జరిగిన కథ : అది మువ్వ మరణించిన రోజు. ఆ విషాదాన్ని తట్టుకుంటూనే తలగడదీవి చేరాడు జాయపుడు. పృథ్వీశ్వరుడు ద్వారంవద్దే నిలిచి.. అనుమకొండ నుంచి వచ్చిన లేఖను చూపాడు. అసలే మువ్వ మరణంతో దిమ్మెరబోయిన జాయచోడుడు.. ఇక క్షణం ఆగలేదు. విక్రమతో కలిసి గిరుక్కున వెనుదిరిగాడు. చీకట్లో అలా అలా.. నడిచి నడిచి ఊర్లు దాటారు. అప్పుడు వినిపించింది.. డప్పు చప్పుడు. అది సూరప్పడి డప్పు.
ఇక్కడెక్కడో.. ఏ ఊరు ఇది?! ఇక్కడున్నాడేమిటి? ఆవలగా మిణుకుమిణుకు అంటున్న దీపాల కదలికలు. కాస్త అవతలగా కృష్ణమ్మ నిద్రలో గురక లాంటి మెలమెల్లని గలగలలు. నడుస్తూనే చుట్టూ పరికిస్తూనే ఆ డప్పుశబ్దం వైపుగా నడిచాడు. దగ్గరయ్యాక సూరపను గుర్తించి.. ఆశ్చర్యంగా నిలబడిపోయాడు. అది ఓ పంచములవాడ పొలిమేరలోని తాడితోపు. ఓ తాడిచెట్టు కింద కూర్చుని ఉన్నాడు సూరప. ఒంటిపై వస్త్రం లేదు. కేవలం మొలకు ఓ గోచిగుడ్డ. ఆ దట్టమైన చీకటిలో ఒంటరిగా చెట్టుకు జారగిలబడి అత్యంత విషాద
ఇద్దరూ ఒక్కసారే ఒకరినొకరు చూసుకున్నారు. చటుక్కున లేచి నిలబడ్డాడు సూరప. “దేవరా దండాలు! సావీ దండాలు! ఈ యదవ ఈడ ఉండాడని వచ్చారా దేవరా!” ఘొల్లుమన్నాడు. జాయచోడుడు వెలనాడు విడిచి వెళ్లిపోతున్నాడని అతనికి తెలియదు కదా! “నువ్వేమిటి.. ఇక్కడ?? సరే సరే అసలు సంగతి చెప్పు.. అనుమకొండ వెళ్లావా? రాజాస్థానానికి వెళ్లావా? నాలేఖ చూపావా? రాజాస్థానంలో డప్పుప్రదర్శన చేశావా? పెద్దలంతా ఏమన్నారు? మెచ్చుకున్నారా? బావగారు.. అదే మహామండలేశ్వరులు నీ కళను విని ఏమన్నారు..?”ప్రశ్నల వర్షం. దేనికీ జవాబు చెప్పలేనట్లు జాయపుని పాదాలవద్ద కుప్పకూలిపోయి.. ముఖాన్ని చేతులతో కప్పుకొని కుళ్లికుళ్లి ఏడవసాగాడు.
మ్రాన్పడిపోయాడు జాయపుడు. శుభవార్త కాదు.. ఏదో ఘోరం జరిగినట్లుంది. లేపి భుజాన చేయివేసి లాలనగా అడిగాడు. “ఏమైంది.. చెప్పు. దేనికైనా.. ఏ మాట వినడానికైనా సిద్ధపడి ఉన్నాను. చెప్పు చెప్పు..” చెప్పలేనట్లు మరికాసేపు ఏడ్చి తెప్పరిల్లి లేచి మళ్లీ జాయపుని పాదాలవద్ద కూలబడి చెప్పాడు. “తమరి లేఖ సూసి నన్ను సాదరంగా రానిచ్చారు. కళామండపమంట. ఆడ.. పెద్దోళ్ల ముందు నేను డప్పు వాయిస్తన్నాను. మీమీద గురితో నన్ను వాయించమన్నారు కానీ.. ఆళ్లంతా నన్ను రోతగా చూస్తన్నారు.
