Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తమపై వేధింపులు ఎక్కువయ్యాయని క్రషర్ యజమానులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాయల్టీ ఫీజు టన్నుకు రూ.250 నుంచి రూ.395కి పెంచారని, కరెంటు వినియోగం ఆధారంగా ఉత్పత్తిని లెక్కిస్తామంటూ కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చి మరింత భారం మోపుతున్నదని మండిపడుతున్నారు.
గడచిన రెండు నెలల్లో జరిగిన ఉత్పత్తి, సరఫరా వివరాలు వెంటనే ఆన్లైన్లో సమర్పించాలని, లేనిపక్షంలో లీజులు రద్దుచేస్తామని ప్రభుత్వం అల్టిమేటం జారీచేసింది. ఓవర్ లోడింగ్‌కు పాల్పడినా లీజులు రద్దుచేస్తామని స్పష్టంచేసింది. ఈ మేరకు మైనింగ్ శాఖ డైరెక్టర్ బీఆర్కే భవన్లో క్రషర్ల నిర్వాహకులతో గురువారం సమావేశమై మైనింగ్ శాఖ తీసుకున్న నిర్ణయాలను వివరించారు. దీనిపై క్రషర్ యజమానులు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నారు.
రియల్ఎస్టేట్ రంగంలో మందగమనం, కొత్త రోడ్ల నిర్మాణం లేకపోవడం వంటి కారణాలతో తమ వ్యాపారాలు సాగడంలేదని, ప్రభుత్వ ఆంక్షలు తోడవడంతో క్రషర్లు నడిపే పరిస్థితి లేకుండా పోతున్నదని వాపోతున్నారు. ఇంతకాలం క్రషర్ల నుంచి మైనింగ్ ఆధారంగా రాయల్టీ వసూలు చేసేవారు. ఇప్పుడు కరెంటు వినియోగం ఆధారంగా ప్రతి నాలుగు యూనిట్లకూ టన్ను చొప్పున నిర్ణయించి రాయల్టీ చెల్లించాలని నిబంధన తెచ్చారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎలక్ట్రానిక్ మీటర్లు ఏర్పాటుచేసి కిలోవాట్ల చొప్పున విద్యుత్తు వినియోగాన్ని లెక్కించి రాయల్టీ చెల్లించాలని చెప్తున్నారు.
కిలోవాట్ల చొప్పున విద్యుత్తు వినియోగాన్ని లెక్కిస్తే, నెలకు 3,000 యూనిట్ల వరకు అదనపు భారం పడుతున్నదని, ఆ మేరకు రాయల్టీ చెల్లించలేమని క్రషర్ యజమానులు చెప్పారు. నిర్మాణరంగం మందగించడంతో కంకర వినియోగం ఎక్కువగా రోడ్ల నిర్మాణానికే జరుగుతున్నదని, అందువల్ల రాయల్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో ప్రభుత్వ పనులకు వినియోగించే మెటీరియల్‌కు సంబంధించిన రాయల్టీని ఆర్అండ్బీ, లేక ఆయా గ్రామ పంచాయతీల నుంచే వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యుత్తు వినియోగం ఆధారంగా రాయల్టీని నిర్ధారించడం వల్ల జీఎస్టీ కలుపుకొని టన్నుకు రూ.195 వరకు భారం పడుతున్నదని తెలిపారు. తమకు 20 ఏండ్లకు లీజు లైసెన్సులు ఉన్నప్పటికీ ఆచరణ సాధ్యంకాని నిబంధనలు పెట్టి, వాటిని పాటించకపోతే లీజులు రద్దుచేస్తామనడం సమంజసం కాదని పేర్కొన్నారు. కానీ, దీనిపై మైనింగ్ శాఖ డైరెక్టర్ క్రషర్ యజమానులకు ఎటువంటి హామీ ఇవ్వలేదు. విద్యుత్తు వినియోగం ఆధారంగానే రాయల్టీని నిర్ణయిస్తామని, ఇందులో ఎటువంటి వెసులుబాట్లకు అవకాశం లేదని స్పష్టంచేశారు. ఓవర్ లోడింగ్‌కు పాల్పడినా క్రషర్ లైసెన్సులు రద్దుచేస్తామని పేర్కొన్నారు.
ప్రభుత్వ వైఖరితో క్రషర్లను నడిపే పరిస్థితి లేదని పలువురు యజమానులు స్పష్టంచేస్తున్నారు. నడిపితే నష్టాలు తప్ప ఉపయోగం ఉండదని, అందువల్ల ఉత్పత్తిని చాలావరకు తగ్గించుకోవడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని చెప్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే రానున్న రోజుల్లో కంకర, రోబోసాండ్ ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఇసుక ధర టన్నుకు రూ.2,000కుపైగా పెరగడంతో చాలామంది రోబోసాండ్పై ఆధారపడుతున్నారు. ఇప్పుడు అది కూడా పెరిగితే దాని ప్రభావం నిర్మాణరంగం మీద పడే వీలున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తమపై వేధింపులు ఎక్కువయ్యాయని క్రషర్ యజమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాయల్టీని టన్నుకూ రూ.250 నుంచి రూ.395కి పెంచారని, పర్మిట్ ఫీజు పేరుతో కొత్తగా టన్నుకు రూ.58 జోడించారని చెప్తున్నారు. దీంతో కంకర, రోబోసాండ్ (మ్యాన్యుఫ్యాక్చరింగ్ సాండ్) ధరలు భారీగా పెరిగిపోయాయి. గతంలో టన్నుకు రూ.600 వరకు ఉన్న కంకర ధర రూ.800కు, రోబోసాండ్ ధర రూ.600కు ఎగబాకింది.
అనుమతులకన్నా ఎక్కువ మైనింగ్ చేశారని, రాయల్టీ సరిగా చెల్లించడంలేదనే కారణాలతో 261 క్రషర్లను సీజ్ చేశారు. క్రషర్లను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసి దాడులు కొనసాగిస్తున్నారు. అనుమతుల పేరుతో క్వారీలు, క్రషర్లపై దాడులు నిర్వహిస్తూ 100% నుంచి 200% వరకు పెనాల్టీలు విధిస్తున్నారు. రాష్ట్రంలో 500 వరకు స్టోన్ క్రషర్లు పనిచేస్తుండగా, గత ఏడాది రాయల్టీ ద్వారా ప్రభుత్వానికి రూ.650 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది రూ.1,000 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ క్రమంలోనే రాయల్టీని పెంచడంతోపాటు సరికొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది.