జరిగిన కథ : కళింగరాజుపై కాకతీయులు యుద్ధభేరి మోగించారు. యుద్ధ మంత్రాంగమంతా రుద్రమదేవి, మురారిదేవుడే పర్యవేక్షిస్తున్నారు. యుద్ధం తొలిదశలో కాకతీయులదే పైచేయిగా ఉన్నా.. మాసం గడిచేసరికి శత్రు సేనానులు రెచ్చిపోసాగారు. ఇక తప్పనిసరై జాయచమూపతికి వార్త పంపింది రుద్రమ. ‘మురారిని బంధించి తీసుకుపోయారు. మీ సహకారం అవసరం’ అన్నది ఆ వార్త సారాంశం. తక్షణమే తన కొత్త కాహళ వాయిద్యాలతో.. వందమంది గిరిజన వాయిద్యకారులతో రేఖపల్లి కోట ఉన్న కొండ శిఖరంపైకి వెళ్లి మోహరించాడు జాయపుడు.
జాయ చమూపతి గిరిజనవాద్య బృందం ఆ శిఖరాలపై పగలంతా అభ్యాసం చేసింది. అక్కడ యుద్ధభూమిలో జాయచోడుణ్ని తలచుకుంటూ రుద్రమ సైన్యం పగలంతా శత్రువులను తట్టుకుని నిలబడింది. రాత్రి చీకటి గాఢమయ్యాక.. జాయచోడుని యుద్ధ తంత్రం మొదలయ్యింది. కాకతీయ స్కంధావారంలో కాకతీయ ఎక్కట్ల దళంలోని వెయ్యిమంది యోధానుయోధులతో వేయి ఏనుగుల బృందం సిద్ధమైంది. ఇక్కడ వందమంది జాయచోడుని గిరిజన బృందం ఈశాన్యదిశగా కాహళాలు ఎక్కుపెట్టి మృదు మధురంగా బృందగానం మొదలెట్టింది. చల్లగా గోదావరి తరగలపై రివురివ్వున వీస్తున్న గాలులతో కలగలిసిన ఆ మంద్రమైన సంగీతం కాకతీయ గజదళానికి వినిపించసాగింది. చీకట్లో సమున్నత శిఖరాల్లా నడుస్తున్న ఏనుగులు జాయసేనాపతి కాహళధ్వనిని గుర్తుపట్టి ఆయన ఇచ్చిన సూచన ప్రకారం వెళ్లి శత్రు స్కంధావారాన్ని చుట్టుముట్టాయి. అంతే.. కాహళ ధ్వని గోదావరి ఉలిక్కిపడేలా.. తూర్పుకనుమల మహాపర్వతాలు కదిలిపోయేలా ఉత్కృష్టంగా వినిపించసాగింది. అదొక సంకేతం. ఆ కాహళ ధ్వని ఒక సంకేతమని జాయపునికి, కాకతీయ ఏనుగులకు మాత్రమే తెలుసు. వెళ్లివెళ్లి కళింగ స్కంధవారాన్ని చుట్టుముట్టిన కాకతీయ మహామత్తగజాలు తీవ్రంగా కంపించాయి. తొండాలెత్తి ఘీంకరించాయి. వాటి పైనున్న ఎక్కటీలు ఆయుధాలతో ఉద్వేగంగా ఊగిపోతున్నారు.
కాహళ ధ్వని తీవ్రత రానురానూ మరింత పెరిగిపోతోంది. చిత్ర విచిత్ర కూజితాలు.. ఏవేవో సంకేతాలు.. తదనుగుణంగా వెయ్యి ఏనుగులు పిచ్చెక్కినట్లు కదిలి శత్రు స్కంధావారంపై విరుచుకుపడి అడ్డదిడ్డంగా పరుగులు పెడుతూ.. శత్రు సైనికులు నిద్రిస్తున్న గొల్లెనలను ఛిన్నాభిన్నం చేయసాగాయి. మరోవైపు బరిసెలతో వాటిపై సిద్ధంగా ఉన్న ఎక్కటీలు శత్రుసైన్యాన్ని దొరికినవారిని దొరికినట్లు చంపసాగారు. నిద్రలోనున్న శత్రుసైనికులు ఆయుధాలు వెతుక్కునేసరికి మొత్తం స్కంధావారం సర్వనాశనమై పోయింది. రుద్రమ బృందం మురారిని చెర విడిపించి తీసుకుని లిప్తలమీద మాయమైంది. కాకతీయ గజదళం స్కంధావారానికి చేరేవరకు నిర్విరామంగా మోగిన కాహళాలు.. అప్పుడు శాంతించాయి.