నన్ను, నా డప్పువాదనను ఏమాత్రం ఒప్పుకొనే ధోరణి ఆళ్ల ముఖాల్లో కనపడ్డంలేదు. ఇష్టంలేనట్టు.. అసలు ఆళ్లకు సంగీతమే తెలియనట్లు కూకున్నారు. నన్ను గౌరవించడం సంగతి దేవుడెరుగు.. అసలు ఇనడమే లేదు. నాలో ధైర్యం తగ్గిపోతాంది. డప్పు శ్రుతి తప్పుతాంది. సరిగ్గా అప్పుడే ఆ దేవుడు.. ఆ పెద్దాయన లోపలికొచ్చారు. ఆయన యంట వచ్చినోళ్ల పొగడ్తలతో డప్పు ఆపేశాను. అప్పుడే ఎవురో నా కాడికొచ్చి.. ‘కాసేపు నీ డప్పు ఆపరా మాదిగ యధవా! శవాల ముందు వాయించే డప్పు.. రాజనగరిలో మహామండలేశ్వరుల ముందు.. మాబోటి మహావిద్వాంసుల ముందు వాయిస్తావా!? ఎంత ధైర్నం.. సావడానికే ఇక్కడికి వచ్చావ్. ఆపెహే!’ అన్నాడు. అట్టాంటోళ్లు సాధారణంగా నా బోటోడితో మాట్టడానికే వొప్పుకోరు. అట్టాంటిది..”
“సరే సరే.. ఆయన.. మహామండలేశ్వరులు..
వారేమన్నారు??”.
జాయపునిలో ఆశ్చర్యం, దిగ్బ్రమ కలసిన అసహన కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. “ఆ సావి దేవుడు మారాజా! కానీ, ఆ దేవుడుగోరు కూడా నన్ను కనికరించలేదు. పొమ్మన్నాడు.. ‘బయటకు పో.. ఇది రాజాస్థానం. ఇక్కడ గొప్పగొప్ప విధ్వాంసులకే గౌరవం. డప్పు ఇక్కడ వాయించడానికి సరిపోదు. చాటింపుకు, శవాల కాడ వాయించుకో.. పోపో!’ అన్నారు సావి..” ఖంగుతిన్నట్లు కొయ్యబారిపోయాడు జాయపుడు. బోరున విలపిస్తున్నాడు సూరప. మళ్లీ చావుదెబ్బ. గొడ్డలితో గుండెపై నరికారు. నరికింది ఎవరోకాదు. బావగారు! అంటే సాక్షాత్తూ దేవుడు!! విక్రమపై వాలిపోయాడు జాయపుడు. అప్పుడు తడిశాయి కళ్లు. తొలిసారి.. బావగారిపై.. నమ్ముకున్న దేవుడే అవమానించినట్లు.. కోపంతో శరీరం వణికింది.
సూరప డప్పు తీసుకుని మెల్లగా వాయించసాగాడు.
చివ్వున కదిలి భుజానున్న ఉత్తరీయం నడుముకు కట్టుకుని స్థానకం తీసుకుని కాలు కదిలించాడు. తలపైకెత్తి రుద్రదేవునికి నమస్కరించి కాలు కదిలించాడు. జాయపుని శరీరభాష గుర్తించిన సూరప నిలబడి ఆయన నృత్త కదలికలకు అనుగుణంగా డప్పు వాయించసాగాడు. ఇద్దరు కళాకారులు తీవ్ర అవమానభారంతో, దుఃఖ భాజమైన మనస్సుతో, విషాద హృదయాన్ని రసావిష్కరణ జరిపితే.. ఆ నృత్తం, తదనుగుణమైన డప్పువిన్యాసం ఎలా ఉంటుందో ఆ అర్ధరాత్రి కటికచీకటిలో.. పైన చంద్రుడు, దగ్గరగా కృష్ణమ్మ, ఆవలగా సముద్రుడు మౌనంగా సజలనయనాలతో వీక్షించారు. ఆ అద్భుత విషాద తాండవ నృత్తవిన్యాసాలకు ఆ రుద్రదేవుడే స్పందించాడా అన్నట్లు అప్పటికప్పుడే చిన్నపాటి వర్షం ఇద్దరినీ తడిపిపోయింది. ఆ వర్షంలో ఆ అలా డప్పు మోగుతూనే ఉంది.. గజ్జెలు లేని పాదాలు తాండవ నృత్తమాడుతూనే ఉన్నాయి. ఆడిఆడి వర్షంలో తడిసి తడిసి అక్కడే కుప్పకూలిపోయాడు జాయపుడు.
