తప్పకుండా ఆమోదిస్తాను..” అన్నదామె. కొడుకుల తప్పులకు తీవ్రవ్యధకు లోనయ్యేది తల్లులు మాత్రమే!
కానీ, మురారి తన ఘోరాలను ఆపలేదు. అంతేకాదు యుక్తవయసు నుంచే ఇలాంటి పెద్దపెద్ద శిక్షార్హమైన నేరాలు చేస్తూనే ఉన్నాడు. అవి ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. విద్య నేర్చే కాలంలోనే గురుకులంలో గురువులను దూషించాడట. ఒక ఉపాధ్యాయుడిపై చెయ్యి చేసుకున్నాడట. అది బయటికి పొక్కకుండా గురువులే ఏదో సంధిలాంటిది చేశారట. విద్యల పట్ల అనురక్తి లేకపోవడం, గురువులపై గౌరవం లేకపోవడం, గురుకులంలో కొందరు విద్యార్థులతో బృందాలు కట్టి గొడవలు.. గురువులను తూలనాడటం..
“నేను చక్రవర్తి ఏకైక కుమారుడను. మా తండ్రిగారికి నేనే వారసుడను. సింహాసనం అధిష్ఠించాక మీ సంగతి తేలుస్తా..” ఇది నిత్యమూ జపించే మంత్రం. మరునాడు వ్యాయామశాలలో గణపతిదేవునితో అన్నాడు జాయచోడుడు.. “వాడి గురించి ఎక్కువ ఆలోచించకండి. నేను సముదాయిస్తాను..” గణపతిదేవుడు జవాబివ్వలేదు. ఆయన తీవ్ర సంఘర్షణకు లోనవుతున్నాడని జాయచోడుడు భావించాడు. మొదటి కొలువువేళ కూడా చక్రవర్తి కొంత ముభావంగానే ఉన్నాడు. కొలువు అయ్యాక వెళ్లబోతూ.. “వాడు చేసిన తప్పును ప్రజలకు వివరించు. మా మాటగా క్షమించమని చెప్పు. ఈ గణపతిదేవుడు ప్రజలను క్షమించమని కోరడం.. ఇదే మొదటిసారి!” అన్నాడు. మనసు చివుక్కుమంది జాయచోడునికి. మురారి మీద కోపంతో ముఖం జేవురించింది. కానీ, మురారి అక్కడ లేడు. మరునాడు రాజవార్త సంబంధి ప్రకటించాడు.
వీరాయను వధ్యశాల వద్దకు తీసుకుపోయారు. భటులు వీరాయను చేతులు విరిచి గోగునారతో కదలకుండా కట్టారు. తర్వాత అతని నోరును గట్టి బిరుసైన గుడ్డతో చుట్టి కట్టేశారు. వీరాయ విలవిల్లాడుతున్నాడు. శరీరమంతా వణకిపోతోంది. మరో నలుగురు భటులు మూడుమూరల పలుగు తెచ్చారు. దానిని ఒక మూర నేలలో దిగబడేటట్లు పాతారు. అప్పుడు ఆ పలుగు నేలపై రెండు మూరల పొడవుగా కనిపిస్తోంది.
“జయ.. జయజయజయ.. జయ
జయ.. శ్రీశ్రీశ్రీ గణపతిదేవులవారికి.. జయ
జయ.. కాకతీయ సామ్రాజ్యానికి.. జయ
పురవాసులకు, సమస్త కాకతీయరాజ్య ప్రజలకు, సామంత రాజ్యాల ప్రజలకు శుభవార్త. ప్రకటిస్తున్నవారు అనుమకొండ నగర దండనాయకులు శ్రీ మంచన చమూపతి.
ఇటీవల అనుమకొండపురంలో చర్మకారుల సమయం వారు, అనుమకొండ నకరం వారు నిర్వహించిన నిరసన కార్యక్రమం చక్రవర్తులవారి దృష్టికి వెళ్లింది. పురజనులకు కలిగిన అసౌకర్యానికి చక్రవర్తిగా వారు బాధ్యత వహిస్తూ మరెప్పుడూ ఏ ఉద్యోగికీ ఇలాంటి శిక్షలు విధించే పరిస్థితులు రావని ఇందుమూలముగా తెలియజేస్తున్నారు. శిక్ష అనుభవించిన వీరాయ కుటుంబానికి ఇరవై పుట్లు వరి పండు తరిభూమి ఇవ్వడం జరుగుతుంది. జయ.. జయజయజయ.. జయ” ప్రతి చతుష్పథం వద్ద ప్రకటన విన్న పురవాసులు గగ్గోలు పెట్టారు.