“ఇది అధర్మయుద్ధం. అర్ధరాత్రి స్కంధావారంపై దాడిచేయడం ద్రోహం!” అరిచారు శత్రు సేనానులు.
“మా సేనానిని బంధించినవారు మాకు వర్తమానం పంపారా? చర్చలకు పిలిచారా? లేదే! బందీని చేసి దూరంగా తీసుకుపోవడానికి కుట్ర చేశారే.. అది ధర్మయుద్ధమా?”..
రుద్రమ ప్రశ్నకు జవాబు లేదు. అప్పటినుంచి యుద్ధం కాకతీయుల వైపు మొగ్గింది. గజసైన్యం యుద్ధగతిని మార్చేసింది. మురారి, రుద్రమలు జాయచోడుని సూచనలను సమర్థంగా ఉపయోగించుకుంటూ శత్రుసేనలను ముప్పుతిప్పలు పెట్టారు. కళింగ సంధివిగ్రహి వచ్చి తమ ఓటమిని ప్రకటించాడు.
కళింగరాజ్యంలో తెలుగుభాష స్పష్టంగా మాట్లాడుతున్న బొక్కెర రాజ్యం వద్ద తమ విజయస్తంభం నాటింది రుద్రమ. ఈశాన్యాన తెలుగు మాట్లాడే ప్రజలంతా పూర్తిగా కాకతీయరాజ్యంలో భాగమయ్యారు.
విజయలక్ష్మితో తిరిగివచ్చిన సైనిక పటాలానికి అనుమకొండలో అఖండ స్వాగతం లభించింది. ముఖ్యంగా మురారిని చూడటానికి పురజనులు ఎగబడ్డారు. రుద్రమదేవి పట్ల కూడా ప్రజలు గొప్ప ఆరాధనాభావం చూపారు. వారసులు ఇద్దరూ ఒకే యుద్ధంలో పాల్గొనడం, ముగ్గురు బిడ్డలతల్లి రుద్రమదేవి యుద్ధంచేయడం కొందరికి నచ్చితే.. తమ అసలుసిసలు వారసుడు మురారిదేవుడు వీరవిహారం చేయడం కాకతీయ సామ్రాజ్యానికి శుభ సూచకమని ఎక్కువమంది భావించారు. గణపతిదేవ దంపతులు పులకించారు. బిడ్డలిద్దరూ అత్యుత్తమ యుద్ధ వీరులైతే.. ఆ తల్లిదండ్రుల పరమానందానికి హద్దు ఏముంటుంది! ఏదేమైనా ఇద్దరూ రాణించడం గణపతిదేవునికి, నారాంబకు కొంత ఉపశమనం కలిగించింది.. జాయచోడునికి కూడా!! అయితే మరునాడు వినవచ్చిన చక్రవర్తి నిర్ణయం జాయచోడుణ్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
“యువరాజు మురారిదేవుల వారిని పాకనాడు మండలేశ్వరునిగా నియమించారు”
జాయసేనాపతి ప్రశాంతంగా కవిగాయక గోష్ఠులతో తన గ్రంథరచనను సుసంపన్నం చేస్తున్నాడు. గీతాలు, గేయాలపై ఒక గ్రంథం, వాద్యసంగీతంపై మరో గ్రంథం, నృత్తంపై ఇంకో గ్రంథం ప్రారంభించాడు. గురుకులాలు పర్యటించడం.. అక్కడ పండిత గోష్ఠులను నిర్వహించడం.. తన గ్రంథరచనకు కావాల్సిన సమాచారాన్ని కూడగట్టడం ఆయన నిత్యకృత్యం. దేశీ కళారూపకాలు, జానపద గేయాలు, వాద్య విశేషాలు సేకరిస్తుంటాడు. సాధారణ జనులు మాట్లాడే తెలుగు, రాసేలిపి కూడా స్పష్టమై కన్నడం, తమిళం ఇక్కడ కనుమరుగయ్యాయి. కన్నడ మాతృభాష అనుకున్నవాళ్లు ఆ రాజ్యాలకు వెళ్లిపోయారు. అలాగే తమిళ భాష ప్రజలం అనుకున్న వాళ్లు దిగువకు వెళ్లిపోయారు. ఆయా ఇతర భాషారాజ్యాల నుంచి తెలుగువారు కాకతీయ సామ్రాజ్యంలోకి వచ్చేశారు. సంస్కృతభాషలోనే కాక తెలుగుభాషలో కూడా ఎన్నో క్రొత్త గ్రంథాలు వెలువడుతున్నాయి. ఎందరో యువకవులు, పండితులు, విద్యావేత్తలు, లేఖకులు, శాసన రచయితలు, వందిమాగధులు సాహితీసృష్టిపై దృష్టిపెట్టి అద్భుతమైన రచనలు చేస్తున్నారు. అప్పుడప్పుడూ దూరదేశాల నుంచి కూడా పండితులు తమతమ రచనలతో జాయసేనాపతిని కలుస్తుంటారు. జాయచోడుడు గొప్ప యుద్ధయోధుడుగా.. అంతకుమించి రణతంత్ర నిపుణునిగా.. అత్యద్భుత నాట్యకారునిగా.. నాట్యగురువుగా.. నాట్యకళా విశారదుడిగా.. కాకతీయ సామ్రాజ్యంలోనే కాదు ఇటు దక్షిణావర్తంలోనూ అటు ఆర్యావర్తంలోనూ భరతముని తర్వాత అంతటి నాట్యమునిగా వెలుగొందుతున్నాడు. దేశం నలు మూలలనుంచి ఎందరో నాట్యకారులు, సాహితీవేత్తలు, ఆయన్ను కలిసి చర్చించడానికి, నాట్య మెలకువలు నేర్చుకోవడానికి తండోపతండాలుగా వస్తూనే ఉంటారు.