‘ఎంత అవమానం చేశారు బావగారూ!’..
అయితే, గణపతిదేవునితో తను చెప్పమన్న ఒక్కమాట సూరప్పడు చెప్పలేదని జాయపునికి తెలియదు.
మర్నాడు ఉదయానికి మొదటి రాజసత్రం వద్దకు చేరాడు జాయపుడు. ధనదుపురానికి, అనుమకొండకు మధ్య పాతిక రాజసత్రాలున్నాయి. అవి కాకతీయ రాజవంశాల వారికి మాత్రమే పరిమితం.
చిందరవందరగా ఉన్న తలకట్టు.. అసహ్యంగా పెరిగిన గడ్డం.. బురదలో నృత్తం తొక్కాడేమో.. మట్టి కొట్టుకుపోయిన కంచుకం, పంచె, ఉష్నీషం.. మొత్తంగా పరమ అసహ్యంగా ఉన్న జాయపుణ్ని చూసి.. రాజసత్రం నిర్వాహకుడు జాలయ అలా ఉండిపోయాడు.
జాలయ ముఖకవళికలు గుర్తించిన జాయపుడు..
“కాస్త విశ్రాంతి తీసుకుంటాను. మంగళవాడిని పిలిపించు..” అంటూనే తల్పంపై వాలిపోయాడు.
క్షౌర సంస్కారంతో కాస్త ఊపిరి తీసుకుని తిరిగి బయల్దేరుతున్న జాయపునితో అన్నాడు జాలయ..
“పై సత్రంవద్దకు తమరికి కొత్తదుస్తులు సిద్ధం చెయ్యమని వార్త పంపాను దేవరా..” తిరిగి చూసి ఆప్యాయంగా నవ్వి విక్రమను అధిరోహించాడు. మరి నాలుగురోజుల తర్వాత అనుమకొండ చేరాడు. అప్పటికి గూడుకట్టుకున్న విషాదం గుమ్మనంగా లోలోన ఘనీభవించింది. ప్రదేశం మారడంతో కాస్త వాన వెలసినట్లు తెరిపిన పడినట్లయ్యింది. సైనిక స్వాగతంతో మరికాస్త తేరుకున్నాడు.
పుర నివాసం. మర్నాడు తన పురనివాసం ముందు నిలబడి మొత్తంగా పైనుంచి కిందికి చూసుకున్నాడు. దాని కింది భాగమంతా వెలనాడు మండలేశ్వరుని కార్యాలయం. ఈ మధ్యకాలంలో వెలనాడు మండలాధికారుల కార్యకలాపాలు ఎక్కువకావడంతో మరిన్ని నియోగాలు వచ్చాయి. కానీ, మొదటి అంతర్వులో అతని నివాసం మాత్రం అలాగే ఉంచారు. అంతా తిరిగి చూసుకున్నాడు. తర్వాత రాజప్రాసాదం, నియోగాలు, రాజనగరి.. అంతా తిరిగాడు. రాజప్రాసాదపు రూపురేఖలు మారాయి. రాజనగరిలో కూడా ఎంతో మార్పు.. వీధులు చూస్తూ ఆ ఇల్లు.. గతంలో ఇంద్రాణి వాళ్ల ఇల్లు ఉన్న వీధిలోకి మళ్లబోతూ ఆగి మరోవైపు వెళ్లాడు. ఎదురొచ్చిన వారంతా కొత్తగా కనిపిస్తున్నారు. ఒక్కరో ఇద్దరో పాతవాళ్లు. వాళ్లు కూడా కుశలప్రశ్నలు వేశారు వాళ్ల ధోరణిలో.
