పనిభారం, ఎదుటివారికి మాటివ్వడం, వ్యక్తిగత సంబంధాల్లో భావోద్వేగాలకు పోవడం మొదలైన వాటి వల్ల ఏదో ఒక పనిలో తలమునకలవడం, ఇతర ప్రదేశాలకు ప్రయాణాలు మొదలైన వాటి కారణంగా మనం అప్పుడప్పుడు నిస్ర్తాణకు గురవుతాం. అలసిపోతాం. ఈ సమస్య నుంచి బయటపడటానికి, మన శక్తిని నిలిపి ఉంచుకోవడానికి నిపుణులు కొన్ని మార్గాలు సూచిస్తున్నారు. అవి… మనకు అంత ప్రధానం కాని పనులు, ఆహ్వానాలను సున్నితంగా తిరస్కరించాలి, ప్రతికూల ఆలోచనలు ఉన్నవారికి దూరంగా ఉండాలి, ధ్యానం చేయాలి, మనల్ని ప్రశాంతంగా ఉంచే సానుకూల వాతావరణం సృష్టించుకోవాలి, మన గురించి మనం శ్రద్ధచూపాలి, మన శక్తిని మనకు తెలియకుండానే హరించివేసే స్మార్ట్ఫోన్లకు విరామం ప్రకటించాలి.
భారతదేశంలోని అతిపెద్ద, అధిక కాలుష్యం కలిగిన పది మహానగరాల్లో రోజువారీగా సంభవించే మరణాల్లో 7.2 శాతం కేసులు గాలిలో పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం) 2.5 రేణువులు అధిక స్థాయిలో ఉండటం వల్ల కలుగుతున్నాయట. ద లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనాన్ని ఓ అంతర్జాతీయ పరిశోధక బృందం, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్ శాస్త్రవేత్తలతో కలిసి నిర్వహించింది. శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం 2008 2019 సంవత్సరాల మధ్య కాలంలో పది భారతీయ నగరాల్లో పీఎం 2.5 కాలుష్యం కారణంగా జరిగిన రోజువారీ మరణాల సంఖ్య రమారమి 36 లక్షలు. ఈ నగరాల జాబితాలో హైదరాబాద్ కూడా ఉండటం గమనార్హం.