“చిదంబరం నటరాజును దర్శించుకోవడానికి బయలుదేరాం. మధ్యలో ముందు మీ దర్శనం మాకు అత్యంత ఆనందదాయకం”..
ఇది భరత ఖండపు కళాకారులు ముక్తకంఠంతో పలికే మాట!!
‘తక్షణం రావలసింది. మురారిదేవుడు పరిపాలిస్తున్న పాకనాడు పక్కనున్న కందవోలు రాజ్యపాలకుడు నందమరాయని చెరసాలలో మురారి బందీగా ఉన్నాడు’ చారుడు తెచ్చిన లేఖను చదివి దిగ్భ్రమ చెందాడు జాయచోడుడు. వెంటనే కదిలాడు. నిజానికి మురారిని పాకనాడు పాలకుడిగా నియమించడం.. ఆలోచిస్తే సబబేమో అనుకున్నాడు జాయచోడుడు. ఇందువల్ల గణపతిదేవుడు రెండు ప్రయోజనాలు సాధించాడు. రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడవు. ఇద్దరిని పరీక్షిస్తున్న అతిముఖ్యమైన కాలం ఇది. రుద్రమదేవి అనుమకొండకు రావడం మురారికి సహజంగానే సుతరామూ ఇష్టంలేదు. ఆమెను తిరిగి తెచ్చిన మేనమామ శత్రువై పోయాడు. ఆయనతో అంటీ ముట్టనట్లున్నాడు. ఇది గుర్తించిన జాయచోడుడు ఇదొక భేదోపాయంగా మురారి గుర్తిస్తాడని ఆశించాడు. తనను ఆనాడు వెలనాడు మండలీశ్వరునిగా పంపినట్లే.. మురారిని కూడా పాకనాడు పాలకుడిగా పంపాడు. అనుమకొండలో తండ్రి ప్రభావాన మురారి కొంత స్వేచ్ఛగా ప్రవర్తించలేకపోవచ్చు. చిన్న సామంతరాజ్య పాలకుడిగా పాలన కష్టసుఖాలను అనుభవంతో గ్రహించవచ్చు. అయితే అది కేవలం సమర్థింపు వాదన మాత్రమే. గణపతిదేవుడు సామ్రాజ్య స్థాపన తంత్రాలతో తలమునకలై ఉండగా.. రుద్రమ తండ్రి తరఫున పాలనాపగ్గాలను అందుకుంది. గొప్పగా రాణిస్తోందని శుక్ర, అంకమరట్ట చెబుతున్నారు. ముఖ్యంగా జలవనరుల నిర్వహణలో ఆమె తండ్రిని మించిన ప్రతిభను చూపుతోందని రైతులు సంతోషంగా ఉన్నారట.
తండ్రి ఆలోచనను అందుకున్నవారే అసలుసిసలు వారసులు.. అది కొడుకైనా.. కూతురైనా. మురారి గుర్తొస్తే కాకతీయ సామ్రాజ్య భవిష్యత్తుపై దిగులు పెరుగుతుంది. రుద్రమను చూస్తే ఆశ పెరుగుతుంది. హుటాహుటిన రాజధానికి తిరిగి వచ్చి గణపతిదేవుని ముందు నిలబడ్డాడు.
“కిం కర్తవ్యం?” అందరిని ఉద్దేశించి అన్నాడు చక్రవర్తి గణపతిదేవుడు.