“జాయసేనానీ.. ఏమిటి.. వెలనాడు వెళ్లాక కాస్త ఒళ్లు చేశారే?!”. “కాస్త ముదురు తేలారు..” అంటూ జాయపుణ్ని కొత్తగా చూడసాగారు. పరిపాలనా భవనాలు కూడా కొత్తవి కనిపించాయి. కొత్తనియోగాలు, అధికారులు, మంత్రులు, మహామంత్రులు, సేనానులు, దళపతులు, సైన్యాధ్యక్షులు.. ఒకరేమిటి.. పరిచారికలు, కంచుకీలు, ప్రతీహరులు, కాపలా భటులు.. వేగులు కూడా చాలామంది మారిపోయారు. అక్కడక్కడా పాతముఖాలు కనిపిస్తున్నాయి. కానీ, జాయసేనాని, జాయ చమూపతి, జాయ గజసాహిణి, జాయచోడుడు, జాయ చోడదేవుడు.. ఏ పేరు ఉచ్చరించినా విన్నపేరులా గుర్తుపట్టి ఆత్మీయంగా, అత్యంత వినయవిధేయతలతో, రెప్పవేయని ఆశ్చర్యంతో.. కొత్తవాళ్లు నిబిడాశ్చర్యంతో నోర్లు వెళ్లబెట్టి.. పాతవాళ్లు
మధురస్మృతుల మాధుర్యచూపులతో..
తర్వాత గణపతిదేవుడు వచ్చారని తెలిసినా ఆయనను కలవలేదు. సూరప్పడి అవమానం తనదిగా భావించి.. గణపతిదేవునిపై కలిగిన కోపం ఆయనను కలవకుండా చేసింది.
ఓ సాయంత్రం కళామందిరానికి వెళ్లాడు. దూరం నుంచే కళాత్మక పరిమళం! ఆత్మీయబంధం!!
ఉద్వేగం హెచ్చింది. గబగబా వెళ్లబోయి సూరప్పడికి జరిగిన అవమానం ఇక్కడే కదా.. అని గుర్తొచ్చి మెల్లగా, మౌనంగా వెళ్లాడు లోపలికి. ఊహాతీతంగా లోపల నాట్యప్రదర్శన.. జాయచోడుని నృత్తరీతులతో లాస్య నృత్తం ప్రదర్శిస్తున్నది లలితాంబ. ఆశ్చర్యంగా చూస్తూ మరికొన్ని అడుగులు వేశాడు.
జాయచోడుణ్ని ఆమె చూడటం ఏమిటి.. నృత్తం ఆపడం ఏమిటి.. అందరూ తలతిప్పి జాయచోడుణ్ని చూడటం, గుర్తించడం ఏమిటి!? అన్నీ ఒకేసారి జరిగాయి.
మందిరమంతా కోలాహలం.. ఉత్సాహ ఉద్వేగాల పరవళ్లు. ఖంగుతిన్నాడు జాయచోడుడు. అంతా చుట్టుముట్టడంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు. అక్కడున్నవారిలో ముప్పాతిక మువ్వంతులమంది అతనికి పూర్తిగా కొత్త. అయితే జాయచోడుడు వెలనాడు మండలేశ్వరునిగా అక్కడ నిర్మించిన కూసెనపూండి కళాక్షేత్రం, కళాయుద్ధం ద్వారా మతఘర్షణలను నివారించి విజయం సాధించడం.. రెండూ సామాన్య విషయాలు కాదు.
ఎవరెవరో ముందుకొచ్చి చేతులు పట్టుకోవడం.. వంగి నమస్కరించడం.. ఏదేదో పొగడటం.. ఏవేవో గుర్తు చేయడం.. తమను తాము పరిచయం చేసుకోవడం.. వాళ్ల రచనలను ఉటంకించడం.. వాళ్ల నాట్య, నృత్త, నృత్యాలను చెప్పుకోవడం.. జాయచోడుని ఇబ్బంది గుర్తించిన లలితాంబ ముందుకొచ్చి అందరినీ నిలువరించి ఒక్కొక్కరినీ ఆయనకు పరిచయం చేయసాగింది. అది అందరికీ ఎంతో బాగున్నా.. జాయచోడుని ముఖ కవళికలు చూస్తుంటే అసలు వింటున్నాడో లేదోనని వారంతా భావిస్తుండగా.. జాయచోడుడే లలితను మెల్లగా అడిగాడు.
“లలితా.. మహామండలేశ్వరులు.. అదే బావగారు ఇప్పుడు ఇక్కడికి వస్తారా??”
“ఇప్పుడే మరికొన్ని క్షణాలలో వారు ఎప్పుడైనా రావచ్చు. నిన్ననే నన్ను అడిగారు.. ‘జాయ వచ్చాడు కలిశావా!?’ అని..” మరేదో చెప్పబోతుండగా చటుక్కున చేతులెత్తి అందరికీ నమస్కరించి.. వేగంగా ఎవరో తరుముతున్నట్లు బయటికి వెళ్లిపోయాడు జాయచోడుడు. అయితే ఆయన తొందరతొందరగా వెళ్లిపోతుండటం.. అప్పుడే పల్లకి దిగిన గణపతిదేవుడు చూశాడని జాయచోడునికి తెలియదు.
అంతఃపురంలోకి వెళ్లబోతూ ఆ ద్వారాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఒక్కటే ద్వారం!
మొన్న వచ్చాడు కదా.. అప్పుడు గుర్తించలేదు.. అక్కను చూడాలన్న తొందరలో. అంటే బావగారు రెండు అంతఃపురాలు ఏకం చేశారన్నమాట.
గతంలో హరిహరుని మరణవార్త అందినప్పటి సంఘటన గుర్తొచ్చింది. అద్దంకి, పాకనాడు రాజ్యాల మతగొడవల సమయంలో.. “దేవరా తమరికి ప్రత్యేక వార్త” అంటూ అనుమకొండ వార్తాహరుడు లేఖాపత్రాన్ని అందించాడు. ‘హరిహరదేవుడు మరణించాడు..’ భారంగా కుప్పకూలిపోయాడు. తమ పిల్లలు తమ కళ్లముందే మరణించడం.. హతవిధీ!! పసివాడిగా ఉన్నప్పుడే అతనిపై విషప్రయోగం జరిగినప్పటినుంచీ హరిహరదేవుడు కోలుకోలేదు. ఎప్పుడూ ఏదో అనారోగ్యమే. చివరికి శివసాయుజ్యం పొందాడు. “ఒకడికి మేము కొలిచే మురారి అని, మరొకడికి హరిహరులకు భేదం లేదని మేము నమ్మినట్లు హరిహర దేవుడు అని నామకరణం చేద్దాము..” అన్నాడు గణపతిదేవుడు కొడుకులు పుట్టిననాడు.
అక్కకు, బావగారికి గర్భశోకం!
ఇద్దరు కళాకారులు తీవ్ర అవమానభారంతో, విషాద హృదయాన్ని రసావిష్కరణ జరిపితే.. ఆ నృత్తం, తదనుగుణమైన డప్పువిన్యాసం ఎలా ఉంటుందో ఆ అర్ధరాత్రి కటికచీకటిలో.. పైన చంద్రుడు,
దగ్గరగా కృష్ణమ్మ, ఆవలగా సముద్రుడు మౌనంగా సజలనయనాలతో వీక్షించారు.
– (సశేషం)