సాక్షాత్తూ కాకతీయ సామ్రాజ్య యువరాజుని చెరసాలలో బంధించడం.. చిన్నవిషయం కాదు. అందరూ జాయచోడుని వంక చూశారు.
“సరే.. నా ప్రయత్నం నేను చేస్తాను..” అన్నాడు.
మందిర ద్వారం దాటేముందు బావగారి వంక చూశాడు. ఆయన దీనంగా చూస్తూ వెంట వస్తున్నాడు.
విక్రమను అధిరోహిస్తూ..
“అక్కకు చెప్పండి. ఆమె కొడుకును క్షేమంగా తీసుకొస్తానని..” అన్నాడు.
బయటకు వచ్చాడు. ఏమి చెయ్యాలి? తను ఒంటరి! కాస్త గుండెనిబ్బరం కలిగించే తోడు ఉంటే బావుండును.
కాకతి!! వచ్చి అశ్వం పక్కగా నిలబడి..
‘నేనూ వస్తున్నాను పద..’ అన్నట్లు తోచింది! కాస్త ఊపిరి తీసుకుని ఆత్మవిశ్వాసంతో విక్రమను ముద్దుగా కదిపాడు. మొదట వేగులను పంపి ధనదుప్రోలులో ఒక సైనిక పటాలాన్ని సిద్ధం చేయించాడు. మార్జువాడి పాలకుడు ఒపిలిసిద్ధి సహాయం తీసుకోమన్న గణపతిదేవుని సూచనపై అతనికి ఆహ్వానం పంపాడు. సైనిక పటాలాన్ని పొలిమేరల్లో ఉంచి కందెనవోలు రాజధాని కందవోలు ప్రవేశించాడు. గణపతిదేవుడు పెద్దసేనతో దండెత్తి వస్తాడని ఊహించిన మార్జువాడి పాలకుడు నందనరాయడు ఒంటరిగా ప్రవేశించిన జాయచోడుణ్ని చూసి ఆశ్చర్యపోయాడు. మహానాట్యకారుడిగా మన్ననలు పొందుతున్న జాయచోడునికి పూర్ణకుంభ స్వాగతంతో ఆహ్వానించాడు.
“మహామహా పండితులకు మాత్రమే దక్కే ఈ పూర్ణకుంభ స్వాగతం శూద్రుడనైన నాకు ఇవ్వడం మీ ఔదార్యానికి నిదర్శనం నందనరాయా.. కృతజ్ఞతలు!”
జాయచోడుడు రాజాస్థానానికి వచ్చాడన్న వార్త పురంలో వ్యాపించి.. పండితులు, విద్యావేత్తలు, కళాకారులు, ఆస్థాన నర్తకి మొదలైన దేవదాసి, వేశ్య ప్రముఖులు, వణిజులు, సమయశెట్టి ప్రముఖులు రాజమందిరానికి వచ్చేశారు. అందగాడైన జాయచోడుడు ఈ వయసులో కూడా స్వచ్ఛమైన కళాతేజస్సుతో వెలిగిపోతున్నాడు. అందరూ రెప్పవెయ్యకుండా అలా చూస్తూనే ఉంటున్నారు. కళాయుద్ధం తర్వాత వెలనాడు పరిసర రాజ్యాలలో జాయచోడుని పేరు మార్మోగిపోతోంది. చేబ్రోలు, ధనదవోలు మధ్య వెలసిన ఓ గ్రామానికి జాయప్రోలు అని పేరు పెట్టుకున్నారు. ఆయనపట్ల ప్రజల్లో ఉన్న ఆకర్షణ చూసి నందనరాయడు ఆశ్చర్యపోయాడు.
“ఆ నీచుడు తమరి మేనల్లుడు అయినందుకు మేము ఆశ్చర్యపోతున్నాం జాయచోడదేవా!” అన్నాడు రాయడు.
జాయచోడుడు రాజాస్థానానికి వచ్చాడన్న వార్త పురంలో వ్యాపించి.. పండితులు, విద్యావేత్తలు, కళాకారులు, ఆస్థాన నర్తకి మొదలైన దేవదాసి, వేశ్య ప్రముఖులు, వణిజులు, సమయశెట్టి ప్రముఖులు రాజమందిరానికి వచ్చేశారు. అందగాడైన జాయచోడుడు ఈ వయసులో కూడా స్వచ్ఛమైన కళాతేజస్సుతో వెలిగిపోతున్నాడు. అందరూ రెప్పవెయ్యకుండా అలా చూస్తూనే ఉంటున్నారు.